ప‌ద‌వీ విర‌మ‌ణకు ముందుగానే ఫండ్‌ను ఎందుకు బ‌దిలీ చేసుకోవాలి?

ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి క‌నీసం 5 సంవ‌త్స‌రాల ముందు మీ ఫండ్ల‌ను సుర‌క్షిత ప‌థ‌కాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్ల‌లోకి బ‌దిలీ చేసుకోవాలి.

ప‌ద‌వీ విర‌మ‌ణకు ముందుగానే ఫండ్‌ను ఎందుకు బ‌దిలీ చేసుకోవాలి?

ప‌ద‌వీ విర‌మ‌ణ అనేది ఒక దీర్ఘ‌కాలిక ల‌క్ష్యం. ఇందుకోసం ప్ర‌ణాళిక ప్ర‌కారం పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అయితే ఈ పెట్టుబ‌డులు ద్ర‌వ్యోల్బ‌ణం, ఆర్థిక స్థితి, ఎంచుకునే మార్గం, వైవిధ్య‌త లోపాల‌ కార‌ణంగా రిస్క్‌లో ప‌డుతున్నాయి. నిర్థిష్ట కాల‌ప‌రిమితికి మంచి రాబ‌డుల‌ను సాధించాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌ణాళిక ప్ర‌కారం మదుపు చేస్తుంటాము. అయితే మ‌న పెట్టుబ‌డులు మ‌న‌కు అవ‌స‌ర‌మ‌యిన స‌మ‌యానికి, అవ‌స‌రానికి త‌గిన రాబ‌డిని అందిస్తున్నాయా?

పెట్టుబ‌డుల‌ను విత్‌డ్రా చేసుకునేప్పుడు వ‌చ్చే రాబ‌డులు ప్ర‌తికూలంగా ఉంటే దానిని సీక్వెన్స్ రిస్క్ లేదా సీక్వెన్స్ ఆఫ్ రిట‌ర్న్ అంటారు. పోర్ట్ ఫోలియోలో అధిక భాగం ఈక్వీటీల‌లో మ‌దుపుచేస్తే, రిస్క్ శాతం కూడా అధికంగానే ఉంటుంది. పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకునే స‌మ‌యంలో ఆర్థిక తిరోగ‌మ‌నం ఉంటే రాబ‌డి గ‌ణ‌నీయంగా ప‌డిపోతుంది. ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యంలో చాలా మంది ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డులను ఉప‌సంహ‌రించుకుంటారు. మార్కెట్లు న‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డుల‌ను ఉప‌సంహ‌రించుకుంటే ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యానికి కావ‌ల‌సిన నిధుల‌ను స‌మ‌కూర్చుకునే విధంగా పోర్ట్‌ఫోలియో ఉండ‌దు.

సీక్వెన్స్ రిస్క్‌ను తొల‌గించేందుకు, సిస్ట‌మేటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌(ఎస్‌టీపీలు), సిస్ట‌మేటిక్ విత్‌డ్రా(ఎస్‌డ‌బ్ల్యూపీ) లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. సీక్వెన్స్ రిస్క్ భారిన ప‌డ‌కుండా ప‌ద‌వీ విర‌మ‌ణ‌ స‌మయానికి 5 సంవ‌త్స‌రాల ముందే సుర‌క్షిత పెట్టుబ‌డులైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్ల‌లోకి నిధుల‌ను బ‌దిలీ చేయాల‌ని నిపుణులు సూచిస్తుంటారు.

ఎందుకు బ‌దిలీ చేయాలి?

పెట్టుబ‌డుల రాబ‌డి క్ర‌మం, ప‌ద‌వీవిర‌మ‌ణ నిధిపై అధిక ప్ర‌భావం చూపించొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు ‘ఏ’, ‘బీ’, ఇద్ద‌రు ప‌ద‌వీవిర‌మ‌ణ కోసం, ఒకే మొత్తంతో పొదుపు ప్రారంభించారు అనుకుందాం. అయితే విత్‌డ్రా చేసుకున్న స‌మ‌యం ఆధారంగా మార్కెట్ రిస్క్‌కు లోబ‌డి వారి రాబ‌డిలో మాత్రం వ్య‌త్యాసం క‌నిపిస్తుంది. మార్కెట్లు లాభాల‌(బుల్ మార్కెట్‌)లో ఉన్న‌ప్పుడు ‘ఏ’ విత్ డ్రా ప్రారంభించాడు. ప‌ద‌వీ విర‌మ‌ణకు ముందుగానే అత‌ను కొన్ని షేర్ల‌ను ఉప‌సంహ‌రించుకున్నాడు. అందువ‌ల్ల అత‌ని మొత్తం పోర్ట్‌ఫోలియో లాభాల‌తో ఉంది. మ‌రోవైపు ‘బి’ మార్కెట్లు న‌ష్టాల‌లో (బేర్ మార్కెట్‌)లో కొనసాగుత‌న్న‌ప్పుడు అధిక మొత్తంలో షేర్ల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం వ‌ల్ల, త‌గినంత‌ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని స‌మ‌కూర్చుకోలేక పోయాడు.

రాబ‌డి ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు
వివిధ ర‌కాల ఆన్‌లైన్ టూళ్ల‌ ద్వారా సీక్వెన్స్ రిస్క్‌ను ఎంతుండొచ్చు అనేది క‌చ్చితంగా తెలియ‌క‌పోవ‌చ్చు. స‌గ‌టు రాబ‌డి రేటును అంచానా వేసి లెక్కించ‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఎంత నిధిని ఏర్పాటు చేసుకోవాలి అనే దానిపై అంచ‌నాకు రావొచ్చు. అధిక రిస్క్‌తో కూడిన పెట్టుబ‌డుల‌పై ప్ర‌తీసారి ఒకేవిధంగా రాబ‌డి వ‌స్తుంద‌ని అంచానా వేయ‌కూడ‌దు. మీరు 15 సంవ‌త్స‌రాల కాలానికి పెట్టిన పెట్టుబ‌డుల‌పై వ‌చ్చిన రాబ‌డి, మ‌రో 15 సంవ‌త్స‌రాల పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబడి ఒకేలా ఉండ‌దు. ఉదాహ‌ర‌ణ‌కు 1979 సంవ‌త్స‌రంలో 15 సంవ‌త్స‌రాల కాలానికి సెన్సెక్స్‌లో పెట్టుబ‌డి పెట్టిన‌ప్పుడు, 25.89శాతం వృద్ధిరేటు (సీఏజీఆర్) ఉంటే, ఆ త‌రువాత 15 సంవ‌త్స‌రాల‌కు 13.4 శాతం సీఏజీఆర్ మాత్ర‌మే ఉండ‌వ‌చ్చు. దీని ఆధారంగా మీ విత్‌డ్రాలు ప్రారంభించిన స‌మ‌యం మీ విర‌మ‌ణ నిధిని ఎంత‌గా ప్ర‌భావితం చేస్తుందో అర్ధం చేసుకోవ‌చ్చు.

మీ మొత్తం రిటైర్‌మెంటు నిధిని ఒకేసారి కాకుండా, ద‌ఫ‌ద‌ఫాలుగా ఉప‌సంహ‌రించుకోవ‌డం వ‌ల్ల సీక్వెన్స్ రిస్క్ ప్ర‌భావానికి గురికాకుండా ఉంటారు. మ్యూచువ‌ల్ ఫండ్ల విష‌యంలో, ద‌ఫ‌ద‌ఫాలుగా విత్‌డ్రా చేసుకునేప్పుడు సీక్వెన్స్ రిస్క్ భారిన ప‌డ‌కుండా ఎస్‌డ‌బ్ల్యూపీ స‌హాయ‌ప‌డుతుంది. ఒక‌వేళ మీరు నేరుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే అన్ని షేర్ల‌ను ఒకేసారి విక్ర‌యించ‌డం మంచిది కాదు. ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో దీర్ఘ‌కాలంపాటు విక్ర‌యించ‌డం వ‌ల‌న సీక్వెన్స్ రిస్క్‌ను తొల‌గించుకోవ‌చ్చు.

సుర‌క్షిత‌మైన ప‌థ‌కాల్లోకి …

  • వ్య‌క్తి వ‌య‌సు పెరిగే కొద్దీ పెట్టుబ‌డుల‌ను క్ర‌మంగా ఈక్విటీ నుంచి డెట్‌కు బ‌దిలీ చేసుకోవ‌డం మంచిది.
  • ఈక్విటీలో కార్ప‌స్‌గా ఉన్న సొమ్మును క్ర‌మేపీ డెట్ ఫండ్‌కు సిస్టమెటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్‌ను ఉప‌యోగించి బదిలీ చేయ‌వ‌చ్చు.
  • ఏదైనా ల‌క్ష్యానికి చేరువ అవుతున్న‌ప్పుడు, లేదా రిటైర్‌మెంట్ స‌మీపిస్తున్న‌పుడు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly