మ్యూచువల్ ఫండ్లను ఎంచుకునేందుకు ప్రామాణికాలు!!

మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టే ముందు ఫండ్ వివరాలు తెలుసుకోవాలంటే పరిశీలించవలసిన అంశాలు

మ్యూచువల్ ఫండ్లను ఎంచుకునేందుకు ప్రామాణికాలు!!

కష్టపడి సంపాదించిన సొమ్ము భవిష్యత్తు అవసరాలు తీర్చే విధంగా ఉండాలి. అందుకు తగిన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవడంలో ఆచితూచి వ్యవహరించాలి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే ముందు ఆ ఫండ్ కు సంబందించిన అన్ని వివరాలు తెలియచేసే పత్రాలు అందరికి అందుబాటులో ఆ సంస్థ వెబ్సైట్ లో, బ్రాంచిలో, సలహాదారు వద్ద అందుబాటులో ఉంటాయి.

పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే:

పెట్టుబడి లక్ష్యాలు:

ఫండ్‌ మేనేజర్‌ ఎంచుకునే పెట్టుబడి సాధనాల ద్వారా ఫండ్‌ లక్ష్యాలు తెలుసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు పెట్టుబడి సొమ్ము పెరిగే లక్ష్యంతో గ్రోత్‌ ఫండ్‌ పనిచేస్తుంది. పెట్టుబడికి పూర్తి భరోసా, క్రమమైన ఆదాయ వనరును ఉత్పత్తిచేసే లక్ష్యం దిశగా ఇన్‌కమ్‌ ఫండ్లు కొనసాగుతాయి. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లు ఆదాయ వనరుగా, పెట్టుబడికి భరోసానిచ్చే రెండు లక్ష్యాలతో పనిచేస్తాయి. ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడి పెట్టేముందు పెట్టుబడిదారు తన పెట్టుబడి లక్ష్యాలతో ఫండ్ పెట్టుబడి లక్ష్యం సరిపోలుతుందో లేదో చూసుకోవాలి

పెట్టుబడి వ్యూహాలు:

సరైన వ్యూహంతో పెట్టుబడి లక్ష్యాల్ని చేరుకోవడం సులువవుతుంది. లక్ష్యాన్ని బట్టి మనకు సరిపడే మ్యూచువల్ ఫండ్ పధకం ఎంచుకోవాలి. పెట్టుబడికి రక్షణ, స్థిరమైన రాబడి ప్రధాన లక్ష్యం అయితే డేట్ ఫండ్లు, యువకులు, కాస్త నష్ట భయం ఉన్నా భరించగలిగి లాభార్జన ప్రధాన లక్ష్యం అయితే ఈక్విటీ ఫండ్లు, లాభాల్లో సాగే కాలంలో ఏదైనా ఓ ప్రత్యేక రంగంలో పెట్టుబడి పెట్టే వ్యూహంతో ఉంటే సెక్టార్ ఫండ్లు, ఖండాంతరాల్లో పెట్టుబడి పెట్టి విస్తృత అవకాశాలను పొందేందుకు ఇంటర్నేషనల్ ఫండ్స్ ఇలా లక్ష్యానికి సరిపడే ఫండ్ ఎంచుకోవాలి.

నష్టాన్ని తట్టుకోగల శక్తి:

పెట్టుబడి పెట్టాక ఏయే రకాల నష్టాలుంటాయి. వాటిని ఎదుర్కొనే అంశాలపై అవగాహన ఉండాలి. ఫండ్‌ నియమనిబంధనల్లో మార్పులు, వడ్డీ రేట్లలో మార్పు, మార్కెట్‌ స్థితిగతుల్లో కదలికలు, ఆర్థిక వ్యవస్థలో మార్పులు తదితరాలు పెట్టుబడికి నష్టాలు కలిగించేవి. ఇదే కాక ఫండ్‌ మేనేజర్‌ వ్యూహాలు, పెట్టుబడి తరహా, క్లోజ్‌ ఎండెడ్‌ పథకాల్లోనైతే నిష్క్రమణ తేదీ పెట్టుబడికి నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి. నష్టాన్ని తట్టుకునే శక్తిని బట్టి పెట్టుబడిదారు సదరు పథకంలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని నిర్ణయించుకోగలగాలి.

రుసుములు, ఇతర ఖర్చులు:

ప్రారంభ పెట్టుబడి, నిర్వ‌హ‌ణ‌కు , వార్షిక రుసుముల లాంటివి ముందే తెలుసుకొని ఉండడం మంచిది. పథకంలో పెట్టుబడి పెట్టేందుకు అయ్యే ఇతర ఖర్చులు పోను ఎంత రాబడి వస్తుందనే విషయమై అవగాహన ఉండాలి.

జారీ తేదీ:

ఫండ్ ఎప్పటి నుండి పెట్టుబడిదారులకి అందుబాటులో ఉంది. జారీ చేసిన తేదీ వివరాలు చూడాలి. కొన్ని సంవత్సరాల బట్టి అందుబాటులో ఉన్న ఫండ్ అయితే గతంలో దాని పనితీరుకి సంబందించిన వివరాలు ఉంటాయి.

గత పనితీరు:

గత పనితీరు భవిష్యత్తు పనితీరుకు కొలమానం కాదు’ అని ఆఫర్‌ నివేదికలో ఓ వ్యాఖ్య మనకు కనిపిస్తుంది. అయితే ఫండ్‌ గత పనితీరును అర్థంచేసుకుంటే మార్కెట్‌ పరిస్థితికి ఫండ్‌ అనుకూలతను సులభంగా తెలుసుకోవచ్చు. ప్రమాణాలకు తగ్గట్టు, ఇతర ఫండ్‌లతో సాటిగా మనం పెట్టుబడి పెట్టిన ఫండ్‌ పనిచేస్తుందో లేదో పరిశీలించవచ్చు.

ఫండ్‌ మేనేజ్‌మెంట్‌:

అన్ని మార్కెట్‌ పరిస్థితుల్లో ఓ ఫండ్‌ను సమర్థవంతంగా నడిపించగలిగిన మేనేజర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. ఫండ్‌ మేనేజర్‌ నిర్వహించే ఫండ్‌ను ఇతర ఫండ్లతోనూ, అదే అసెట్‌లోని ఇతర ఫండ్‌తోనూ పోల్చిచూడాలి.

పన్ను మినహాయింపు సమాచారం:

ఏదైనా పథకానికి వర్తించే పన్ను మినహాయింపులను తెలుసుకోవాలి. దీర్ఘకాల పెట్టుబడి లాభాలపై ఈక్విటీల్లో పన్ను మినహాయింపు ఉంది. ఈక్విటీల్లో ఏడాది పెట్టుబడి తర్వాత డివిడెండ్ల పంపిణీలపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఇలాంటివి అర్థం చేసుకుంటే పెట్టుబడిదారు పన్ను చెల్లించే అంశంలో ప్రణాళికతో ముందుకెళ్తాడు.

సమస్యల పరిష్కారానికి:

పెట్టుబడిదారుకు వచ్చే సమస్యలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు అధీకృత వ్యక్తి లేదా సంస్థ వివరాలు ముందే తెలుసుకొని ఉండడం మంచిది.

Comments

1
Murali Mohan .M. B.:

Mention mutual funds ratings also.

ప్రత్యుత్తరం Murali Mohan .M. B.

Thank you for submitting your comment. We will review it, and make it public shortly

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly