లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తున్నారా?

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు కోసం వెతుక్కోకుండా అత్య‌వ‌స‌ర నిధి ఉంచుకోవాల‌ని ఆర్థిక నిపుణులు స‌ల‌హా ఇస్తుంటారు.

లిక్విడ్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తున్నారా?

అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌ర‌మైన‌పుడు అందుబాటులో ఉండే విధంగా త‌క్కువ స‌మ‌యంలోనే పెట్టుబ‌డుల‌ను న‌గ‌దుగా మార్చుకునేందుకు వీలుగా ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటినే లిక్విడ్ ఫండ్లు అంటారు. లిక్విడ్ ఫండ్లలో పెట్టుబ‌డి, న‌ష్ట‌భ‌యం, వాటి ప్ర‌త్యేక‌త‌లు త‌దిత‌ర‌ర వివ‌రాలు తెలుసుకుందాం.

అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు కోసం వెతుక్కోకుండా అత్య‌వ‌స‌ర నిధి ఉంచుకోవాల‌ని ఆర్థిక నిపుణులు స‌ల‌హా ఇస్తుంటారు. దీనికి చాలా మంది సేవింగ్సు బ్యాంక్ ఖాతాలో కొంత డబ్బు దాచుకుంటారు. ఎందుకంటే అవ‌స‌ర‌మైన‌ప్పుడు డ‌బ్బు తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. కానీ ఎక్కువ మొత్తం సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో ఉంచితే వడ్డీ తక్కువగా ఉంటుంది. దీనికి ప్ర‌త్య‌మ్నాయంగా కొంత లిక్విడ్ ఫండ్లో మ‌దుపుచేయడం గురించి ప‌రిశీలించ‌వ‌చ్చు. లిక్విడ్ ఫండ్లు మ‌దుప‌ర్ల నిధుల‌ను స్వ‌ల్ప‌కాలిక స్థిరాదాయ ప‌థ‌కాల్లో (మ‌నీమార్కెట్ ) మ‌దుపుచేస్తారు. వాణిజ్య ప‌త్రాలు (క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లు), స‌ర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు, ప్ర‌భుత్వ బిల్లులు (టీ బిల్లులు) వంటి స్వ‌ల్ప‌కాల మెచ్యూరిటీ ఉన్నవాటిలో పెట్టుబ‌డి చేస్తారు. దీంతో యూనిట్ల‌ను విక్ర‌యించే మ‌దుప‌ర్ల‌కు స‌కాలంలోనే న‌గదు జ‌మ‌చేస్తారు.

లిక్విడ్‌ ఫండ్‌ లో గ్రోత్, డివిడెండ్ ఆప్ష‌న్ల‌ను మ‌దుప‌ర్లు వారి అవ‌స‌రాల‌ను బ‌ట్టి ఎంచుకోవచ్చు. రెగ్యుల‌ర్, డైరెక్టు ప్లాన్లు అందుబాటులో ఉంటాయి. క్రమ‌బ‌ద్ధ‌మైన ఆదాయం కోరుకునేవారు డివిడెండ్ ప్లాన్‌లోనూ, పెట్టుబ‌డిలో వృద్ధిని కోరుకునేవారు గ్రోత్ ప్లాన్‌లోనూ మ‌దుపుచేయాలి. లిక్విడ్ ఫండ్లలో డివిడెండ్ల‌ను రోజు, వారం, ప‌క్షానికి ఒక సారి ఇస్తుంటాయి. ఈ డివిడెండ్లపై మ‌దుప‌ర్ల‌కు ప‌న్ను ఉండ‌దు. దాదాపు చాలా లిక్విడ్ ఫండ్లకు నిష్క్రమణ ఛార్జీలు ఉండ‌వు. అలాగే ఫండ్ నిర్వ‌హ‌ణ ఛార్జీలో త‌క్కువగా ఉంటాయి.

లిక్విడ్ ఫండ్లలో కొన్ని రోజుల‌ నుంచి కొన్ని నెల‌లు వ‌ర‌కూ మ‌దుపు చేసుకోవ‌చ్చు. వీటికి లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూనిట్ల‌ను న‌గ‌దుగా మార్చుకోవ‌డం సుల‌భ‌త‌రం, వేగంగా పూర్త‌వుతుంది. టీ+1రోజుల్లో యూనిట్ల‌ను నిధులుగా మార్చుకోవ‌చ్చు. త‌క్కువ మొత్తంతోనే వివిధ ర‌కాల డెట్ పేప‌ర్ల‌లో మ‌దుపుచేసే అవ‌కాశం ల‌భిస్తుంది. స్వ‌ల్ప‌కాల లక్ష్యాలు నెర‌వేర్చేందుకు లిక్విడ్ ఫండ్లు ఎంతో అనువైన‌వి. ఉదాహర‌ణ‌కు రెండునెలల్లో ఏదైనా అవ‌స‌రానికి డ‌బ్బు కావాల‌నుకోండి. ఆ డ‌బ్బును సేవింగ్ బ్యాంక్ ఖాతాలో 4 శాతం వ‌డ్డీకి ఉంచే బ‌దులు లిక్విడ్ ఫండ్ లో మ‌దుపుచేయ‌వ‌చ్చు. అవస‌రానికి ఒక‌రోజు ముందు యూనిట్ల‌ను ఉప‌సంహ‌రించుకుని ఆ ప‌ని పూర్తిచేయ‌వ‌చ్చు.

సేవింగ్సు బ్యాంకులో దాచుకున్న న‌గ‌దు కంటే లిక్విడ్ ఫండ్ లో పెట్టుబ‌డి కొంత న‌ష్ట‌భయం ఉంటుంది. సాధార‌ణంగా లిక్విడ్ ఫండ్ పెట్టుబ‌డులను ప్ర‌భుత్వ, ప్రైవేటు డెట్ సాధ‌నాల్లో మ‌దుపుచేస్తారు. కాబ‌ట్టి న‌ష్ట‌భ‌యం ఉంటుంది. స్థిరాదాయ ప‌థ‌కాల్లో రాబ‌డి వాటి క్రెడిట్ రేటింగ్ ప్ర‌కారం ఉంటుంది. త‌క్కువ క్రెడిట్ రేటింగు ఉన్న సాధ‌నాలు ఎక్కు వ రాబ‌డిని ఇస్తాయి. అయితే న‌ష్ట‌భ‌యం అధికంగా ఉంటుంది. మంచి రేటింగ్ ఉన్న సాధ‌నాలు త‌క్కువ రాబ‌డిని ఇస్తాయి. వాటిలోన‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉంటుంది. మ‌న ఫండ్ ఏ ర‌క‌మైన సెక్యురీటీల్లో పెట్టుబ‌డి చేస్తుంద‌న్న దానిపై న‌ష్ట‌భ‌యం, రాబ‌డి ఆధార‌ప‌డి ఉంటుంది. కాబట్టి మ‌దుప‌ర్లు ఫండ్ ఏ సెక్యురీటీల్లో మ‌దుపుచేస్తుందో తెలుసుకోవాలి.

లిక్విడ్ పండ్లలో మూడు సంవ‌త్స‌రాల లోపు స్వ‌ల్ప‌కాల‌ మూల‌ధ‌న ఆదాయం పై వ్య‌క్తిగ‌త స్లాబ్ రేటు ప్రకారం ప‌న్ను చెల్లించాలి. మూడు సంవ‌త్స‌రాలు పైన దీర్ఘ‌కాల‌ మూల‌ధ‌న ఆదాయం పై ఇండెక్సేష‌న్ తో 20శాతం చెల్లించాలి. ఒక రోజు కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలో అవ‌స‌ర‌మ‌నుకుంటే దానికి కొంత సొమ్మును బ్యాంకుఖాతాలో ఉంచుకోవ‌డం మంచిది. ఈ ఫండ్ల నుంచి న‌గ‌దు పొందేంద‌కు ఒక రోజు స‌మ‌యం ప‌డుతుంది. కాబ‌ట్టి ఒక‌రోజు ఆపై అవ‌స‌ర‌మ‌య్యే వాటికి లిక్విడ్ ఫండ్ల‌ను ఎంచుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly