టాప్ అప్ పాల‌సీ వ‌ల్ల లాభాలేంటి?

ఆరోగ్య బీమా ప‌రిమితి దాటిన‌పుడు ఆ మొత్తాన్ని పాల‌సీదారుడు చెల్లించాల్సి వ‌స్తుంది. అయితే టాప్ అప్ పాల‌సీల‌తో ప‌రిమితి పెంచుకోవ‌చ్చు.

టాప్ అప్ పాల‌సీ వ‌ల్ల లాభాలేంటి?

అనుకోకుండా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు వైద్య స‌దుపాయం పొందాలంటే ఆరోగ్య బీమా త‌ప్ప‌నిస‌రి. సాధారణ ఆరోగ్య బీమా ఎంచుకున్న పరిమితి మేరకు మాత్రమే వైద్యఖర్చులను చెల్లిస్తుంది. ఒక వేళ మనకేదైనా అనారోగ్యం వచ్చి ఆరోగ్య బీమా పాలసీ అందించే బీమా సొమ్ముకు మించి ఖర్చైతే మిగతా సొమ్మును మన చేతి నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా అని ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవాలి అంటే ప్రీమియం అధికంగా చెల్లించడం భారం అవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రూపొందించినవే టాప్అప్ పాలసీలు. అందుబాటులో ఉండే ప్రీమియంతో అవసరం అయినప్పుడు అధిక మొత్తంలో బీమా చెల్లించి ఆదుకునే వీలును టాప్అప్ కల్పిస్తాయి.

ఆరోగ్య బీమాలో అందించే హామీ సొమ్ము పరిధి దాటాక టాప్‌ అప్‌ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టాప్‌ అప్‌ పాలసీలు, బీమా పరిమితి దాటాక అయిన ఖర్చులను బీమా కంపెనీలు చెల్లిస్తాయి. అదనపు బీమా సొమ్ము కావాలనుకున్న వ్యక్తులు లేదా పెరుగుతున్న వైద్య ఖర్చులకు ప్రస్తుత పాల‌సీ సరిపోదని భావించినట్టయితే టాప్‌ అప్‌ పాలసీ తీసుకోవడం మంచిది.

ఉదాహరణకు ఒక‌ వ్యక్తి రూ.3 లక్షలకు ఆరోగ్య బీమా చేయించుకున్నాడనుకుందాం. అతడికి అనారోగ్యం కలిగి వైద్యఖర్చులు రూ.4.5 లక్షలు ఖర్చైతే బీమా కంపెనీ హామీ ఇచ్చిన రూ.3లక్షలే చెల్లిస్తుంది. మిగతా రూ.1.5లక్షలు ఆ వ్యక్తి స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. టాప్‌ అప్‌ పాలసీ తీసుకున్నట్టయితే ఈ అదనపు సొమ్మును టాప్‌ అప్‌ పాలసీ ద్వారా క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ టాప్‌ అప్‌ పాలసీల ప్రీమియం, సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కంటే తక్కువగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆర్యోగ బీమా పొందేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. టాప్‌ అప్‌ పాలసీని మనకున్న ఆరోగ్య బీమా కంపెనీతోనే తీసుకోవాలనే నిబంధనేమీ లేదు. ఇతర కంపెనీల టాప్‌ అప్‌ పాలసీలు తీసుకునే వీలుంది. టాప్‌ అప్‌ పాలసీలు వ్యక్తిగతంగా లేదా కుటుంబమంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌గా తీసుకోవచ్చు. రూ.3లక్షలు నుంచి రూ.15లక్షల వరకు అదనపు బీమా కల్పించే టాప్‌ అప్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

సూపర్‌ టాప్‌ అప్‌ పాలసీలు: వీటిలో విడివిడిగా అయిన వైద్యఖర్చులు కలిపి లెక్కకట్టి కనీస పరిమితికి పరిగణిస్తారు. అంతేకానీ వీటన్నింటినీ కలిపి కనీస పరిమితి దాటినట్లుగా లెక్కలోకి తీసుకోరు. ఈ సూపర్‌ టాప్‌ అప్‌ పాలసీలకు ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది. ఉదాహరణకు టాప్‌ అప్‌ కనీస పరిమితి రూ.3 లక్షలు ఉన్నట్టయితే ఒకసారికి రూ.2లక్షలు ఖర్చు అయి, ఆ తర్వాత మరోసారి రూ.2.5 లక్షలు అయితే ఇవి సూప‌ర్ టాప్ గ‌రిష్ట ప‌రిధి లోపుల ఉన్నాయి.వీటి రెండింటినీ కలిపి రూ.4.5లక్షలుగా పరిగణించరు. వేటికవే విడివిడిగా పరిగణిస్తారు.

సాధారణంగా ఈ టాప్‌ అప్‌ పాలసీలు తీసుకునేవారు 45ఏళ్లు మించనివారైతే వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి కాదు. ఒకవేళ ఆరోగ్య పరీక్షలు చేయిస్తే అందుకైన ఖర్చులో 50శాతం వరకు బీమా కంపెనీలు తిరిగి చెల్లిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం సెక్షన్‌ 80 (డీ) కింద పన్ను మినహాయింపు ఉంటుంది.
టాప్‌ అప్‌ పాలసీలను ఆరోగ్య బీమా పాలసీలకు ప్రత్యామ్నాయంగా చూడకుండా కేవలం తక్కువ ప్రీమియం ఎక్కువ బీమా పొందేందుకు ఉపయోగపడే సాధనాలుగా పరిగణిస్తే మంచిది. ఈ టాప్‌ అప్‌ పాలసీల్లో కనీస పరిమితి దాటాక మాత్రమే బీమా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly