పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం ఐదు మార్గాలు

పిల్ల‌ల బంగారం భ‌విష్య‌త్తు కోసం అనుస‌రించాల్సిన మార్గాల‌ను తెలుసుకుందాం

పిల్ల‌ల బంగారు భ‌విష్య‌త్తు కోసం ఐదు మార్గాలు

వ్య‌క్తుల ఆర్థిక ల‌క్ష్యాల‌లో పిల్ల‌ల చ‌దువులు, పెళ్లిల్లు కూడా ఒక భాగం. వీటిని విస్మ‌రించ వీలు లేదు. అయితే ఇంత ముఖ్య‌మైన అంశ‌మైన‌ప్ప‌టికీ, ఈ విష‌యంలో ప్ర‌జ‌లు కొన్ని పొర‌పాట్లు చేస్తూ ఉంటారు. దీని వల్ల వారు ఆశించిన ఫ‌లితాల‌ను పొంద‌లేరు. మీ పిల్ల‌ల భ‌విష్య‌త్తు బంగారంగా ఉండాలంటే ఏం చేయాలో ఒక సారి ప‌రిశీలిద్దాం.

  1. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోండి

మీ పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, పెళ్లిళ్ల కోసం మీరు ప్ర‌స్తుతం ఏర్పాటు చేసుకున్న నిధి మ‌రో 10-20 ఏళ్ల త‌ర్వాత స‌రిపోదు. దీనికి కార‌ణం, ద్ర‌వ్యోల్బ‌ణం వ‌ల్ల రోజు రోజుకూ ఖ‌ర్చులు పెరిగిపోతుండ‌ట‌మే. ద్ర‌వ్యోల్బ‌ణం మీ ఆదాయానికి గండి పెట్ట‌వ‌చ్చు. కాబ‌ట్టి మీ పిల్ల‌ల ఉన్న‌త విద్య‌, పెళ్లిళ్ల కోసం అవ‌స‌ర‌మైన నిధిని ఏర్పాటు చేసే ముందు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌డం మ‌రువ‌ద్దు.

  1. ఈక్విటీల‌పై దృష్టి సారించండి

పిల్ల‌ల భవిష్య‌త్తు బాగుండాలంటే దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డులు చేయాలి. మంచి రాబ‌డుల కోసం ఈక్విటీల‌లో మ‌దుపు చేయ‌డం ఉత్త‌మం. ఈక్విటీలు స్వ‌ల్ప కాలంలో ఒడుదొడుకుల‌కు గుర‌వ‌వ‌చ్చు కానీ, దీర్ఘ‌కాలంలో ఏ ఆర్థిక సాధనాల‌తో పోల్చినా ఇవి మంచి రాబ‌డుల‌నే ఇస్తాయి. దీంతో పాటు బంగారం, స్థిరాస్తుల‌లో మ‌దుపు చేయ‌డ‌మూ మంచిదే.

  1. స‌మ్మిళితంగా ఉండాలి

పెట్టుబ‌డుల‌కు త‌గిన రాబ‌డుల‌నివ్వ‌డంలో మ్యూచువ‌ల్ ఫండ్ల పాత్రా త‌క్కువేమీ కాదు. అలాగే పెట్టుబ‌డుల‌న్నీ ఆర్థిక సాధనాల స‌మ్మిళితంగా ఉంటే మంచిది. లార్జ్‌క్యాప్ ఫండ్ల‌లో ఎక్కువ భాగం పెట్టుబ‌డులు పెట్ట‌డంతో పాటు, మిడ్ క్యాప్ ఫండ్ల‌పైనా దృష్టి సారించాలి. ఇంకా చెప్పాలంటే ఎక్స్ఛేంజ్ ఫండ్లు, ఇండెక్స్ ఫండ్ల‌లో విడివిడిగా లేదా రెండింటిలో క‌లిపి పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. దీనికి స‌మాంతరంగా మీ పిల్ల‌ల పేరు మీద
ప్ర‌జా భవిష్య నిధి ఖాతా తెర‌వ‌డ‌మూ మర‌వ‌వ‌ద్ద‌ని ఆర్థిక నిపుణుడొకరు అన్నారు.

  1. క్ర‌మంగా పెట్టుబ‌డులు పెట్టాలి

ఒకేసారి ఏక మొత్తంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం కంటే, క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల ప‌థ‌కాల‌(సిప్‌)ను ఎంచుకోండి. ఏక మొత్తంలో కాకుండా, క్ర‌మం త‌ప్ప‌కుండా, స్థిరంగా కొంత మొత్తాల‌ను పెట్టడం సుల‌భ‌మైన‌ది. సిప్‌ల‌లో మ‌దుప‌రులు మార్కెట్లు ప‌డిపోయిన‌ప్పుడు అధిక యూనిట్లు, రాణిస్తున్న‌ప్పుడు త‌క్కువ యూనిట్ల‌ను చేజిక్కించుకునే సౌల‌భ్యం ఉంది. దీనిని రూపాయి-వ్య‌య స‌గటు(రూపీ కాస్ట్ యావ‌రేజింగ్‌) అంటారు.

  1. పెట్టుబ‌డుల స‌మ‌తౌల్యాన్ని ప‌రిశీలించండి

మీ పెట్టుబ‌డుల స‌మ‌తౌల్యాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తూ ఉండాలి. దీనికి సుల‌భ‌మైన మార్గం మీ ఫండ్ బ్యాలెన్స్‌ను 36 వాయిదాలుగా విభ‌జించి క్ర‌మానుగ‌త బ‌దిలీ ప‌థ‌కాన్ని అమ‌లు చేయండి. ఉదాహ‌ర‌ణ‌కు మీ పిల్ల‌ల చ‌దువుకు రూ.10 ల‌క్ష‌లను ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో జ‌మ చేస్తే, పిల్ల‌ల అవ‌స‌రాల‌కు మూడేళ్ల‌పాటు నెల‌కు రూ.27 వేల చొప్పున బ‌దిలీ అవుతాయి.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly