ఉద్యోగుల‌పై ప్రామాణిక త‌గ్గింపు ప్ర‌భావం ఎంత ?

కొత్త‌గా ప్ర‌వేశపెట్టిన ప్రామాణిక త‌గ్గింపు ప్ర‌భావం ఉద్యోగుల‌పై ఎలా ఉంటోంది అనే విష‌యాల‌ను తెలుసుకుందాం

ఉద్యోగుల‌పై ప్రామాణిక త‌గ్గింపు ప్ర‌భావం ఎంత ?

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ర‌వాణా, ఆరోగ్య భ‌త్యాల‌కు బ‌దులుగా రూ.40 వేల వ‌ర‌కు ప్రామాణిక త‌గ్గింపు(స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌)ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌కటించిన విష‌యం విదిత‌మే. ఏదైనా సంస్థ‌లో ప‌ని చేసే వేత‌న జీవుల‌కు, సంబంధిత సంస్థ మాన‌వ వ‌నరుల విభాగం(హెచ్ఆర్‌) నుంచి ఈ ర‌వాణా, ఆరోగ్య భ‌త్యాల‌ విషయ‌మై ఎన్నో సందేహాలు నెల‌కొన్నాయి. వాటిలో ప్ర‌ధాన‌మైంది ఈ రెండు భ‌త్యాలను, ప్ర‌త్యేక భ‌త్యంలో విలీనం చేసాకా కూడా ఇంకా వీటిపై ప‌న్ను చెల్లించాలా? ఒక వేళ అదే నిజ‌మైతే ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప్రామ‌ణీక త‌గ్గింపు మాటేమిటి? దీనిని సంస్థ యాజ‌మాన్యాలు ముందే అన్ని ప‌న్నుల‌ను లెక్కేసి ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటాయా లేదా ఉద్యోగులు ఐటీ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసిన త‌ర్వాత క్లెయిం చేసుకోవాలా అనే సందేహాలు ఉద్యోగుల‌లో నెల‌కొంటున్నాయి.

అయితే, ఉద్యోగుల వేత‌నంపై ఈ మార్పుల ప్ర‌భావం ఎంతుంద‌నేది తెలుసుకునే ముందు అస‌లు కొత్త‌గా వ‌చ్చిన మార్పుల గురించి తెలుసుకుందాం.

కొత్త‌గా వ‌చ్చిన మార్పులేంటి?

ఏప్రిల్ 1, 2018 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన కొత్త ఆర్థిక చ‌ట్టం-2018 ప్ర‌కారం ఉద్యోగుల‌కిచ్చే ర‌వాణా, ఆరోగ్య భ‌త్యాలు ఇక‌పై కొనసాగవు. వాటికి బ‌దులుగా ఏక‌మొత్తంలో రూ.40 వేల వ‌ర‌కు ప్రామాణిక త‌గ్గింపు(స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్‌)ను అమ‌లు చేస్తున్న‌ట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ కొత్త బ‌డ్జెట్ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు.

ఏంటీ దీని అర్థం?

అంత‌కుముందు గ‌డిచిన ఆర్థిక సంవ‌త్స‌రాల‌లో ఉద్యోగులకు ర‌వాణా భ‌త్యాల‌కు నెల‌కు రూ.1600 చొప్పున‌(మొత్తం రూ.19200), వైద్య ఖ‌ర్చుల రీయింబ‌ర్స్‌మెంట్‌కి సంబంధించి రూ.15 వేల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులుండేవి. ఉద్యోగి త‌న వేత‌న ప‌ట్టీలో ఇందుకు త‌గ్గ‌ట్లు మార్పులుండేవి. అయితే వైద్య, ఆరోగ్య భ‌త్యాల‌ను పొందేందుకు ఉద్యోగి మెడిక‌ల్ బిల్లుల‌ను హెచ్ఆర్ వారికి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

అయితే కొత్త ఆర్థిక చ‌ట్టం-2018 లో చేప‌ట్టిన మార్పుల ప్ర‌కారం, ఈ ర‌వాణా, ఆరోగ్య భ‌త్యాల‌ను ఇక నుంచి అనుమతించ‌రు. సంస్థ యాజ‌మాన్యం ఇక నుంచి త‌మ ఉద్యోగుల వేత‌నంలో వీటిని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోజాల‌ర‌ని ప‌న్ను విష‌యాల నిపుణులు చెబుతున్నారు.

ఉద్యోగుల‌పై దీని ప్ర‌భావం ఎంత‌?

ప్ర‌స్తుతం రూ.34200(రూ.19200+రూ.15000) ల మొత్తం ఉద్యోగికి మినహాయింపు లభిస్తోంది. సంస్థ యాజామాన్యాలు ప‌న్నులు లెక్కించే సంద‌ర్భంలో ఇక నుంచి దీని బదులు ప్రామాణిక త‌గ్గింపును ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోనున్నాయి. దీంతో ఉద్యోగులు అద‌నంగా రూ.5800 వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపులు పొందుతారు. దీంతోపాటు మెడిక‌ల్ రీఇంబ‌ర్స్‌మెంట్‌ల సంద‌ర్భంగా అన‌వ‌స‌ర వ్య‌య‌, ప్ర‌యాసాలుండ‌వ‌ని వారంటున్నారు.

ఇంకా చెప్పాలంటే, అంగ‌వైక‌ల్యం గ‌ల ఉద్యోగులు రూ.40 వేల ప్రామాణిక త‌గ్గింపుతో పాటు, రూ.38,400 ర‌వాణా భ‌త్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు.

కొత్త విధానాల‌ను సంస్థ‌లు ఆచరించిన‌ప్పుడు…

దేశంలో చాలా సంస్థ‌లు ఇప్ప‌టికే ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి తెచ్చాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఎడేల్‌మాన్ ఇండియా ఇప్ప‌టికే ఈ రెండు భత్యాల‌ను, ప్ర‌త్యేక భ‌త్యంలో విలీనం చేసింది. ఇలా చేయ‌క‌పోతే ఉద్యోగులలో అన‌వ‌స‌ర అయోమయం సృష్టించిన వార‌మ‌వుతామ‌ని ఆ సంస్థ స్ప‌ష్టం చేసింది. ఉద్యోగుల‌పై కొత్త‌గా ప‌డే ఈ ప‌న్ను భారం, ప్రామాణిక త‌గ్గింపుతో త‌ట‌స్థీక‌ర‌ణం అవుతుంద‌ని ప‌న్ను నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ కొత్త విధానం అమ‌లు వ‌ల్ల‌, ఉద్యోగులు గ‌తంలో చేసిన‌ట్లుగా ప్ర‌త్యేకంగా ప‌త్రాలు, బిల్లులు దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఉద్యోగుల వేత‌నంలో నుంచి ప‌న్ను లెక్క‌లు వేసేట‌ప్పుడు సంస్థ యాజ‌మాన్యాలు ఈ ప్రామాణిక త‌గ్గింపును ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుంటాయి. దీనికోసం ఉద్యోగి ఎలాంటి ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం లేదు. ఉద్యోగి ప‌న్ను ఆదాయం నుంచి ప్రామాణిక త‌గ్గింపు దానంత‌ట‌దే అమ‌లు అవుతుంది. ఇది ఇప్ప‌టికే అమ‌ల్లోకి వ‌చ్చిందని ప‌న్ను నిపుణుడుకొరు వ్యాఖ్యానించారు.

ఒక వేళ ఈ నిబంధ‌న‌ల‌ను సంస్థ‌లు ఆచ‌రించ‌న‌ప్పుడు ప‌రిస్థితేంటి…

ఒక‌వేళ సంస్థ‌లు ప్రామాణిక త‌గ్గింపు అమ‌లు చేయ‌కుండానే, త‌మ ఉద్యోగులు నుంచి అద‌నంగా ఈ ప‌న్నులు వ‌సూలు చేస్తే ప‌రిస్థితేంటీ అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి.

సంస్థ యాజమాన్యాలు త‌మ ఉద్యోగులకు ప్రామాణిక త‌గ్గింపు ప్ర‌యోజ‌నాలు అమ‌లు చేసేట‌ప్పుడు, ఒక్కసారి మూలం వ‌ద్ద ప‌న్ను ఉప‌సంహ‌ర‌ణ‌(టీడీఎస్‌), దాని ప్ర‌భావం గురించి స్ప‌ష్టంగా తెలుసుకోవాలి. అంత‌కుముందు ర‌వాణా భత్యాన్ని నెల‌వారీగా అమలు చేసేవారు. అలాగే మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్ కోసం ఉద్యోగులు త‌మ సంస్థ యాజ‌మాన్యానికి బిల్లులు చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగి ప‌న్ను ఆదాయంలో ప్రామాణిక తగ్గింపును మిన‌హాయించుకుని, మిగిలిన ప‌న్ను ఆదాయంపై టీడీఎస్ వ‌సూలు చేయాల‌ని ప‌న్ను నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఒక వేళ సంస్థ యాజమాన్యాలు ఈ ప్రామాణిక త‌గ్గింపును అమలు చేయ‌క‌పోతే, అంత‌కుముందు నెల‌ల్లో ఉద్యోగుల వేత‌నంలో నుంచి టీడీఎస్ ఎక్కువ‌గా వ‌సూల‌య్యే అవ‌కాశం ఉంది. దీంత ఉద్యోగుల‌కు చేతికందే వేత‌నం త‌క్కువ‌గా ఉండే ప‌రిస్థితులు నెల‌కొన‌వ‌చ్చు. లేదా కొన్ని సంద‌ర్భాల్లో అవ‌స‌ర‌మైన దానికంటే ఎక్కువ మొత్తంలో టీడీఎస్ వ‌సూలయ్యే అవ‌కాశం ఉంది.

కొన్ని సంస్థ యాజ‌మాన్యాలు ఇప్ప‌టికీ, త‌మ ఉద్యోగుల‌కు ఏదైనా భ‌త్యం లేదా మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్ ఇస్తున్న‌ట్ల‌యితే వాటిపై ఉద్యోగి ప‌న్ను శ్లాబ్ ప్రకారం ప‌న్నులు వ‌ర్తిస్తాయి. ఉద్యోగి వీటికి సంబంధించి బిల్లులు స‌మ‌ర్పించిన‌ప్ప‌టికీ, వీటిపై ప‌న్ను ప‌డుతుంది. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి కొత్త విధానం అమ‌ల్లోకి వ‌చ్చింది కాబ‌ట్టి.

కాబ‌ట్టి సంస్థ యాజ‌మాన్యాలు త‌మ ఉద్యోగుల వేత‌నం నుంచి ప‌న్నులు మిన‌హాయించుకునే సంద‌ర్భాల్లో ఈ నిబంధ‌న‌ల‌ను జ్ఞ‌ప్తికి తెచ్చుకుంటే మంచిది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly