రిస్క్ తగ్గించుకోండి.. రాబడి పెంచుకోండి

మ‌దుప‌ర్లు జాగ్ర‌త్త‌గా త‌మ పోర్టుఫోలియోను గ‌మ‌నిస్తే త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉండేలా చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ఏవైనా పొర‌పాట్లు చేస్తే తెలుసుకోవ‌చ్చు.

రిస్క్ తగ్గించుకోండి.. రాబడి పెంచుకోండి

పెట్టుబడులకు సంబంధించి తక్కువ నష్టభయం ఉండేవి రాబడి తక్కువగా, కాస్త ఎక్కువ నష్టభయం ఉండే వాటిలో రాబడి ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మదుపర్లు త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డులను ఎంపిక చేసుకోవడం సురక్షితంగా ఉంటుంది. అయితే త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డులు ఎక్కువ‌గా చేయ‌డం వ‌ల్ల కూడా న‌ష్టం ఉంటుందని అంటున్నారు నిపుణులు. మ‌దుప‌ర్లు జాగ్ర‌త్త‌గా త‌మ పోర్టుఫోలియోను గ‌మ‌నిస్తే త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉండేలా చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ఏవైనా పొర‌పాట్లు చేస్తే తెలుసుకోవ‌చ్చు.

సాధార‌ణంగా చేసే కొన్ని పొర‌పాట్లు:
దీర్ఘ‌కాల పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ కోసం స్వ‌ల్ప‌కాలానికి అనుకూలంగా ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవ‌డం ఒక పొర‌పాటు. ఉదాహ‌ర‌ణ‌కు దీర్ఘ‌కాలంపాటు పెట్టుబ‌డి చేసేవారు స్వ‌ల్ప‌కాలిక డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలో డ‌బ్బులు ఉంచుకోవ‌డం ద్వారా ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావంతో అస‌లు రాబడి త‌గ్గేందుకు వీలుంటుంది. న‌ష్టభ‌యం మ‌రీ తక్కువ ఉండే పెట్టుబడుల్లో వృద్ధి రేటు పొంద‌డానికి తక్కువగా ఉంటుంది. నిర్దేంచిన ల‌క్ష్యాల‌ను చేరేందుకు స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు దీర్ఘ‌కాలంలో మంచి వృద్ధిని సాధించ‌డం ద్వారా మూల‌ధ‌న వృధ్ధిని పొంది ఆర్థిక ల‌క్ష్యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నారు. అప్పుడు త‌గిన వృద్ధి చెందే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి గానీ ఆదాయ ఆధారిత పెట్టుబడులను ఎంచుకుంటే ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు ఆటంకంగా మారుతుంది. పన్ను మిన‌హాయింపు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల‌ వంటి క్రమానుగత వడ్డీని అందించే పెట్టుబడుల‌ను ఎంచుకుంటే అవి దీర్ఘకాలంలో వృద్ధి చెందేందుకు వీలుండ‌దు. ఎందుకంటే ఎప్ప‌టిక‌ప్పుడు అవి ఆదాయాన్ని మ‌దుప‌ర్ల‌కు పంచుతుంటాయి. వాటి ద్వారా వ‌చ్చిన రాబ‌డిని తిరిగి మ‌దుపుచేసే అల‌వాటు ఉంటే మీకు కావలసిన మొత్తానికి అనుగుణంగా వృద్ధి చెందుతుంది,

కాల‌ప‌రిమితి ఎక్కువ‌గా: త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబ‌డి అవ‌స‌రం ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు 20 ఏళ్ల‌లో రూ. కోటి సంపాదించాల‌ని ల‌క్ష్యంతో ఈక్విటీ ఫండ్ల‌లో రాబ‌డి అంచ‌నా 12 శాతం చొప్పున నెల‌కు రూ.10,000 చొప్పున మ‌దుపు చేస్తే సంపాదించ‌వ‌చ్చు. అదే న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండే స్థిరాదాయ ప‌థ‌కాల్లో వార్షిక రాబ‌డి అంచ‌నా 7 శాతం చొప్పున నెల‌కు రూ.20,000 పెట్టుబ‌డి చేయాలి. ఈ రెండు సంద‌ర్భాల్లోనూ న‌ష్ట‌భ‌యం ప్ర‌ధాన వ్య‌త్యాసం. పెట్టుబ‌డుల విష‌యంలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ ఉంటే రాబ‌డి కూడా ఎక్కువ‌గా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంది. మదుపర్లు తమ నష్టభయం ఆధారంగా పధకాలను ఎంచుకోవాలి.

న‌ష్ట‌భ‌యం స‌ర్దుబాటు:
ఏ విధమైన రిస్క్ లేని పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా మ‌దుప‌ర్లు మంచి వృద్ధి ని పొందేందుకు అవ‌కాశం ఉండ‌దు. ఈక్విటీమార్కెట్లో ఉండే అస్థిరతను తొలగించలేం గానీ దీర్ఘకాలిక లక్ష్యాలకు ఈక్విటీ వంటి న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబడులను కేటాయించడం ద్వారా మీ లక్ష్యాలపై దాని ప్రభావాన్ని తటస్తం చేయవచ్చు. ఈ పెట్టుబడులు స్వల్పకాలంలో హెచ్చ‌త‌గ్గుల‌కు గురికావొచ్చు కానీ దీర్ఘకాలంలో పెట్టుబడుల పై అస్థిరత త‌గ్గుతుంది. పెట్టుబడి దాని క్రమంగా వృద్ధి చెందుతుంది. న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబడులను చేస్తే వాటిని అప్పుడ‌ప్పుడు సమీక్షించుకోవ‌టం ద్వారా ఏవైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. దీని ద్వారా స‌రిగా రాణించ‌ని లేదా రాణించేందుకు అవ‌కాశం లేని పెట్టుబ‌డుల‌ను తొలిగించ‌వ‌చ్చు. లక్ష్యం స‌మీపించే స‌మ‌యంలో హెచ్చుత‌గ్గుల‌ను త‌గ్గించుకోవ‌డానికి, నిధుల‌ను సుల‌భంగా పొందేందుకు వీలుగా ఉండే ఖాతాలోకి బ‌దిలీ చేయాలి. పెట్టుబడుల నుంచి కాలానుగుణ చెల్లింపులను అందుకోవచ్చు,

న‌ష్ట‌భ‌యం, రాబ‌డి రెండింటిని దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యం తీసుకోవాలి . క్రమబద్దంగా పోర్ట్ఫోలియోను నిర్మించుకున్న‌పుడు ఇది సాధ్య‌ప‌డుతుంది. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యానికి అనుగుణంగా పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంపిక చేసుకుని పోర్టుఫోలియో నిర్మించుకోవాలి. అస్థిరత‌ను అధిగ‌మించే విధంగా పోర్టుఫోలియో ఆస్తి కేటాయింపును కలిగి ఉండాలి. సురక్షితమైన పెట్టుబడులలో కొంత భాగం త‌ప్ప‌కుండా ఉండాలి. కొంత భాగం వృద్ధి ఆధారిత ప‌థ‌కాల‌లో పెట్టాలి. కొత్త‌గా పెట్టుబ‌డులు ప్రారంభించి పోర్టుఫోలియో నిర్మించుకునేందుకు, ప్రారంభంలో త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి క్ర‌మంగా న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబ‌డులును చేర్చుకుంటూ వెళ్లాలి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఎంత ఉంద‌నేది అంచ‌నా వేసుకోవాలి. దీనికి పెట్టుబ‌డి స‌ల‌హాదారుని సంప్ర‌దించ‌డం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly