యూనిట్‌ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీలు

యులిప్స్‌ ప్ర‌యోజ‌నాల‌ను మ‌రింత ముందుకు తీసుకెళ్లి ఆరోగ్య బీమాకు వ‌ర్తింప‌జేసి రూపొందించిన ప‌థ‌కం ఇది.

యూనిట్‌ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీలు

సాధారణ ఆరోగ్య బీమా పాలసీల్లో హామీ ఇచ్చిన మేర సొమ్మును చెల్లించే ఏర్పాట్లు చేస్తాయి బీమా కంపెనీలు. ఆ పరిమితికి మించి ఖర్చైనా, బీమా వర్తించని ఆరోగ్య సమస్యలెదురైనా లేదా వెయిటింగ్‌ పీరియడ్‌ పూర్తి కాని అనారోగ్య సమస్యలకు సంబంధించిన ఇతర ఖర్చులకు పాలసీదారుడు తన చేతి నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పరిమితులను అధిగమించేందుకు ఆరోగ్య బీమాతో పాటు పెట్టుబడులను సైతం ప్రోత్సహించేవే యూనిట్‌ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీలు(యూఎల్‌హెచ్‌పీ).

సాధారణ ఆరోగ్య బీమా పాలసీల్లానే ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చులు, నర్సింగ్‌ ఖర్చులు, అంబులెన్స్‌కు, వైద్యుడి కన్సల్టేషన్‌ ఫీజు లాంటి వాటికి ఈ యూఎల్‌హెచ్‌పీ బీమా అందిస్తుంది.

ముఖ్యమైన అంశాలు:

 • ఈ పాలసీలు ఒకే వ్యక్తి తీసుకోవచ్చు లేదా కుటుంబమంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌గానూ పొందొచ్చు.

 • ఈ పాలసీలో హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌ అంటే ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుంటే అయ్యే ఖర్చులు, శస్త్రచికిత్సలకయ్యే (సర్జికల్‌ బెనిఫిట్‌) ఖర్చులు చెల్లిస్తారు.

 • హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌ను బట్టి పాలసీలో ప్రీమియాన్ని నిర్ణయిస్తారు.

 • ప్రీమియంలో కొంత భాగం బీమాకు కేటాయించి మిగిలిన మొత్తాన్ని మార్కెట్‌లో పెట్టుబడుల్లో పెడతారు.

 • ఈ పెట్టుబడులు వ్యక్తి వయసు, నష్టభయం తట్టుకునే శక్తిని బట్టి మారుతూ ఉంటాయి. ఎంత మేరకు ఈక్విటీల్లో లేదా ఎంత మేరకు డెట్‌ పథకాల్లో పెట్టుబడులు పెట్టాలో నిర్ణయించుకునే వీలు పాలసీదారుడికి ఉంటుంది.

 • వీటిలో ఫండ్‌ మేనేజర్లు, పెట్టుబడులకు నిర్వహణ ఛార్జీలు విధిస్తారు.

 • ఈ పాలసీలకు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఆ సమయం పూర్తయ్యే వరకు పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు వీల్లేదు.

 • ఈ పాలసీలు పెట్టుబడులతో కూడుకున్నవి కాబట్టి వీటికి స్వాధీన విలువ ఉంటుంది. అయితే ఈ విలువ వచ్చేందుకు నిర్ణీత కాలపరిమితి ఉంటుంది.

 • బీమా వ్యవధి ముగిశాక పెట్టుబడులు, వాటిపై వచ్చే బోనస్‌ను కలిపి పాలసీదారుకు అందిస్తారు.

ప‌రిమితులుః

 • యూఎల్‌హెచ్‌పి పాలసీలు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూలిప్‌ పాలసీలు నగదురహిత సదుపాయాన్ని అందించడం లేదు.

 • ఈ పాలసీలపై నో క్లెయిం బోనస్‌ వర్తించదు.

 • ఆసుపత్రిలో చేరి కనీసం రెండు రోజుల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా వర్తిస్తుంది.

 • నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఈ పాలసీలో అందుబాటులో లేవు కాబట్టి ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పాలసీని ఎంచుకోవడం మంచిది.

పన్ను మినహాయింపు

ఈ పాలసీలు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 సీ, 80 డీ పరిధిలోకి వస్తాయి.

బీమాను, పెట్టుబడులను విడివిడిగా చూడమని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. ఓ సమగ్ర ఆరోగ్య బీమా కలిగి ఉండి, ఆ బీమా పరిమితికి మించి అయ్యే ఖర్చులకు, పాలసీ వర్తించని అనారోగ్య సమస్యలకు అదనపు సొమ్ము అవసరమవుతుందనుకుంటే ఆరోగ్య అవసరాలకు అత్యవసర నిధిని ఏర్పాటుచేసుకోవడం మంచిది. ఈ నిధిని నష్టభయం తక్కువ ఉండి వెంటనే ఉపసంహరించుకునే వీలున్న పథకాల్లో పెట్టుబడి పెడితే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly