జనధన్‌ యోజన ఖాతా ప్రయోజనాలు..

గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాలను కూడా దీనిలోభాగస్వామ్యం చేశారు

జనధన్‌ యోజన ఖాతా ప్రయోజనాలు..

దేశ ప్రజలందరినీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేయడం కోసం ఉద్దేశించినదే ప్రధానమంత్రి జనధన్‌ యోజన. దేశంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలనేది ఈ పథకం లక్ష్యం. ప్రధాన ఆర్థిక వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనేది ప్రధాని సంకల్పం. ఆగస్టు 28, 2014న ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ఏ బ్యాంకు శాఖలోనైనా ఈ పథకం కింద ఖాతాను తెరవచ్చు. స్వాభిమాన్‌ పథకం కింద 2000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రస్తుత జనధన్‌ యోజనలో భాగంగా 1000 నుంచి 1500 జనాభా కలిగిన ప్రాంతాలపై దృష్టి పెట్టారు. దీనిలో గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ ప్రాంతాలను కూడా భాగస్వామ్యం చేశారు. ప్రతి ఒక్క వ్యక్తి తాను నివసించే ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధి లోపు బ్యాంకు సేవలను పొందేందుకు దీని ద్వారా వీలు కలుగుతుంది. ఇప్పటికి 29.50 కోట్ల ఖాతాలను జనధన్‌ యోజన కింద తెరిచారు. ఇందులో సుమారుగా 60 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనివి, 40 శాతం పట్టణ ప్రాంతాలకు చెందినవి. 51 శాతం వరకూ మహిళల పేరు మీద ఖాతాలు ఉన్నాయి.

ఖాతాకు సంబంధించిన విధి విధానాలు :

 • 10 సంవత్సరాల వయస్సు దాటిన ఎవరైనా ఈ పథకం కింద ఖాతా తెరిచేందుకు వీలుంది.
 • ఈ ఖాతాలకు కనీస నగదు నిల్వ అనే నిబంధన లేదు. ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికీ పాస్‌బుక్‌, రూపే ఏటీఎమ్‌ కమ్‌ డెబిట్‌ కార్డు జారీ చేస్తారు. చెక్కు పుస్తకం జారీ బ్యాంకు నిర్ణయంపై ఆదారపడి ఉంటుంది.(ఈ ఖాతాలకు చెక్కు పుస్తకం అందించాలనే నిబంధన లేదు)
 • నెలరోజులకు గరిష్ఠంగా 4 విత్‌డ్రాలకు అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష నగదు బదిలీకి వీలుగా ప్రతి ఖాతాను ఆధార్‌తో అనుసంధానపరుస్తారు.

ఈ పథకం కింద ప్రత్యేక సౌకర్యాలు :

 1. డిపాజిట్లపై కనీసం 4 శాతం వడ్డీ(ఇది మారుతూ ఉంటుంది)
 2. లక్ష వరకూ ప్రమాద బీమా సౌకర్యం*
 3. రూ. 30000 జీవిత బీమా
 4. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నగదు లావాదేవీలు చేసుకునే అవకాశం
 5. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఈ ఖాతాల్లో నగదు జమ చేస్తారు.
 6. ఖాతాను 6 నెలల పాటు సమర్థంగా నిర్వహించిన వారికి ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం(మహిళకు)
 7. దీని ద్వారా పెన్షన్‌, బీమాలను పొందే వీలుంది.
 8. కుటుంబంలో ఒక మహిళకు రూ. 5000 ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం ఉంటుంది.

జన ధన్‌ యోజనతో జారీ చేసే రూపే డెబిట్‌ కార్డు లక్షణాలు :

 • రూపే డెబిట్‌ కార్డు పూర్తి దేశీయంగా రూపొందించినది.
 • దీన్ని నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) వారు జారీచేస్తారు, నిర్వహిస్తారు.
 • ఖాతాదారుడు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ఈ కార్డు కలిగిన వారికి లక్ష వరకూ ప్రమాద బీమా సౌకర్యం ఉంది.
 • దీన్ని దేశంలోని అన్ని ఏటీఎమ్‌ల్లో ఉపయోగించుకోవచ్చు.
 • కార్డు వాడే వారు పిన్‌ పట్ల జాగ్రత్త వహించాలి. పిన్‌ను కార్డుపై రాసి పెట్టకూడదు.
 • పిన్‌ నమోదు చేసే సమయంలో ఎవరూ చూడకుండా జాగ్రత్త పడాలి.
 • ప్రమాద బీమా సౌకర్యం పొందేందుకు 45 రోజుల్లో ఒకసారైనా కార్డును వాడాల్సి ఉంటుంది.

బ్యాంక్‌ మిత్ర/బిజినెస్‌ కరస్పాండెంట్‌ ఏజెంట్‌ :

బ్యాంకులకు, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు అనుసంధానకర్తలుగా వ్యవహరించేవారే బ్యాంక్‌ మిత్ర. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, మాజీ సైనికోద్యోగులు, చిన్న మొత్తాల పొదుపు సంస్థలకు చెందిన వారిని బ్యాంక్‌ మిత్రలుగా నియమిస్తారు.

 • నిరక్షరాస్యులకు, గ్రామీణులకు వీరు ఆర్థిక అక్షరాస్యత కల్పిస్తారు. ముఖ్యంగా పొదుపు, ఏటీఎమ్‌ కార్డు వాడుక, ప్రభుత్వ పథకాల ద్వారా నగదు బదిలీ వంటి వాటి గురించి వీరు వివరిస్తారు.

 • ఖాతా తెరిచేందుకు అవసరమైన పత్రాలను సేకరిస్తారు. ప్రాథమిక సమాచారాన్ని తనిఖీ చేస్తారు.

 • దరఖాస్తు పత్రాలను నింపడంలో సాయపడతారు.

 • తక్కువ స్థాయిలో జరిగే డిపాజిట్లు, విత్‌డ్రాలు చేస్తారు.

 • అతడు/ఆమె పనిచేసే బ్యాంకు నియమించిన ఇతర విధులను నిర్వర్తిస్తారు.

జీవిత బీమా అర్హత−అనర్హతలు :

ఎటువంటి బీమా లేని కుటుంబాలు ఈ పథకం కింద బీమా పరిధిలోకి వస్తాయి. ఎటువంటి సామాజిక భద్రత పథకం కింద రాని వారందరికీ ప్రయోజనం కల్పిస్తూ దీన్ని రూపొందించారు. ఆమ్‌ ఆద్మీ బీమా యోజన పథకం కింద ఉన్న వారు దీని ద్వారా బీమా పొందజాలరు.

 1. మొదటి సారి ఖాతా తెరిచి ఉండాలి, దానితో పాటు రూపే డెబిట్‌ కార్డు సైతం కలిగి ఉండాలి.

 2. ఆగస్టు 15, 2014 నుంచి జనవరి 26, 2015 మధ్య తెరిచిన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం గడువును పెంచితే దాని ప్రకారం తర్వాతి ఖాతాలకు సైతం వర్తింపజేస్తారు.

 3. బీమా పొందే వ్యక్తి సంపాదించే వ్యక్తి అయి ఉండాలి లేదా కుటుంబ పెద్ద అయి ఉండి, 18 నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలి. ఒకవేళ కుటుంబ పెద్ద వయస్సు 60 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే, కుటుంబంలో తదుపరి సంపాదించే వ్యక్తి అర్హతను బట్టి బీమాను నిర్ణయిస్తారు.

 4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన వారికి వర్తించదు.

 5. బీమా పథకం సంబంధించిన ఇతర నియమనిబంధనల ఆధారంగా బీమా వర్తింపజేస్తారు.

క్లెయిం సెటిల్‌మెంట్‌ :

 1. క్లెయిం సొమ్మును నామినీకి చెల్లిస్తారు.
 2. క్లెయింను పొందేందుకు ఎల్‌ఐసీ కార్యాలయాలకు అనుసంధానించారు.

సంబంధిత బ్యాంకు జిల్లా/నోడల్‌ శాఖ నుంచి క్లెయిం పత్రాలు ఎల్‌ఐసీకి చేరతాయి. నామినీకి బ్యాంకు ఖాతాలో నగదు సొమ్మును ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌ లేదా ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చెల్లిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly