పెట్టుబ‌డుల్లో భాగంగా ఇంటిని కొనేట‌ప్పుడు ప‌రిశీలించాల్సిన అంశాలు

ఇంటిని కొనుగోలు చేయ‌డం చాలా పెద్ద నిర్ణ‌యం. అందుకే ఈ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి

పెట్టుబ‌డుల్లో భాగంగా ఇంటిని కొనేట‌ప్పుడు ప‌రిశీలించాల్సిన అంశాలు

చాలా మంది ఇంటిని ఒక పెట్టుబ‌డిగా చూస్తారు. అయితే ఇంటిని పెట్టుబ‌డుల ఉద్దేశంతో కొనుగోలు చేయాల‌నుకోవ‌డం చాలా పెద్ద‌ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్లు గుర్తించాలి. అందుకే స్థిరాస్తిని కొనుగోలు చేసేముందు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

ప్రాంతం :

ప్రాప‌ర్టీ ఉన్న ప్రాంతం చాలా కీల‌క‌మైన‌ది. భ‌విష్య‌త్తులో ఆస్తి విలువ పెరిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. కార్యాల‌యాల‌కు, స్కూళ్ల‌కు, కాలేజీల‌కు, మార్కెట్‌కు, ఆసుప‌త్రుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటే ఇంటి విలువ పెరిగే అవ‌కాశం ఉంటుంది. చాలామంది ఇవ‌న్నీ సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే నివ‌సించాల‌నుకుంటారు. అదేవిధంగా వాస్తు, స్విమ్మింగ్ పూల్, ఇంటి ముందు ఎక్కువ స్థ‌లం ఉంటే ఎక్కువ ధ‌ర వ‌స్తుంది.

ప్రాప‌ర్టీకి దగ్గ‌ర‌గా ఉన్న మౌలిక స‌దుపాయాలు :

ప్లై ఓవ‌ర్, వంతెన‌లు భ‌విష్య‌త్తులో ఆ ప్రాంతాల్లో నిర్మించే అవ‌కాశ‌ముంటే ప్రాప‌ర్టీ విలువ పెరుగుతుంది. దీంతో య‌జ‌మానులు కూడా ధ‌ర‌లు ఎక్కువ పెంచే అవ‌కాశం ఉంటుంది. కొత్త మౌలిక ప్రాజెక్టు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టిస్తే ధ‌ర ఒక్క‌సారిగా 50 శాతం ఎక్కువ‌గా పెంచే అవ‌కాశం ఉంటుంది. తాజాగా వ‌చ్చిన మెట్రో రైల్, ఓఆర్ఆర్‌, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులతో ధ‌ర‌లు పెరిగిన సంగతి తెలిసిందే.

క‌నెక్టివిటీ :

ప్ర‌జా ర‌వాణా స‌దుపాయం లేకుంటే అటువంటి ప్రాంతాన్ని ఎంచుకునేందుకు ఎవ‌రు ఇష్ట‌ప‌డ‌రు. రైల్వే స్టేష‌న్‌, మెట్రో రైల్‌, బ‌స్ స్టేష‌న్‌, ఇత‌ర వ‌స్తు ర‌వాణా స‌దుపాయం ఉన్న ప్రాంతాల్లో ఇంటిని తీసుకునేందుక‌ మొగ్గుచూపుతారు. ఇటువంటి ప్రాంతాల్లో ధ‌ర‌లు వేగంగా పెరుగుతాయి.

స్థానికత‌ :

కొన్ని బాగా అభివృద్ది చెందిన ప్రాంతాల్లో ఇత‌ర వాటితో పోలిస్తే ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు హైద‌రాబాద్‌లో జూబ్లిహిల్స్‌, బంజారాహిల్స, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు. ఇక్క‌డ ఇల్లు కొనుగోలు చేయ‌డం అంటే భారీగా పెట్టుబ‌డులు పెట్టాల్సిందే.

అద‌న‌పు సౌక‌ర్యాలు, భ‌వ‌నం నాణ్య‌త‌ :

గార్డెన్‌, స్విమ్మింగ్‌పూల్‌, జిమ్, భ‌ద్ర‌త‌, పార్కింగ్ ప్లేస్, ఆడిటోరియం వంటి అద‌న‌పు సౌక‌ర్యాలున్న ఇంటికి ఎక్కువ రేటు ల‌భిస్తుంది. ఇంటిని తిరిగి విక్ర‌యించేందుకు కొనుగోలు చేస్తే భ‌వ‌నం నాణ్య‌త‌ను ప‌రిశీలించాలి. సంద‌ర్భాన్ని బ‌ట్టి పేయింటింగ్, రినోవేష‌న్ చేస్తే ఎక్కువ ధ‌ర వ‌స్తుంది.

ఇంటి ప‌రిమాణం కూడా చాలా ముఖ్యం. మ‌రీ చిన్న‌ది లేదా చాలా పెద్ద ఇంటిని కొనుగోలు చేయ‌కూడ‌దు. సాధార‌ణంగా ఇత‌ర‌ వాటితో పోలిస్తే 2బిహెచ్‌కె ఫ్లాట్ల‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇక చాలామంది వాస్తు వంటి అంశాల‌ను కూడా దృష్టిలో పెట్టుకొని ఇల్లు తీసుకుంటారు.

మంచి ప్రాంతాల్లో ఉండే అపార్డుమెంట్ల‌కు త‌క్కువ ధ‌ర ఉంటుంది, కానీ అద్దె ఎక్కువ‌గా ఉంటుంది. ఇండిపెండెంట్ ఇళ్ల‌కు, సిటీకి కొంచెం దూరంలో ఉన్నా ధ‌ర‌ ఎక్కువ‌గా, అద్దె త‌క్కువ‌గా ఉంటుంది. అయితే ఫ్లాట్‌ల కంటే ఇళ్ల‌కు మూల‌ధ‌న విలువ ఎక్కువ‌.

ఇళ్లు కొనుగోలు చేయ‌కూడ‌ని ప్రాంతాలు :

మురికి ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఇళ్లు :

మురికి ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ఇళ్ల‌ను సాధార‌ణంగానే ఎవ‌రు కొనుగోలు చేయ‌రు. కొంత‌మంది అక్క‌డ ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని కొనుగోలు చేసి త‌ర్వాత బాధ‌ప‌డ‌తారు. నేరాలు ఎక్కువ‌గా జ‌రిగే ప్రాంతాల్లో ఇంటిని కొనుగోలు చేయ‌కూడ‌దు.

మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న ప్రాంతాలు :

ఆలయం, మసీదు, చ‌ర్చీల‌ సమీపంలో ఇంటిని కొంటే ఇబ్బందులు ఏర్ప‌డ‌వ‌చ్చు. ప్రార్థ‌న‌లు, లౌడ్ స్పీకర్ల‌తో కొంత ఇబ్బంది క‌ల‌గ‌వ‌చ్చు. ఇక ప్ర‌జ‌లు ఎక్క‌వ‌గా వ‌చ్చే ఈ ప్రాంతాల్లో పార్కింగ్ లేదా ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు ఎదురుకావొచ్చు.

ఇవి కాకుండా ఇప్ప‌టికే ధ‌ర ఎక్కువ‌గా పెరిగిన‌ ప్రాంతాల్లో ఇంటిని కొనుగోలు చేయ‌క‌పోవ‌డం మంచిది. మ‌రింత పెరిగేందుకు మీరు చాలా కాలం ఎదురుచూడాల్సి రావొచ్చు. ప్రాప‌ర్టీని కొనుగోలు చేసేముందు ఇవ‌న్నీ విష‌యాలు దృష్టిలో పెట్టుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly