బటన్స్ కలిగిన క్రెడిట్ కార్డు ప్రయోజనాలు? దానిని పొందేందుకు అర్హత?

ఈ కార్డును ఉపయోగించి పీఓఎస్ మెషిన్స్ వద్ద సాధారణ లావాదేవీలను చేయవచ్చు

బటన్స్ కలిగిన క్రెడిట్ కార్డు ప్రయోజనాలు? దానిని పొందేందుకు అర్హత?

ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ నెక్స్ట్ అనే పేరుతో ఒక కొత్త రకం క్రెడిట్ కార్డును విడుదల చేసింది. సాధారణ చెల్లింపులు చేయడం లేదా రివార్డ్ పాయింట్లను ఉపయోగించి చెల్లింపులు చేయడం లేదా ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకుని కొనుగోలు చేయడం వంటి వివిధ రకాల ఆప్షన్ లను ఈ కార్డు వినియోగదారులకు అందిస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డు ఇతర కార్డుల కంటే కొంచం మందంగా ఉంటుంది. ఈ కార్డును ఉపయోగించి పీఓఎస్ మెషిన్స్ వద్ద సాధారణ లావాదేవీలను చేయవచ్చు. ఎవరు దీన్ని పొందగలరు? ఎలాంటి రుణాలు లేకుండా, నెలకు రూ. 50,000 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారు నెక్స్ట్ క్రెడిట్ కార్డును పొందేందుకు అర్హులు. నెక్స్ట్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి రూ. 80,000 నుంచి రూ. ఒక లక్ష వరకు ఉంటుంది.

ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ. 1,999 ఉంటుంది. అలాగే దీనికి ఎలాంటి వార్షిక రుసుము గానీ, పునరుద్ధరణ రుసుము గానీ లేదు. ఈ కార్డుపై నెలకు వర్తించే వడ్డీ రేటు 3.83 శాతం. మిగతా కార్డులకి, ఈ కార్డుకి మధ్య తేడా ఏంటి ? ఈ క్రెడిట్ కార్డు మూడు పుష్ బటన్లను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి సాధారణ చెల్లింపులు చేయడం కోసం, రెండవది రివార్డ్ పాయింట్లను ఉపయోగించి చెల్లింపులు చేయడం కోసం, మూడవది ఈఎంఐ (6, 12, 18, 24 నెలలు) ఆప్షన్ ను ఎంచుకుని కొనుగోలు చేయడం కోసం ఉపయోగించవచ్చు. కార్డు పై ఉన్న బటన్ ను నొక్కండం ద్వారా మీకు కావలసిన ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ప్రతి బటన్ ప్రక్కన ఒక లైట్ ఉంటుంది, మీరు ఏదైనా ఆప్షన్ ను ఎంచుకున్నప్పుడు లైట్ మెరుస్తుంది. ఈ కార్డు బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. దీనికి ఎలాంటి ఛార్జింగ్ మెకానిజం లేదు.సాధారణ క్రెడిట్ కార్డులు కూడా ఖర్చు చేసిన మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చుకోవడం లేదా రివార్డ్ పాయింట్లను ఉపయోగించి చెల్లింపులు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే నెక్స్ట్ క్రెడిట్ కార్డు ఈఎంఐ లపై కచ్చితమైన హామీని ఇస్తుంది, అలాగే కేవలం ఒక క్లిక్ తో చాలా సులభంగా రివార్డ్ పాయింట్లను రెడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లను ఉపయోగించుకోవడానికి, వినియోగదారులు కనీసం రూ. 500 విలువగల రివార్డ్ పాయింట్లను కలిగి ఉండాలి. ఒక రివార్డ్ పాయింట్ రూ. 1 కి సమానం, అలాగే ప్రతి రూ. 150 వ్యయానికి ఒక రివార్డ్ పాయింట్ ను పొందుతారు. అంటే దీని అర్ధం మీరు రూ. 500 విలువగల రివార్డ్ పాయింట్లను ఉపయోగించుకోడానికి కనీసం రూ. 75,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కార్డు వినియోగదారులు ఈఎంఐ ఆప్షన్ ను పొందేందుకు రూ. 2,000 పైన ఖర్చు చేయాల్సి ఉంటుంది. లావాదేవీని ఈఎంఐ కింద మార్చుకోవడం కోసం కస్టమర్ కేర్ కి కాల్ చేయాల్సిన అవసరం లేదు.

ఇతర క్రెడిట్ కార్డుల మాదిరిగానే, ఈఎంఐ కింద మార్చుకున్న మొత్తాన్ని మీ క్రెడిట్ పరిమితి నుంచి తగ్గిస్తారు. ఉదాహరణకు మీకు రూ. 50,000 క్రెడిట్ పరిమితి ఉందనుకుందాం. మీరు రూ. 20,000 విలువగల రిఫ్రిజరేటర్ ని కొనుగోలు చేసి దానిని ఈఎంఐ కింద మార్చుకుంటే, అప్పుడు మీ క్రెడిట్ పరిమితి రూ. 30,000 కు తగ్గుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly