పీ2పీ లెండింగ్ అంటే ఏంటి?

పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రు అప్పుగా డ‌బ్బు ఇవ్వడం, తీసుకోవ‌డం.

పీ2పీ లెండింగ్ అంటే ఏంటి?

చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక వనరులను మెరుగుపర్చగల సామర్థ్యం పీర్-టూ-పీర్(పీ 2 పీ ) రుణాలకు ఉన్నట్లుగా గత వారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. ప్రస్తుతం పీ 2 పీ వేదికగా పనిచేసేందుకు 11 కంపెనీలు లైసెన్స్ పొందాయి.

పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఒక‌రి నుంచి మ‌రొక‌రు అప్పుగా డ‌బ్బు ఇవ్వడం, తీసుకోవ‌డం. దీన్నే సంక్షిప్తంగా పీ2పీ లెండింగ్ అంటారు. అంటే రుణ గ్ర‌హీత‌లను, రుణదాత‌లను ఒకే వేదిక‌పైకి తీసుకురావ‌డం. ఇవి బ్యాంకులు ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్లకు మాదిరిగా పనిచేయవు. ఇందులో రుణదాత మీ వంటి వ్యక్తులు కావచ్చు లేదా ఆర్థిక సంస్థలు కావచ్చు. ఫెయిర్ సెంట్, ఐ 2ఐ ఫండింగ్, పీర్లాండ్ వంటి పీ2పీ సంస్థలకు ఆర్థికేతర బ్యాంకింగ్ సంస్థల లైసెన్సు ఉంది.

ఎలా పనిచేస్తుంది?

మీరు భారతీయులైతే ఈ వేదిక ద్వారా రుణం తీసుకోవచ్చు. ఇందుకుగాను మీ పేరు, చిరునామా, కాంటాక్ట్ నెంబర్, పుట్టిన తేది, జెండర్, తీసుకోవాలనుకుంటున్న రుణం మొత్తం, ఉద్యోగం, ఆదాయం, పాన్ వంటి పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ఈ వేదికను ఉపయోగించి వ్యక్తిగత రుణం లేదా వ్యాపారానికి ఋణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు 8.95 శాతం నుంచి 30శాతం వరకు ఉంటుంది. రూ. 30,000 నుంచి రూ. 5 లక్షల వరకు రుణం పొందడానికి అవకాశం ఉంది. సాధారణంగా వ్యాపారం, గృహ మరమ్మత్తులు, కుటుంబంలో జరిగే శుభకార్యాలకు రుణం పొందచ్చు.

ఏం చెయ్యాలి?

ఖర్చుల కోసం రుణం తీసుకోవడం మంచిది కాదు. అయినప్పటికీ రుణం తీసుకోవాలనుకుంటే వడ్డీ రేట్లను పోల్చి చూడడం మంచిది. ప్రోసెసింగ్ రుసుములు రుణం మొత్తంపై 3 శాతం నుంచి 5.5 శాతం వరకు ఉండొచ్చు. మీరు నాన్‌- బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ‌ను ఎంచుకుంటే మీ క్రెడిట్ స్కోర్ ఫై కూడా ప్రభావం చూపిస్తుంది. క్రెడిట్ స్కోర్ ఫై ప్రభావం చూపించకుండా సమయానికి చెల్లింపులు చేయాలి.

రాబ‌డికి హామీ ఉండ‌దు:

ఈ వేదిక‌ల ద్వారా రుణం ఇచ్చి వ‌డ్డీ పొందాల‌నుకునే వారు గుర్తుంచుకోవాల్సింది వీటిలో డ‌బ్బు తిరిగి చెల్లించే దానిపై హామీ ఉండ‌దు. ఈ లెండిగ్ యాప్ లు స‌ర్వీసు మాత్ర‌మే అందిస్తాయి కానీ ఇత‌ర ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌కు చ‌ట్ట‌ప‌రంగా భాద్య‌త వ‌హించ‌వు. ఈ యాప్ లు వినియోగించే ముందు పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డం మంచిది. ఇందులో రిస్క్ ఆధారంగా రాబడి ఉంటుంది. ఒక్కోసారి అసలు మొత్తాన్ని కోల్పోవలసి రావచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly