ఈఎమ్ఐ ద్వారా రుణ చెల్లింపులు జరిగేదిలా!!

ఈఎంఐ రూపంలో రుణ చెల్లింపులు చేస్తుంటాం. ఈఎమ్ఐ లెక్కింపు, రుణం చెల్లించే విధానం గురించి తెలుసుకుందాం.

ఈఎమ్ఐ ద్వారా రుణ చెల్లింపులు జరిగేదిలా!!

ప్ర‌స్తుత రోజుల్లో వినియోగ‌దార్లు ఖ‌రీదైన వ‌స్తువులు కొనుగోలుచేసేందుకు మొత్తం ధ‌ర ఒక్క‌సారిగా చెల్లించి కొనే వారికంటే ఈఎమ్ఐల ద్వారా కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. సెల్ ఫోన్ నుంచి గృహం వ‌ర‌కు ఏదైనా ఈఎమ్ఐ ద్వారా కొనుగోలుచేసే అవ‌కాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే వినియోగ‌దార్ల జీవితంలో ఈఎమ్ఐ ఒక కీల‌క పాత్ర పోషిస్తుంది.
సాయి అనేవ్య‌క్తి రూ.25 ల‌క్ష‌ల గృహ‌రుణం 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి, 10.5శాతం వ‌డ్డీకి ఏప్రిల్ 2013 న ఒక బ్యాంకు నుంచి తీసుకున్నాడు. ప్ర‌తీ నెల రూ.27,635 నెల‌స‌రి వాయిదా చెల్లించాడు. మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత అంటే ఏప్రిల్ 2016న త‌ను ఇంకా మొత్తం ఎంత చెల్లించాల‌న్న‌ది చూసుకుంటే రూ.2,249,618 ఉంది. దీంతో సాయి కంగారు ప‌డి బ్యాంకు వారిని ఏం జరిగిందో సంప్ర‌దించాడు. ఇలాంటి ప‌రిస్థితి మ‌న‌లో కొంద‌రికి ఎదురుపడుతుంది.

మ‌రి ఈ విష‌యాలు అర్థ‌మ‌వ్వాలంటే ఈఎమ్ఐ గురించి వివరాలు తెలుసుకోవాలి.

ఈఎమ్ఐ అంటే లోను తాలూకు అస‌లు, వ‌డ్డీలను లోను పూర్తి కాలం పాటు నెల నెలా సమానంగా చెల్లించే ఏర్పాటు.
సాయి విషయమే చూస్తే, తాను తీసుకున్న రూ.25ల‌క్ష‌ల గృహ‌రుణానికి ప్ర‌తీనెల రూ.27,635 ఈఎమ్ఐ చేల్లిస్తుంటే మొద‌టి నెల‌ ఈఎమ్ఐలో అస‌లు రూ.5,760, వ‌డ్డీ రూ.21,875 ఉంది. ప్రారంభంలో వ‌డ్డీ భాగం ఎక్కువ‌గా అస‌లు భాగం త‌క్కువ‌గా ఉంటుంది. కాలం గ‌డిచిన కొల‌ది వ‌డ్డీ భాగం త‌గ్గుతూ అసలు భాగం పెరుగుతూ ఉంటుంది.
రూ.25ల‌క్ష‌ల గృహ‌రుణం 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి, 10.5శాతం వ‌డ్డీకి ఈఎమ్ఐ కింది విధంగా ఉంటుంది. ఏప్రిల్ 2013 న ప్రారంభ‌మై ఏప్రిల్ 2027తో ముగుస్తుంది.

LOAN-EMI.jpg

మొద‌టి సంవ‌త్స‌రం చెల్లించిన అస‌లు రూ.72,545. కాగా, చివ‌రి సంవ‌త్స‌రం చెల్లించిన అస‌లు రూ. 2, 84,855గా ఉంది. ఈఎమ్ఐ రుణం, కాల‌ప‌రిమితి, వ‌డ్డీరేట్లపై ఆధార‌ప‌డి ఉంటుంది.
LOAN-EMI-GRAPH.jpg
పైన రుణ చెల్లింపుల పట్టికలో గమనిస్తే, మొద‌టి 9 సంవ‌త్స‌రాలు ఈఎంఐలో వడ్డీ మొత్తం ఎక్కువగాను, అస‌లు త‌క్కువ‌గానూ ఉంది. 10వ సంవ‌త్స‌రం నుంచి అస‌లు ఎక్కువ‌గా, వడ్డీ త‌క్కువ‌గా ఉంది.

ఈఎమ్ఐలు మూడు విష‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటాయి. రుణ మొత్తం, వ‌డ్డీరేటు,కాలావ‌ధి.

ఈఎమ్ఐలో మార్పులకు కారణాలు :

వ‌డ్డీ రేట్లు మారినప్పుడు :

ఫిక్సిడ్ రేట్ రుణాల్లో వ‌డ్డీరేట్లు మార్కెట్లో మారిన‌ప్ప‌టికీ ఈఎమ్ఐ చెల్లింపులో మార్పుండ‌దు.
ఫ్లోటింగ్ రేట్ రుణాల్లో వ‌డ్డీరేట్లు మారిన‌పుడు ఈఎమ్ఐ పై ఆ ప్ర‌భావం ఉంటుంది. వ‌డ్డీరేటు పెరిగిన‌పుడు ఈఎమ్ఐ పెరుగుతుంది వ‌డ్డీరేటు త‌గ్గిన‌పుడు ఈఎమ్ఐ కూడా త‌గ్గుతుంది.

కాల‌ప‌రిమితి

రుణం తీసుకున్న వ్య‌క్తి లోను కాల‌ప‌రిమితి కంటే ముందుగా చెల్లించాల‌నుకుంటే అత‌ని ఈఎమ్ఐ పెరుగుతుంది.
కొంత ఆల‌స్యంగా అంటే నిర్ణ‌యించిన కాల‌ప‌రిమితి కంటే ఎక్కువ స‌మ‌యం కావాల‌నుకుంటే అత‌ని ఈఎమ్ఐ త‌గ్గుతుంది.
ఎక్కువ‌కాల ప‌రిమితి ఉంటే నెల‌స‌రి చెల్లింపు త‌క్కువ‌గా ఉంటుంది. తొంద‌ర‌గా రుణం తీర్చాల‌నుకుంటే కొంచెం ఎక్కువ మొత్తం ఈఎమ్ఐగా క‌ట్టాల్సిఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly