ఆరోగ్య సంజీవని పాలసీ తీసుకోవచ్చా?

ఇందులో విశేషం ఏంటంటే ఏ కంపెనీ వద్ద తీసుకున్నా వీటి లక్షణాల్లో మార్పు ఉండదు

ఆరోగ్య సంజీవని పాలసీ తీసుకోవచ్చా?

ఇటీవలే ఐఆర్డీఏ ఆరోగ్య సంజీవని పేరిట ఒక పాలసీ ప్రవేశ పెట్టింది. ఇది ఒక సామాన్యుడికి కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది. సాధారణంగా, ఆరోగ్య బీమా పాలసీల ఫీచర్స్ కంపెనీ ని బట్టి పాలసీ ని బట్టి మారుతూ ఉంటాయి. ఇందులో విశేషం ఏంటంటే ఏ కంపెనీ వద్ద తీసుకున్నా వీటి లక్షణాల్లో మార్పు ఉండదు.

ఈ పాలసీ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ పాలసీ ఏంటి?

సామాన్య పాలసీదారుడు మార్కెట్ లోని రక రకాల పాలసీల తో సతమతమవుతుంటాడు. ఇది దృష్టి లో పెట్టుకుని ఏఆర్డీఏ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, కంపెనీ ని బట్టి ప్రీమియం లో కాస్త మార్పు ఉండవచ్చు.

ఎవరు కొనవచ్చు?

ఈ పాలసీ ని కనీస వయసు 18 నుంచి 65 ఏళ్ళ వయసు గల వారు కొనుగోలు చేయవచ్చు. వారి కుటుంబ సభ్యులను కూడా భాగం చేసుకోవచ్చు.

పాలసీ ఫీచర్స్/లక్షణాలు ఏంటి?

 • కనీస బీమా హామీ రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు తీసుకోవచ్చు.
 • నగదు రహిత సౌకర్యం ఉంటుంది.
 • ప్రసూతి సౌకర్యం ఉండదు.
 • 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఈ లోపల క్లెయిమ్ చేసుకునే వీలుండదు.
 • 5 శాతం కో పే ఉంటుంది. అంటే, ప్రతి బిల్ లో ఇంత మేరకు పాలసీ దారుడే భరించాలి.
 • భవిష్యత్తు లో వేరే కంపెనీ కి పోర్ట్ చేసుకోవచ్చు.
 • ఆయుష్ వైద్యం కూడా కవర్ చేస్తుంది.
 • చాలా మేరకు ముందస్తు రోగాలకు 24 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కొన్నింటికి 48 నెలలు ఉంది.
 • ఉపపరిమితులు గలవు. రూమ్ అద్దె లాంటి వాటికీ రోజుకి బీమా హామీ లో 2 శాతం మాత్రమే (గరిష్టంగా రూ. 5 వేలు) కవర్ చేస్తారు.ఐసియూ/ఐసిసియూ అయితే రోజుకి బీమా హామీ లో 5 శాతం మాత్రమే (గరిష్టంగా రూ. 10 వేలు) కవర్ చేస్తారు. కంటి శుక్లాల ఆపరేషన్ కొరకు బీమా హామీ లో 25 శాతం లేదా గరిష్టంగా రూ. 4 లక్షల వరకు మాత్రమే కవర్ చేస్తారు.
 • రైడర్స్ ఉండవు.
 • నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది. క్లెయిమ్ చేయని ప్రతి ఏడాది బీమా హామీ లో 5 శాతం పెరుగుతూ ఉంటుంది (గరిష్టంగా 50 శాతం వరకు).

ఈ పాలసీ మీ కోసమే నా?

పాలసీ లో లక్షణాలు గమనిస్తే ఒక సామాన్యుడికి కావాల్సిన కనీస అవసరాలు దృష్టి లో పెట్టుకుని తయారు చేసినట్టు అనిపిస్తోంది. అయితే, ఇది ప్రతి ఒక్కరికి కాకపోవచ్చు. ఉదాహారానికి, మీకు అధిక బీమా హామీ అవసరం అనిపిస్తే ఈ పాలసీ ఎంచుకుని ప్రయోజనం ఉండకపోవచ్చు. దీనికి అదనంగా రూ. 5-10 లక్షల బీమా హామీ తో ఒక సూపర్ టాప్ పాలసీ తీసుకోవడం మేలు.

అయితే, అనేక ఆరోగ్య బీమా పాలసీలు పరిశీలించలేని వారికి ఈ పాలసీ ఒక వరం అనే చెప్పాలి. పైగా, కో పే ఉన్నందున ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది.

కుటుంబ ఆరోగ్య అవసరాలకు ఒక మంచి ఆరోగ్య బీమా పాలసీ కావాలనుకునే వారికి ఈ ఆరోగ్య సంజీవని పాలసీ సరైంది. మాక్స్ బూపా, అపోలో మునిచ్ లేదా ఏదైనా మంచి బీమా కంపెనీ నుంచి ఈ పాలసీ ని కొనుగోలు చేసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly