మార్కెట్ బాటలో సాగండి ఇలా!

మార్కెట్‌ పడుతుందనే ఆందోళనతో పెట్టుబడి వెనక్కి తీసుకుంటుంటారు

మార్కెట్ బాటలో సాగండి ఇలా!

ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారింది… ఎక్కడ ఏ సంఘటన జరిగినా… మిగతా ప్రపంచ దేశాలన్నీ ఆ ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలపై ఇది వేగంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లో మదుపు చేసేవారు ప్రంపంచాన్నంతా గమనిస్తూ ఉండాల్సిన రోజులివి. వాటి ఆధారంగా పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమతౌల్యంగా చేసుకుంటూ ఉండటమూ ముఖ్యమే.

కొన్ని నెలల క్రితం భారత- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధాలు, బ్రెగ్జిట్‌ ఇలా రకరకాల కారణాల వల్ల మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులకు లోనైంది.అయితే, ఎన్నికల ముందస్తు ఫలితాలతో మరో సరి లాభాల బాట పట్టింది. తెలివైన మదుపరి ఈ ఆటుపోట్ల నుంచి లాభాలు సంపాదించడం ఎలా అనేది తెలుసుకోవాలి. అదే సమయంలో మన పెట్టుబడులను కాపాడుకుంటూ నష్టాలను పరిమితం చేసుకోవడమూ నేర్చుకోవాలి.

ఆందోళన వద్దు… స్టాక్‌ మార్కెట్లో బయట శక్తులను మనం నియంత్రించలేం. కానీ, మీ దగ్గరున్న సమాచారాన్ని విశ్లేషించి, మనం తీసుకునే నిర్ణయమే మన పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. కాబట్టి, వచ్చిన వార్తల ఆధారంగా వెంటనే ఆందోళన చెందకుండా వాటిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ వార్తల్లోని వాస్తవాలను గమనించాలి. మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పుడు చిన్నచిన్న వార్తలు కూడా సూచీలను కిందకు తోసేస్తుంటాయి. ఇలాంటప్పుడు మార్కెట్‌ మరింత పడుతుందనే ఆందోళనతో పెట్టుబడి మొత్తాలను వెనక్కి తీసుకుంటుంటారు చాలామంది. ఇలాంటివారు మళ్లీ మార్కెట్‌ పెరిగినప్పుడు బాధపడుతుంటారు.

మార్కెట్లో ఆటుపోట్లు కొనసాగుతున్నప్పుడు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సొమ్ము నష్టపోకుండా చూసుకోవాలి. అదే సమయంలో మార్కెట్లో కొనసాగుతూ ఉండాలి.

నిర్ణయం తీసుకునే ముందు… ఏదో ఒక లక్ష్యం పెట్టుకునే పెట్టుబడులు ప్రారంభిస్తుంటాం. మార్కెట్లో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు ఈ పెట్టుబడులు మీ లక్ష్యాన్ని చేరుకునేలా పనితీరు చూపిస్తున్నాయా? లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. అప్పుడే ఆ పెట్టుబడులను కొనసాగించాలా… లేదా వెనక్కి తీసుకొని ప్రత్యామ్నాయ పథకాల్లోకి మళ్లించాలా అనేది స్పష్టత వస్తుంది.

ఉదాహరణకు మీరు గత 10 ఏళ్ళ నుంచి మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నారు… మరో ఏడాది లేదా రెండేళ్లలో ఆ డబ్బుతో అవసరం ఉంది. ఇలాంటప్పుడు ఆ పెట్టుబడి మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకొని, సురక్షిత పథకాల్లోకి మార్చుకోవాలి. స్వల్పకాలిక హెచ్చుతగ్గుల నుంచి రక్షించుకోవడానికి ఈ వ్యూహం ఉపయోగపడుతుంది. మీకు కొన్నేళ్ల తర్వాత డబ్బు అవసరం ఉందనుకుంటే… పెట్టుబడులను అలాగే కొనసాగించాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి చేతికందుతుంది. మార్కెట్‌ తగ్గుతున్నప్పుడు క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయడం కలిసొస్తుంది.

వైవిధ్యం చూపండి. నష్టభయాన్ని పరిమితం చేసుకునే వ్యూహంలో పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరం. ఇలా చేయడం వల్ల ఒక పథకం నష్టాన్నిచ్చినా… మరోటి లాభాలను పంచుతుంది. నష్టభయం ఉండే ఈక్విటీ పథకాలతో పాటు… పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, జాతీయ పొదుపు పథకాల్లాంటి సురక్షిత పథకాలనూ పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగా చేయాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి ఉన్న పథకంగా బంగారానికీ పేరుంది. అయితే, బంగారానికి మొత్తం పెట్టుబడిని కేటాయించడం సరికాదు. మొత్తం పెట్టుబడిలో పసిడిలో 5శాతానికి మించకుండా చూసుకోవడమే మేలు.

మార్పులు చేయాలనుకుంటే… అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈక్విటీ మార్కెట్ల పనితీరు బాగాలేనప్పుడు పెట్టుబడుల్లో డెట్‌ పథకాలకు మళ్లించే మొత్తం పెరగాలి. ఈక్విటీ మార్కెట్లో దిద్దుబాటు ఉంది కదా… అని చెప్పి, డెట్‌ పథకాల్లో ఉన్న డబ్బంతా తీసుకొచ్చి, ఇక్కడ పెట్టాలనుకోవడం సరికాదు. ఉన్న పెట్టుబడులను అలాగే కొనసాగిస్తూ… మార్కెట్‌ మళ్లీ వృద్ధిలోకి వచ్చే సమయం కోసం ఎదురుచూడండి. ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకోండి. మార్కెట్లో పెట్టుబడిని కాపాడుకోవడానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని, సమయానుకూలంగా పెట్టుబడుల్లో మార్పులు చేర్పులు చేసుకునేందుకు ప్రయత్నించిన నాడు… అనిశ్చితిలోనూ… అవాంతరాలు లేకుండా లాభాలు ఆర్జించగలం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly