ధ‌ర‌లు త‌గ్గాయ‌ని ఇల్లు కొనాల‌నుకుంటున్నారా?

కొనుగోలుదారులను ఆకర్షించే అంశాల ప‌ట్ల శ్ర‌ద్ధ‌ వహించి, జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యం తీసుకోవాలి

ధ‌ర‌లు త‌గ్గాయ‌ని ఇల్లు కొనాల‌నుకుంటున్నారా?

ఇంటిని కొనుగోలు చేయానుకోవ‌డం చాలా పెద్ద నిర్ణ‌యం. ధ‌ర‌లు త‌గ్గాయ‌నో లేదా తొంద‌ర‌పాటుతో తప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌న్న విష‌యాలు గుర్తుంచుకోండి. ఇంటిని కొనేముందు పరిగణించవలసిన నాలుగు విషయాలు ఏంటో తెలుసుకోండి

కొనుగోలుదారులకు ఎర
క‌రోనా మ‌హ‌మ్మారితో పెద్ద ఆర్థిక ఎదురుదెబ్బ తగిలిన వెంటనే ప్రజలు మళ్లీ ఇళ్లను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఎందుకంటే డిస్కౌంట్లు, తక్కువ రేట్లు: డిస్కౌంట్లు, చెల్లింపు పథకాలను అందించడానికి బిల్డర్లు హడావిడి చేస్తున్నారు

మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ త‌గ్గించాయి. డెవలపర్లు ఆఫర్లు, ఆర్థిక పథకాలపై అన్ని ఛార్జీల‌ను ఉపసంహరించుకున్నారు. దీంతోపాటు తక్కువ గృహ రుణ రేట్లు కొనుగోలుదారులను ఆక‌ర్షించే మ‌రో అంశంగా మారింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఆగ‌స్ట్ నుంచి నివాస అమ్మకాలు క్రమంగా మెరుగుపడ్డాయి, సెప్టెంబరులో, ముఖ్యంగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో, పూణేలలో కోవిడ్-19 కంటే ముందు స్థాయులకు ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి. పండుగ సీజన్ అదనపు డిమాండ్ పెంచింద‌ని భావిస్తున్నారు.

సొంతింటి క‌ల‌
భవిష్యత్తులో అనిశ్చితిని నివారించడానికి ఇంటిని సొంతం చేసుకోవడం కొనుగోలుదారులను ఆకర్షించే మరో అంశం. క‌రోనా మహమ్మారి చాలా మంది భారతీయుల ప్రాధాన్యత జాబితాలో ఇంటి కొనుగోలు అంశాన్ని చేర్చింది. అద్దె భారాన్ని త‌గ్గించుకోవ‌డానికి, భవిష్యత్ అనిశ్చితి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ఈ ఆస్తిని ఒక భ‌రోసాగా భావిస్తున్నారు. ఉద్యోగాల్లో కొన‌సాగుతున్న‌వారు ఇంటి కొనుగోలు వైపు ఆలోచించే ఆవశ్యకత ఇప్పుడు ఎక్కువ‌గా ఉందని నిపుణులు చెప్తున్నారు.

పరిగణించవలసిన అంశాలు
మీరు మంచి డిస్కౌంట్ లేదా గొప్ప మొత్తాన్ని పొందవచ్చని భావించి ఇంటిని కొనాల‌నుకోవ‌డం తొంద‌ర‌పాటు ఆలోచ‌న‌గా చెప్తున్నారు.

ధర దిద్దుబాటు:
కొనుగోలుదారులను ప్రోత్సహించే మరో అంశం ఏమిటంటే, మహమ్మారి కారణంగా అమ్మకాలు క్షీణించినందున రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయి.

కానీ, ప్రాధమిక అమ్మకాల విభాగంలో ఆస్తి ధరలు నిజంగా తగ్గలేదు. అసాధారణమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొంతమంది డెవలపర్లు గణనీయమైన తగ్గింపులను అందిస్తున్నారు, కానీ దీని అర్థం ధరలు అంతటా పడిపోయాయని కాదు. ఈ స‌మ‌యంలో వివిధ డిస్కౌంట్లు, ప్రోత్సాహకాలను పరిశీలిస్తే, ఇంటిని కొన‌డానికి త‌గ్గే ఖ‌ర్చు 10-12 శాతంగా మాత్ర‌మే ఉండ‌వ‌చ్చు.

ధరల దిద్దుబాటు దేశ‌వ్యాప్తంగా లేదు. మహమ్మారి కారణంగా దిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, చెన్నై, పూణే, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో సగటు గృహాల ధరలు 4-5 శాతం తగ్గాయి. అయితే, ఇదే కాలంలో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్ల‌ ధరలు 3-4 శాతం పెరిగాయి.

స్థోమత:
ఇంటిని ప్రారంభించడానికి, మీరు మీ స్థోమత సామర్థ్యాన్ని అంచనా వేయాలి. అద్దె చెల్లించడం నుంచి ఈఎంఐల‌కు మారాల‌నుకుంటున్న వారి సంఖ్య‌ చాలా ఎక్కువ‌గా ఉంది. ప్రధాన మెట్రో న‌గ‌రాల్లో వార్షిక అద్దెలు ఇంటి ఆస్తి విలువలో 1.5 శాతం 2.5 శాతం మధ్య ఉంటాయి. గృహ రుణ రేట్లు తగ్గుతున్నప్పటికీ, అద్దెలు మాత్రం త‌గ్గించే ప‌రిస్థితి లేదు. అయిన‌ప్ప‌టికీ ఈఎంఐ, ఇంటి అద్దెకు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉంది. ఇత‌ర ఖ‌ర్చుల‌తో లెక్కిస్తే స్థిరాస్తి కొనుగోలు చాలా వెచ్చించాల్సి ఉంటుంద‌న్న విష‌యం గుర్తుంచుకోవాలి.

ఇతర ఆర్థిక లక్ష్యాలు:
ఇంటి కొనుగోలు వ‌ల‌న‌ మీ ఇతర ఆర్థిక లక్ష్యాలను ప్రభావితం చేస్తుందో లేదో కూడా మీరు అంచనా వేయాలి. ఇంత పెద్ద నిర్ణ‌యం ఇతర ఆర్థిక లక్ష్యాలపై ఎంత ప్రభావం చూపుతుందో పునపరిశీలించడం చాలా ముఖ్యం, ముఖ్యంగా వేతన కోతలను ఎదుర్కొంటున్న వారికి ఇది భారంగా మార‌వ‌చ్చు. ఇంటి ఈఎంఐ చేతికి వ‌చ్చే జీతంలో 30 శాతం కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి.

ప్ర‌దేశం:
ఇల్లు కొనేటప్పుడు ఎక్క‌డ కొనుగోలు చేస్తున్నామ‌న్నిది కూడా కీలకం. ఆర్థిక కార్యకలాపాల కేంద్రం నుంచి దూరం, సామాజిక మౌలిక సదుపాయాలకు ప్రాప్యత, ఆర్థిక కేంద్రంగా ఈ ప్రదేశం మొత్తం వృద్ధి వంటి కొన్ని విషయాలతో గృహాలను కొనుగోలు చేయాలి. ప్రస్తుత దృష్టాంతంలో, భ‌విష్య‌త్తులో అక్క‌డ అభివృద్ధి చెందుతుద‌న్న భావ‌న‌తో ఇల్లు కొనడం తెలివైనది కాదు, ఎందుకంటే అభివృద్ధి చెందని ప్రదేశాల వృద్ధి సామర్థ్యాన్ని సరిగ్గా అంచ‌నా వేయలేం.

ఒక సొంతింటిని క‌లిగి ఉండాల‌న్న కోరిక‌తో తొంద‌ర‌ప‌డుతున్నారా లేదా బిల్డర్‌లు ప్రకటనలు ఇస్తున్న అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్ల ప్రలోభాలకు లోనవుతున్నారా అనే విష‌యంలో స్ప‌ష్ట‌త తెచ్చుకొని అన్ని విష‌యాలున ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని మీ ఆర్థిక స్థితిని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌డం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly