కారు కొనుగోలే లక్ష్యం - ఎప్పుడు, ఎలా?

ఆర్ధిక స్థితిగతులకి తగ్గట్టుగా ప్రణాళిక ఉండాలి

కారు కొనుగోలే లక్ష్యం - ఎప్పుడు, ఎలా?

Q. నా వయసు 31, భార్య 25, పాప 4 ఏళ్ళు , బాబు 1 ఏడాది . నెలసరి ఆదాయం రూ 75 వేలు . జీవిత బీమా LIC , HSBC, మాక్స్ లైఫ్ ల మొత్తం రూ 2 కోట్లు. వార్షిక ప్రీమియం రూ 45 వేలు. స్టార్ హెల్త్ ఆరోగ్య బీమా రూ 10 లక్షలు. స్థిరాస్తి రూ 30 లక్షలు. లోన్ రూ 6 లక్షలు. కారు కొనుగోలు లక్ష్యం. దీనితో పాటు నా ఆర్ధిక స్థితిగతుల మీద నాకు మంచి సలహాలు ఇవ్వండి.

A. ముందుగా మీ ఇతర ఆర్ధిక లక్ష్యాలను గుర్తించండి. ఉదా : పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహాలు , పదవీ విరమణ అనంతర ఆదాయం వంటివి. వాటి ప్రకారం మదుపు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు ఇచ్చే మంచి బహుమతి నాణ్యమైన విద్య. పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ముందునుంచే మదుపు చేయటం మొదలుపెట్టాలి.

మనం చేసే ప్రతి పెట్టుబడి ముందు భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

టర్మ్ జీవిత బీమా రూ 2 కోట్లుగా రాశారు. సరిపోతుంది. టర్మ్ జీవిత బీమా తీసుకునే సమయంలో, మీరు అప్పటి వరకు కలిగివున్న పాలసీ వివరాలను ఇన్స్యూరెన్స్ కంపెనీకి తెలిపి ఉంటారని భావిస్తున్నాము. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

పీపీఎఫ్ లో మదుపు పెంచండి. మ్యూచువల్ ఫండ్లలో కూడా మదుపు చేయడం మంచిది. ఒక ఇండెక్స్ ఫండ్ ఎంచుకుని అందులో సిప్ ద్వారా కనీసం 10 ఏళ్ళ పాటు మదుపు చేయండి.

(మీ పాప కోసం) సుక‌న్య స‌మృద్ధి యోజ‌న: ప్రస్తుత వార్షిక వడ్డీ 8.4 శాతం. వార్షికంగా గరిష్ట పెట్టుబడి రూ . 1.50 లక్షలు. 18వ ఏట నుండి పాక్షిక నగదు ఉపసంహరణ సదుపాయం ను ఆమె ఉన్నత చదువులకు, వివాహానికి ఉపయోగించుకోవచ్చు. నగదు జమ చేసినప్పుడు, జమ అయిన వడ్డీ ఫై, అలాగే నగదు ఉపసంహరణలపై పన్ను మినహాయింపులు ఉంటాయి.

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా గురించి స‌మ‌గ్ర వివరాలు

ఎన్పీఎస్ లో మదుపు చేయడం వల్ల మీరు మంచి పదవీ విరమణ నిధి, పెన్షన్ పొందొచ్చు. ఈక్విటీ లలో 50 శాతం వరకు మదుపు చేసే అవకాశం ఉండటం వలన, దీర్ఘకాలంలో 9-10% వరకు రాబడి ఆశించవచ్చు. ప్రస్తుత నియమాల ప్రకారం 60 సం వయసులో, జమ అయిన నిధి నుంచి పన్ను మినహాయింపు తో 60 శాతం నిధిని పొందవచ్చు. మిగిలిన 40 శాతం ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఇందులో సెక్షన్ 80C కాకుండా అదనంగా రూ. 50 వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు.

కారు : ప్రస్తుతం దీన్ని 5 సంవత్సరాలకు పోస్టుపోన్ చేయండి. ఒకవేళ అవకాశం వచ్చినా సెకండ్ హ్యాండ్ కారుని తీసుకోండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly