త‌క్ష‌ణ గృహారుణాలు తీసుకోవ‌డం మంచిదేనా?

త‌క్ష‌ణ గృహా రుణాలను ఆన్‌లైన్‌లో పొందే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, బ్యాంకును కూడా సంద‌ర్శించాల్సి ఉంటుంది.

త‌క్ష‌ణ గృహారుణాలు తీసుకోవ‌డం మంచిదేనా?

సొంతంటి క‌ల అంద‌రికీ ఉంటుంది. ఇందుకోసం చాలామంది బ్యాంకుల వ‌ద్ద రుణం తీసుకుంటారు. అయితే ఇది చాలా పెద్ద ప్రాసెస్‌, ద‌ర‌ఖాస్తు చేసిన త‌రువాత రుణం మంజూరు కావ‌డానికి చాలా రోజుల స‌మ‌యం ప‌డుతుంది. నూత‌న సాంకేతిక ప‌రిజ్ఞానంతో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మార్కెట్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ డిజిట‌ల్ మార్కెట్ నైపుణ్యంతో బ్యాంకులు త‌క్ష‌ణ రుణాల‌ను అందిస్తున్నాయి. ఇటీవ‌లే ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌, కాగిత ర‌హిత, త‌క్ష‌ణ రుణాల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇందులో భాగంగా సాధార‌ణ గృహ రుణాలు, టాప్అప్ రుణాల‌ను అందిస్తుంది. బ్యాంకులో ఇప్ప‌టికే ఖాతా ఉండి, కొత్త‌గా గృహ రుణం తీసుకునే వినియోగ‌దారుల‌కు వారి అర్హ‌త, అవ‌సరం ఆధారంగా రుణం మంజూరు చేసి, ఫైన‌ల్ సేంక్ష‌న్ లెట‌రును అంద‌జేస్తారు. అదేవిధంగా ఇప్ప‌టికే గృహ రుణం పొందిన వారికి టాప్అప్‌ లోన్ డిజిట‌ల్ ఛాన‌ల్ ద్వారా మంజూరు చేస్తున్నారు. ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ స‌దుపాయం ద్వారా బ్యాంకు పాత ఖాతాదారులైన ఉద్యోగుల‌కు రూ.1కోటి వ‌ర‌కు, 30 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి (ఖాతాదారుని వ‌య‌సు ఆధారంగా) త‌క్ష‌ణ రుణాల‌ను బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. ఇదివ‌ర‌కే గృహ రుణం తీసుకున్న‌వారికి ఇంట‌ర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 సంవత్స‌రాల కాల‌ప‌రిమితికి, రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు త‌క్ష‌ణ టాప్‌-అప్ రుణాన్ని అందిస్తున్నారు. ఈ రుణాలు పూర్తిగా కాగిత ర‌హితంగా మంజూరు చేస్తున్నారు. ఇంతకు ముందుతో పోలిస్తే రుణాల‌ను పొంద‌డం చాలా సుల‌భం, అయితే అప్పు తీసుకునేవారికి ఇది లాభ‌దాయ‌క‌మేనా?

త‌క్ష‌ణ రుణాలు:

గతంతో పోలిస్తే, బ్యాంకులు త్వ‌రితగ‌తిన రుణాల‌ను మంజూరు చేసేందుకు కార‌ణం ఏంటి? అనిదే ప్ర‌శ్న‌. ఇందుకు కార‌ణం గ‌తంలో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వ్య‌క్తికి సంబంధించిన అన్ని వివ‌రాల‌ను వ్య‌క్తిగ‌తంగా త‌నిఖీ చేయాల్సి వ‌చ్చేది. దీనికి కొంత స‌మ‌యం ప‌ట్టేది. అయితే ప్ర‌స్తుతం కొన్ని డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల‌ను ఉప‌యోగించి రుణగ్ర‌హీత క్రెడిట్ వ‌ర్తీనెస్‌ను తెలుసుకునేందుకు వీలుంది. వాస్త‌వానికి 10 సంవ‌త్స‌రాల‌కు పూర్వ‌మే డిజిట‌లైజేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభైమ‌న‌ప్ప‌టికీ గ‌త 3-4 సంవ‌త్స‌రాల నుంచి మాత్ర‌మే పూర్తిస్థాయిలో డిజిట‌లైజేషన్ విధానం అందుబాటులోకి వ‌చ్చింది.

వినియోగ‌దారుల‌లో డిజిట‌లైజేష‌న్‌ను వేగ‌వంతం చేసేందుకు రూ.60 వేల లోపు రుణాల‌కు ఆధార్‌తో కూడిన ఈకేవైసీ ప్ర‌మాణాలలో సుప్రీంకోర్టు కొంత వెసులుబాటు క‌ల్పించిన‌ట్లు ఎక్స్‌పీరియ‌న్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కో. ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆశిష్ సింఘల్ చెప్పారు.

డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్‌ల ద్వారా రుణం అందించే సంస్థ‌లు, నాన్ క్రెడిట్ స‌మాచారాన్ని ఉప‌యోగించి క్రెడిట్ స‌మాచారాన్ని తెలుసుకుంటున్నాయి. వినియోగ‌దారుల నెల‌వారీ షాపింగ్ చేసే విధానాన్ని, అందుకు వారు వెచ్చించే మొత్తాన్ని విశ్లేషిస్తారు. బ్యాంకింగేత‌ర ఆర్థిక‌ సంస్థ‌లు, వేలెట్ సంస్థ‌ల ద్వారా ఎంత మొత్తంతో వేలెట్ నింపుతున్నారు. అందులోంచి ఎంత ఖ‌ర్చు చేస్తున్నారు మొద‌లైన స‌మాచారం తెలుసుకుంటార‌ని సింఘ‌ల్ పేర్కొన్నారు.

ఎలా ప‌నిచేస్తుంది?
పేరులోనే ఇన్స్‌టెంట్ అని ఉన్న ఈ రుణాల‌ను ప్ర‌తీసారి త‌క్ష‌ణ‌మే, కాగిత ర‌హితంగా, ఆన్‌లైన్ ద్వారా పొందలేక‌పోవ‌చ్చు. కొన్ని సార్లు బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించాల్సి రావ‌చ్చు. త్వ‌రిత గ‌తిన మంజూరు చేస్తారు అనే కార‌ణంతో ఖాతాదారులు త‌క్ష‌ణ రుణాల‌కు మ‌గ్గు చూపుతారు. అయితే గృహ రుణాలు మంజూరు చేసేందుకు ఆస్తి కొనుగోలు ప‌త్రాలు, టైటిల్ డీడ్ వంటి ఫార్మాలిటీస్ ఉంటాయి కాబ‌ట్టి ఇందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని మైమ‌నీ మంత్ర ఫైనాన్స్ స‌ర్వీసెస్ సంస్థ వ్య‌వ‌స్థాకుడు, మేనేజింగ్ డైరెక్ట‌ర్ రాజ్‌ఖోస్లా తెలిపారు.

ఐసీఐసీఐ బ్యాంక్లో త‌క్ష‌ణ రుణ స‌దుపాయం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు తాము ఎంచుకున్న ఆస్తిని బ్యాంకు వారిచే ముందుగానే అప్రూవ్ చేయించుకోవాలి. రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగ్ఇన్ అయ్యి, మై అక్కౌంట్స్ పేజికి వెళ్ళి, లోన్స్ టాబ్‌ని క్లిక్ చేసి, ఇన్స్‌టెంట్ సాంక్షన్-హోమ్‌లోన్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఒక‌సారి కావ‌ల‌సిన మొత్తాన్ని, కాల‌వ్య‌వ‌ధిని ఎంచుకుని ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే లోను మంజూరు చేసిన‌ట్లుగా, మీరు రిజిస్ట‌ర్ చేసుకున్న ఈమెయిల్ ఐడీకి లెట‌ర్ పంపిస్తారు. అయితే మిగిలిన ప్రాసెస్ పూర్తి చేసేందుకు స్వ‌యంగా బ్యాంకుకు వెళ్ళాలి.

త‌క్ష‌ణ గృహా రుణాల అస‌లు మొత్తం మంజూరైన త‌రువాత కూడా, వినియోగ‌దారుడు ఆస్తి ప‌త్రాల‌ను, శాల‌రీకి సంబంధించిన ప‌త్రాల‌ను ఇవ్వాలి. అయితే ఇన్స్టా టాప్అప్‌ లోన్ మొత్తం ప్రాసెస్‌ను డిజిట‌ల్‌గానే చేసుకోవ‌చ్చు. ఇందుకోసం ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగ్ఇన్ చేసి, టాప్‌అప్‌ లోన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. రుణ మొత్తం, కాల‌ప‌రిమితుల‌ను ఎంచుకుని, బ్యాంకువారు మీ రిజిష్ట‌ర్డ్ మొబైల్‌కు పంపిన ఓటీపీని ఎంట‌ర్ చేయ‌డం ద్వారా ప్రాసెస్ పూర్త‌వుతుంది.

జాగ్ర‌త్త అవ‌స‌రం:
రుణం సుల‌భంగా ల‌భించిన‌ప్ప‌టికీ అందులో ఉన్న అనుకూల‌త‌లు, ప్ర‌తికూల‌త‌లు తెలుసుకోకుండా రుణం తీసుకోవ‌డం మంచిదికాదు. సుల‌భంగా ల‌భించే రుణాల‌కు వ‌డ్డీ ఎక్కువ‌గా విధించే అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల రుణం తీసుకునందుకు ముంద‌గానే త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

అంతేకాకుండా త‌క్ష‌ణ రుణాలు తీసుకునే వారికి కొన్ని ప‌రిమితులు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కి, ఐసీఐసీఐ బ్యాంకులో త‌క్ష‌ణ గృహ రుణం పొందాలంటే, వినియోగ‌దారునికి బ్యాంకులో ఇదివ‌ర‌కే పొదుపు ఖాతా ఉండాలి లేదా ఇప్ప‌టికే కొంత రుణం పొంది బ్యాంకుతో స‌త్సంబంధాలు క‌లిగిఉండాలి. బ్యాంకులో ఇప్ప‌టికే శాల‌రీ లేదా పొదుపు ఖాతా క‌లిగి ఉన్న‌వారి వేత‌న చ‌రిత్ర బ్యాంకు వ‌ద్ద ఉంటుంది కాబ‌ట్టి శాల‌రీ క్రెడిట్స్ ఈఎమ్ఐల చ‌రిత్ర బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా బ్యాంకులు ఖాతాదారుల రుణ అర్హ‌త‌ను అంచానా వేస్తాయి.
అయితే ఇక్క‌డ ఒక విష‌యం గుర్తించుకోవాలి, అవ‌స‌రం లేకుండా తీసుకునే రుణాలు మీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అస్థ‌వ్య‌స్థం చేయ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly