ఏటీఎం వినియోగదారులకు శుభవార్త...

ఏటీఎం లావాదేవీలపై బ్యాంకులు విధించే చార్జీలను సమీక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది

ఏటీఎం వినియోగదారులకు శుభవార్త...

ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్స్ (ఏటీఎం) లను వినియోగిస్తున్నందుకు గాను బ్యాంకులకు చెల్లించే ఛార్జీలు త్వరలో మారే అవకాశం కనిపిస్తుంది. ఏటీఎం లావాదేవీలపై బ్యాంకులు విధించే చార్జీలను సమీక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పెద్ద నగరాల్లో సాధారణ పొదుపు ఖాతాను కలిగిన వినియోగదారులు ఏటీఎం ద్వారా ఎనిమిది ఉచిత లావాదేవీలను చేసుకునే అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కల్పిస్తుంది, వీటిలో ఎస్బీఐకు చెందిన ఏటీఎంలలో ఐదు లావాదేవీలు, అలాగే ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు లావాదేవీలు ఉన్నాయి. అదే చిన్న పట్టణాల్లోని ఖాతాదారులకు 10 ఉచిత లావాదేవీలు లభిస్తాయి, వీటిలో ఐదు ఎస్బీఐ ఏటీఎంలలో, అలాగే ఇతర బ్యాంకులలో ఐదు లావాదేవీలు ఉన్నాయి. ఒకవేళ లావాదేవీ పరిమితి మించినట్లైతే, ఒక్కో ఆర్థిక లావాదేవీకి రూ. 20 ప్లస్ జీఎస్, అలాగే ఒక్కో ఆర్థికేతర లావాదేవీకి రూ. 8 ప్లస్ జీఎస్టీని వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఎవరైతే వారి పొదుపు బ్యాంకు ఖాతాలో సగటున నెలకు రూ. 25,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ ను నిర్వహిస్తున్నారో వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ (ఎస్బీజీ) అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తుంది.

సాధారణంగా అన్ని ప్రధాన బ్యాంకులు ప్రతి నెలా తమ సొంత ఏటీఎంలలో నిర్దిష్ట సంఖ్యలో ఉచిత లావాదేవీలను అనుమతిస్తాయి. కానీ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో లావాదేవీలకు మాత్రం ఒక నిర్దిష్ట పరిమితి ఉంటుంది. ఒకవేళ లావాదేవీల పరిమితి మించినట్లైతే, బ్యాంకులు కొంత మేర రుసుమును వసూలు చేస్తాయి. ఈ రుసుము ఒక్కో బ్యాంకుకు ఒక్కోమాదిరిగా మారుతూ ఉంటుంది.

ప్రస్తుతం ఏటీఎంల వినియోగం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది. అయితే, చాలా కాలంగా ఏటీఎం లావాదేవీలపై విధించే ఛార్జీలు, ఫీజులను తగ్గించాలని వినియోగదారుల నుంచి నిరంతరం డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఏటీఎం ఛార్జీలు, ఫీజుల స్వరూపాన్ని పరిశీలించడానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

దేశంలో సుమారు రెండు లక్షల ఏటీఎంలు ఉన్నాయి. అలాగే ఏప్రిల్ చివరి నాటికి దేశంలో సుమారు 88.47 కోట్ల డెబిట్ కార్డులు, 4.8 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. తాజా ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, ఒక్క ఏప్రిల్‌ నెలలోనే ఏటీఎంలలో డెబిట్ కార్డుల ద్వారా 80.9 కోట్ల లావాదేవీలు జరిగాయని తెలిపింది.

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలానే ఉద్దేశంతో, ఆర్‌బీఐ ఇటీవల నిర్వహించిన ద్రవ్య విధాన సమీక్షలో ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ ద్వారా చేసే నగదు బదిలీలపై విధించే ఛార్జీలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly