క్యాన్సర్ కోసం బీమా పాలసీని ప్రారంభించిన అపోలో మునిచ్

ఒకవేళ మీరు పాలసీ తీసుకున్న సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, పాలసీ పునరుద్ధరణ సమయంలో 10 శాతం బోనస్ ను పొందుతారు

క్యాన్సర్ కోసం బీమా పాలసీని ప్రారంభించిన అపోలో మునిచ్

ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ అపోలో మునిచ్ క్యాన్సర్ వ్యాధి కోసం ఐక్యాన్ పేరుతో కొత్తగా ఒక ఆరోగ్య బీమా ప్లాన్ ను ప్రారంభించింది. ఐదు నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీలో ఎన్ని సార్లు క్లెయిమ్ చేసుకున్నప్పటికీ, జీవిత కాలం పాటు పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. ఇందులో రూ. 5 లక్షలు, రూ. 10 లక్షలు, రూ. 15 లక్షలు, రూ. 20 లక్షలు, రూ. 25 లక్షలు, అలాగే రూ. 50 లక్షలు చొప్పున మొత్తం ఆరు బీమా ఎంపికలు ఉన్నాయి. అలాగే ఇందులో బేసిక్, అడ్వాన్స్డ్ అనే రెండు రకాల ఎంపికలు ఉన్నాయి. బేసిక్ ప్లాన్ కింద కేవలం మైకేర్ ప్రయాజనం ఒక్కటే అందుబాటులో ఉంటుంది. అదే అడ్వాన్స్డ్ ప్లాన్ లో అయితే మైకేర్ ప్రయాజనంతో పాటు, క్రిటికేర్ ప్రయోజనం, ఫ్యామిలీ కేర్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంటుంది.

మైకేర్ ప్రయాజనం :

శస్త్రచికిత్సలలో భాగంగా కాన్సర్ కణజాలం లేదా అవయవాలు / కణజాలాల తొలగింపు, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సను ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా అందిస్తుంది. ఆసుపత్రిలో చేరక ముందు 30 రోజుల పాటు, అలాగే ఆసుపత్రిలో చేరిన తరువాత 60 రోజుల పాటు కవరేజ్ ను మైకేర్ అందిస్తుంది. దానితో పాటు అత్యవసర అంబులెన్స్ సేవకు గాను రూ. 2000 వరకు నగదును అందిస్తుంది. ప్రోటాన్ బీమ్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోనల్ థెరపీ లేదా ఎండోక్రైన్ మానిప్యులేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇమ్యునోథెరపీ, ఇమ్యునాలజీ ఎజెంట్ వంటి ఆధునిక చికిత్స ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

క్రిటికేర్ ప్రయోజనం :

మైకేర్ ప్రయోజనంతో పాటు, పాలసీ హోల్డర్లు అధునాతన ప్రణాళికను పొందటానికి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ పాలసీదారుడు క్యాన్సర్ తో బాధపడుతున్నప్పుడు దాని తీవ్రత ఆధారంగా (స్టేజ్ IV ని మినహాయించి) హామీ ఇచ్చిన బీమా మొత్తంలో నుంచి 60 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని పొందుతారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి రూ. 10 లక్షల కవర్ ను తీసుకుంటే, అతడు రూ. 6 లక్షల మొత్తాన్ని పొందుతారు. అయినప్పటికీ అతను చికిత్స ఖర్చుల కోసం రూ .10 లక్షల కవరేజ్ ను ఉపయోగించుకోవచ్చు.

ఫ్యామిలీ కేర్ ప్రయోజనం :

ఇది అధునాతన ప్లాన్ కింద కూడా అందుబాటులో ఉంటుంది, మొదటి డయాగ్నోసిస్ లో స్టేజ్ IV క్యాన్సర్ అని నిర్ధారణ అయినట్లయితే, బీమా చేయించిన మొత్తం నుంచి 100 శాతం మొత్తాన్ని ఫ్యామిలీ కేర్ ప్రయోజనం కింద పాలసీదారు కుటుంబానికి అందిస్తుంది. ఒకవేళ క్యాన్సర్ స్టేజ్ IV కు చేరినట్లైతే లేదా మొదటి డయాగ్నోసిస్ చేసిన 12 నెలల తర్వాత రెండవ డయాగ్నోసిస్ చేసే సమయంలో తిరిగి క్యాన్సర్ వచ్చినట్లు కనుగొన్నట్లైతే, క్రిటికేర్ ప్రయోజనం కింద హామీ ఇచ్చిన బీమా మొత్తం నుంచి 60 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని అందిస్తుంది. ఒకవేళ మొదటి డయాగ్నోసిస్ చేసిన 12 నెలల్లోగా క్యాన్సర్ తిరిగి సంభవించినట్లైతే, బీమా మొత్తంలో నుంచి 40 శాతం మొత్తాన్ని చెల్లిస్తారు. క్రిటికేర్, ఫ్యామిలీకేర్ ప్రయోజనాలు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే మొత్తం పాలసీ కాలపరిమితిలో కేవలం ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇతర ప్రయోజనాలు :

ఒకవేళ మీరు పాలసీ తీసుకున్న సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ చేయకపోతే, పాలసీ పునరుద్ధరణ సమయంలో 10 శాతం బోనస్ ను పొందుతారు. దీనినే నో క్లెయిమ్ బోనస్ అంటారు. క్యాన్సర్ మొదటి డయాగ్నోసిస్ తరవాత బీమాదారుడికి రెండో అభిప్రాయం కోసం అభ్యర్థించే అవకాశం ఉంటుంది. దీనిని అపోలో మునిచ్ వైద్య నిపుణుల బృందం ద్వారా అందిస్తారు, వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఎనలిటిక్స్, కాగ్నిటివ్ సాఫ్ట్ వేర్ యాక్సెస్ ను కలిగి ఉంటారు. దీని వెయిటింగ్ పీరియడ్ 120 రోజులు.

మినహాయింపులు :

ఐకేర్ ప్లాన్ కింద తెలిపిన మినహాయింపులను అందిస్తుంది.

• క్యాన్సర్ కు సంబంధం లేని ఎలాంటి చికిత్సను అందించదు.
• హెచ్ఐవీ / ఎయిడ్స్, మెదడులోని లింఫోమాస్, కపోసిస్ సార్కోమా, క్షయవ్యాధి.
• నాన్ అలోపతి చికిత్స
• అనస్థీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేయకుండా స్వయంగా వేరు చేయగల / తొలగించగల ప్రోస్టెటిక్, ఇతర పరికరాలను ఉపయోగించడం
• ఇతర దేశాల్లో చేసే చికిత్స లేదా ఆసుపత్రిలో కాకుండా బయట అందించే చికిత్స
• పుట్టుకతో వచ్చే వ్యాధులు, లోపాలు లేదా అసమానతలు

ప్రీమియం:

ఐకేర్ కోసం ప్రతిపాదనలను ధూమపానం చేయని పురుషుడు, ధూమపానం చేయని మహిళ, ధూమపానం చేసే పురుషుడు (మద్యపానంతో కలిపి), ధూమపానం చేసే మహిళ (మద్యపానంతో కలిపి) అనే నాలుగు విభాగాలుగా విభజించారు. ఒకవేళ మీరు చిన్న వయసులోనే పాలసీని కొనుగోలు చేసినట్లయితే, ప్రీమియం చాలా నామమాత్రంగా ఉంటుంది. ఉదాహరణకు 36 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ధూమపానం చేయని పురుషుడు రూ. 25 లక్షల బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం రూ. 3274 (జీఎస్టీ కాకుండా). అయితే, చారిత్రాత్మక సమాచారం ప్రకారం, మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మహిళ ధూమపానం లేదా మద్యం సేవిస్తున్నట్లైతే, దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువలన 36 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళకు రూ. 25 లక్షల బీమా కోసం దాదాపుగా మూడు రెట్లు అదనంగా అనగా రూ. 9,046 (జీఎస్టీ కాకుండా) ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly