రెపో రేటు త‌గ్గిన వెంట‌నే ఈఎమ్ఐ ఎందుకు త‌గ్గ‌దు?

రుణం తీసుకున్న‌వారి వ‌డ్డీరేటు మూడు విష‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. బ్యాంకు ఎమ్‌సీఎల్ఆర్, మార్క్ అప్, రీసెట్ డేట్

రెపో రేటు త‌గ్గిన వెంట‌నే ఈఎమ్ఐ ఎందుకు త‌గ్గ‌దు?

రిజ‌ర్వు బ్యాంకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు త‌గ్గించ‌డంతో ప్ర‌స్తుతం రెపో రేటు 6.25 శాతంగా ఉంది. గృహ‌రుణాల‌పై దీని ప్ర‌భావం ఉంటుంది. అయితే గ‌త కొన్ని రోజుల క్రితమే కొన్ని బ్యాంకులు వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి. మానిట‌రీ పాల‌సీ క‌మిటీ స‌మావేశానికి కొన్ని రోజుల ముందే బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఎమ్‌సీఎల్ఆర్ పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఒక సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్ పై 10 బేసిస్ పాయింట్ల పెంపు ఫిబ్ర‌వ‌రి 7 నుంచి అమ‌ల్లోకి తెస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 1- సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్ 8.75 శాతంగా ఉంది. జ‌న‌వ‌రిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కూడా ఎమ్‌సీఎల్ఆర్ 8.75 శాతానికి పెంచింది. ప్ర‌స్తుతం హెచ్‌డీఎఫ్‌సీ సంవ‌త్స‌రం, 2 సంవ‌త్స‌రాల 3 సంవ‌త్స‌రాల ఎమ్‌సీఎల్ఆర్ లు 8.75, 8.90, 9.05 శాతంగా ఉన్నాయి.

ఆర్‌బీఐ రెపోరేటు త‌గ్గించ‌డం ద్వారా బ్యాంకుల‌కు నిధుల ల‌భ్య‌త త‌క్కువ రేటుకు ల‌భిస్తుంది. అయితే ఎమ్‌సీఎల్ఆర్ ప్ర‌తీసారి రెపోరేటుతో పాటు మారుతుంద‌ని చెప్ప‌లేం. రుణం తీసుకున్న‌వారి వ‌డ్డీరేటు మూడు విష‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. బ్యాంకు ఎమ్‌సీఎల్ఆర్, మార్క్ అప్, రీసెట్ డేట్

ఎమ్‌సీఎల్ఆర్:

ఏప్రిల్ 1,2016 నుంచి రెపో రేటు బ్యాంకుల నిధుల ల‌భ్య‌త‌కు అయ్యే ఖ‌ర్చును నిర్ణ‌యించ‌డంలో కీల‌కంగా మారింది. అందుకే ఎమ్‌సీఎల్ఆర్ ను నిధుల ఉపాంత వ్య‌య‌రేటు అంటారు. ఎమ్‌సీఎల్ఆర్ ఓవ‌ర్ నైట్, నెల‌, మూడు నెల‌లు,ఆరు నెల‌లు, ఏడాది,రెండేళ్లు, మూడేళ్లు కాల‌ప‌రిమితికి ఉంటాయి. సాధార‌ణంగా బ్యాంకులు ఆరునెలలు, సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్ ప్రాతిపాదిక‌న రుణాలు ఇస్తుంటాయి.

మార్క్ అప్:

బ్యాంకులు ఎమ్‌సీఎల్ఆర్ కంటే త‌క్కువ రేటు రుణాలు అందించేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఎమ్‌సీఎల్ఆర్ కంటే కొంత శాతం అధికంగా వినియోగ‌దారుల‌కు నుంచి వ‌సూలు చేస్తుంటాయి. దీన్నే స్ప్రెడ్ లేదా మార్క్ అప్ అంటారు. సాధార‌ణంగా ఇది 0.3 శాతం ఉంటుంది. అంటే సంవ‌త్స‌రం ఎమ్‌సీఎల్ఆర్ 8.55 శాతం ఉంటే వినియోగ‌దారుల‌కు ల‌భించేది 8.85 శాతంగా ఉంటుంది.

రీసెట్ డేట్:
రుణం తీసుకున్న వినియోగ‌దారుల‌కు ఆర్‌బీఐ రెపో రేటు మార్చిన ప్ర‌తీసారీ ఆ ప్ర‌భావం ఈఎమ్ఐల‌పై ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక వ్య‌క్తి 12 నెల‌ల కాల‌ప‌రిమితికి రీసెట్ తో రుణం తీసుకున్నారనుకుందాం. అప్పుడు ఎమ్‌సీఎల్ఆర్ 8 శాతం, మార్కప్ 0.2 శాతం అంటే మొత్తం వ‌డ్డీ రేటు 8.2 శాతం అవుతుంది. ఎమ్‌సీఎల్ఆర్ ఈ 12 నెల‌ల కాలంలో మారినా వినియోగ‌దారుని ఈఎమ్ఐ స్థిరంగానే ఉంటుంది. బ్యాంకు మ‌ళ్లీ తిరిగి సంవ‌త్స‌రం త‌రువాత రీసెట్ చేస్తుంది. అప్పుడు ఈఎమ్ఐ అప్ప‌టి వ‌డ్డీరేటు ఆధారంగా వ‌ర్తిస్తుంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly