పెట్టుబడుల ఆధారంగా మ్యూచువల్ ఫండ్ల రకాలు!!

ఫండ్ సమీకరించిన మొత్తాన్ని ఏ సాధనాలలో పెట్టుబడి చేస్తున్నారు అనే విషయం ఆధారంగా మ్యూచువల్ ఫండ్లలో రకాలు..

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను పెట్టుబ‌డి పెట్టే సాధ‌నాల‌ను బ‌ట్టి మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను వివిధ రకాలుగా చూడ‌వచ్చు. షేరు మార్కెట్ సంబంధిత సాధ‌నాల్లో పెట్టుబ‌డులు పెట్టే వాటిని ఈక్విటీ ఫండ్లు అని, స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేసే వాటిని డెట్ ఫండ్లు అని, షేరు మార్కెట్, స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాలు రెండింటిలోనూ మిశ్ర‌మంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్ల‌ను బ్యాలెన్స్డ్ ఫండ్లు అంటారు.
2.jpg

ఈక్విటీఫండ్లు :

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను వివిధ కంపెనీల షేర్లులో మ‌దుపుచేసే ఫండ్లను ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు అంటారు. ఇవి ఎక్కువ రాబడిని ఇస్తాయి అలాగే ఎక్కువ న‌ష్ట‌భ‌యమూ క‌లిగి ఉంటాయి. షేర్ మార్కెట్ ఒడుదొడుకులు ఈ ఫండ్ల‌పై ప్ర‌భావం చూపుతాయి. సాధార‌ణంగా న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌ తీసుకునే మ‌దుప‌ర్లు ఈ ఫండ్ల‌ను ఎంచుకుంటారు. అయితే ఈక్విటీ ఫండ్ల‌లో ర‌కార‌కాల వ్యూహాలు, విధానాలను బ‌ట్టి వివిధ‌ ర‌కాల ఫండ్లు ఉంటాయి.

డెట్ ఫండ్లు :

స‌మీక‌రించిన నిధుల‌ను స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేస్తారు. వీటిలో ఆదాయం ఆర్ధిక వ్యవస్థలో ఉన్న వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ ఫండ్లతో పోల్చితే ఇవి త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉంటాయి. సాధార‌ణంగా స్థిరమైన రాబడి, తక్కువ‌ న‌ష్ట‌భ‌యం ఉండే మ‌దుప‌ర్లు ఈ ఫండ్ల‌ను ఎంచుకుంటారు. పెట్టుబ‌డి పెట్టే వ్యవధి, సాధనాలను బ‌ట్టి ఈ ఫండ్లలో లిక్విడ్, గిల్టు, ఇన్కమ్ అని వివిధ‌ ర‌కాలు ఉంటాయి.

బ్యాల‌న్స్‌డ్ ఫండ్లు :

పెట్టుబడికి స్థిరత్వం, వృద్ధిని కల్పించే విధంగా పెట్టుబ‌డిలో కొంత శాతం షేర్లలో, కొంతశాతం బాండ్లు, డిబెంచ‌ర్లల్లో పెట్టుబ‌డిచేసే ఫండ్ల‌ను బ్యాలెన్స్డ్ ఫండ్లు అంటాం. ఈక్విటీలో పెట్టుబ‌డితో వృద్ధిని డెట్ లో పెట్టుబ‌డితో స్థిర‌త్వాన్నిబ్యాల‌న్స్‌డ్ ఫండ్లతో పొంద‌వ‌చ్చు. ఈక్విటీ ఫండ్ల‌తో పోలిస్తే వీటిలో న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌. స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకుల‌ను త‌ట్టుకునే విధంగా ఫండ్ మేనేజ‌రు పోర్టుఫోలియో ను బ్యాలెన్స్ చేస్తుంటారు. స్టాక్ మార్కెట్ అనుకూలంగా లేన‌పుడు పెట్టుబ‌డుల‌ను డెట్ లోకి మార్చి బ్యాలెన్స్ చేస్తారు. అదే విధంగా వ‌డ్డీ రేట్లు అనుకూలంగా లేన‌పుడు పెట్టుబ‌డిని ఈక్విటీలోకి మార్చి బ్యాలెన్స్ చేస్తారు

ఇవే కాకుండా, ఇతర ఫండ్లో పెట్టుబడి పెట్టే ఫండ్లు, ఇతర దేశాలలో పెట్టుబడి పెట్టే ఫండ్లు, ఏదైనా ఒక థీమ్ ఆధారంగా పెట్టుబడి పెట్టే వివిధ రకాల ఫండ్లు పెట్టుబడి దారుని ఆశయాలకు అనువుగా అందుబాటులో ఉన్నాయి.
మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం, కాల‌ప‌రిమితి, పెట్టుబ‌డి చేయాల‌నుకుంటున్న మొత్తం మొద‌లైన విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిర్ణ‌యాలు తీసుకోవాలి. పెట్టుబ‌డుల‌పై అవ‌గాహ‌న ఉన్న‌ మ‌దుప‌ర్లు స్వ‌యంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌చ్చు. అవ‌గాహ‌న లేని వారు ఆర్థిక స‌ల‌హాదారుని సంప్ర‌దించి త‌మ‌కు స‌రిపోయే ఫండ్ల‌ను ఎంపిక‌చేసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly