ఆర్బిట్రాజ్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తున్నారా?

రెండు వేర్వేరు ప్రాంతాల్లో ధ‌ర వ్య‌త్యాసాలు ఉంటే త‌క్కువ ఉన్న ద‌గ్గ‌ర కొనుగోలు చేసి ఎక్కువున్న ద‌గ్గ‌ర అమ్మకం చేసి రాబ‌డిని పొంద‌డాన్ని ఆర్బిట్రాజ్ అంటారు.

ఆర్బిట్రాజ్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తున్నారా?

ఏక‌కాలంలో ఏదైనా వ‌స్తువుకు రెండు వేర్వేరు ప్రాంతాల్లో ధ‌ర వ్య‌త్యాసాలు ఉంటే త‌క్కువ ఉన్న ద‌గ్గ‌ర కొనుగోలు చేసి ఎక్కువున్న ద‌గ్గ‌ర అమ్మకం చేసి రాబ‌డిని పొంద‌డాన్ని ఆర్బిట్రాజ్ అంటారు. ఈ నిమ‌యం ఆధారంగా చేసుకుని మ‌దుపుచేసే మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆర్బిట్రాజ్ ఫండ్లు అంటారు. మ్యూచువ‌ల్ ఫండ్లలో ఆర్బిట్రాజ్ ఏవిధంగా చేస్తారు. సామాన్య మ‌దుప‌ర్ల‌కు వీటి ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు త‌దిత‌ర వివ‌రాలు వివ‌రంగా తెలుసుకుందాం.

ఆర్బిట్రాజ్ అవ‌కాశాలు - ప్ర‌ధానంగా సెక్యూరిటీల స్పాట్ , డెరివేటివ్ మార్కెట్ల మ‌ధ్య ధ‌ర‌ల వ్య‌త్యాసం ద్వారా ఈ ఫండ్లు పెట్టుబ‌డుల‌ను చేస్తాయి. వేర్వేరు మార్కెట్లు మ‌ధ్య ఉన్న ధ‌ర వ్య‌త్యాసాల‌ను కూడా అందిపుచ్చుకుంటారు. ఉదాహరణకు, ఒకే కంపెనీకి చెందిన షేరు ఫ్యూచ‌ర్ మార్కెట్ కి, స్పాట్ మార్కెట్ కి మ‌ధ్య ధ‌ర వ్య‌త్యాసం ఉంటే ఆ అవ‌కాశాన్ని ఆర్బిట్రాజ్ ఫండ్ మేనేజ‌ర్లు అందిపుచ్చుకుంటారు. ఆ షేరు స్పాట్ మార్కెట్లో రూ. 90 ఉంద‌నుకుందాం, అదే షేరు ఫ్యూచ‌ర్ మార్కెట్లో ధ‌ర రూ. 92 ఉంద‌నుకుందాం. అప్పుడు ఫండ్ మేనేజ‌రు స్పాట్ మార్కెట్లో కొని ఫ్యూచ‌ర్ మార్కెట్లో అమ్ముతారు. ఒక మార్కెట‌ల్లో కొన్న సెక్యురిటీ (క‌మోడిటీ లేదా షేరు) ని వేరొక మార్కెట్లో ఏక‌కాలంలో లాభానికి విక్ర‌యించ‌డం ద్వారా ఆర్బిట్రాజ్ ఫండ్లు రాబ‌డిని పొందుతాయి. ఉదాహ‌ర‌ణ‌కు, ఒక షేరు ధ‌ర బీఎస్ఈలో రూ. 80 ఉంది. ఎన్ఎస్ఈలోరూ. 80.5 ఉంది . అపుడు బీఎస్ఈలో రూ.80కి కొనుగోలుచేసి వెంట‌నే ఎన్ఎస్ఈలో రూ.80.5 కి విక్ర‌యిస్తారు. దీని ద్వారా రూ.0.5 లాభం వ‌స్తుంది.

ఈ ఫండ్లు త‌క్కువ న‌ష్ట‌భ‌యాన్ని క‌లిగి ఉంటాయి. రాబ‌డి విష‌యానికొస్తే వీటిలో రాబ‌డి సాధారణంగా 6 నుంచి 10 శాతం వ‌ర‌కూ ఉండొచ్చు. ఈ ఫండ్ల‌లో పెట్టుబ‌డి కేటాయింపు ఆర్బిట్రాజ్ అవ‌కాశాల‌పై ఆధారప‌డి ఉంటుంది. ఆర్బిట్రాజ్ అవ‌కాశాలు ఉన్న‌పుడు ఆస్తుల కేటాయింపు ఈక్విటీ ,ఈక్విటీ సంబంధిత సాధ‌నాలు ,డెరివేటివ్ ల‌తో క‌లిపి 65-100శాతం. మ‌నీమార్కెట్, స్థిరాదాయ సాధ‌నాలు డెరివేటివ్ మార్జిన్ నిధుల‌తో క‌లిపి 0-35 శాతగా ఉంటాయి. ఆర్బిట్రాజ్ అవ‌కాశాలు లేన‌పుడు ఆస్తుల కేటాయింపు ఈక్విటీ , డెరివేటివ్ ల‌తో క‌లిపి 0-35 శాతం, స్థిరాదాయ ప‌థ‌కాలు, డెరివేటివ్ మార్జిన్ నిధుల‌తో క‌లిపి 65-100 శాతంగా ఉంటాయి. ఇక్క‌డ తెలిపిన పెట్టుబ‌డుల‌ కేటాయింపు శాతాలు అంచ‌నా మాత్ర‌మే. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఫండ్ మేనేజ‌ర్లు మారుస్తుంటారు.

ఫండ్ నిర్వాహ‌కుల నుంచి ఆఫ‌ర్ (ఎన్ఎఫ్ఓ) సమ‌యంలో యూనిట్ ముఖ విలువకు కొనొచ్చు. లేదా మిగిలిన రోజుల్లోఆ రోజు యూనిట్ ఎన్ఏవీ ధ‌ర‌కు కొనొచ్చు. ఈ ఫండ్లలో గ్రోత్ , డివిడెండ్ ప‌థ‌కాలు , డెరెక్ట్, రెగ్యుల‌ర్ ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫండ్ల‌లో మ‌దుపుచేసేముందు ( ఏఎంయూ - అసెట్స్ అండ‌ర్ మేనేజ్ మెంట్ ) నిర్వ‌హ‌ణ‌లో ఉన్న‌ ఆస్తులు ఎక్కువ‌గా ఉన్న ఫండ్ ను ఎంచుకోవ‌డం మంచిది.

స్థిరఆదాయ పెట్టుబ‌డుల్లో మ‌దుచేసినా ఆర్బిట్రాజ్ ఫండ్ల‌కు ఈక్విటీకి వ‌ర్తించిన ప‌న్ను విధాన‌మే ఉంటుంది. ఒక సంవ‌త్స‌రం లోపు పెట్టుబ‌డి పై స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న ఆదాయానికి 15% ప‌న్ను ఉంటుంది. ఒక సంవ‌త్స‌రం త‌ర్వాత పెట్ట‌బ‌డి పై వ‌చ్చిన ఆదాయం దీర్ఘ‌కాలిక‌మూల‌ధ‌న ఆదాయం పై ప‌న్ను10 % ప‌న్ను ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly