పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితి, నష్టాన్ని తట్టుకునే శక్తి, రాబడి తదితరాలను లెక్కలోకి తీసుకొని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది

పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

వ్యక్తులు తమ సంపదలో కొంత భాగాన్ని పొదుపు చేసి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటారు. పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, పదవీ విరమణ తర్వాత అవసరాలకు, అత్యవసర పరిస్థితుల్లో అనుకోకుండా వచ్చే ఖర్చులను తట్టుకునేందుకు కొంత మొత్తం పొదుపు చేస్తుంటారు. ఇలా పొదుపుచేసే డబ్బు పెద్దగా రాబడులను తీసుకురాదు. మంచి రాబడులు పొందేందుకు మన సంపద వృద్ధి చెందేందుకు సరైన పెట్టుబడి మార్గాల్లో మదుపు చేయాలి. పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితి, నష్టాన్ని తట్టుకునే శక్తి, రాబడి తదితరాలను లెక్కలోకి తీసుకొని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

మన దేశంలో అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి మార్గాలు:

  • బ్యాంకు డిపాజిట్లు, చిన్న తరహా పొదుపు పథకాలు
  • ప్రభుత్వ, కార్పొరేట్‌ బాండ్లు
  • మ్యూచువల్‌ ఫండ్లు
  • ఈక్విటీ మార్కెట్లు

బ్యాంకు డిపాజిట్లు, చిన్న తరహా పొదుపు పథకాలు:

వీటిలో మ‌దుపుచేసే వారికి పెట్టుబ‌డి భ‌ద్ర‌త ఉంటుంది. దాదాపు న‌ష్ట‌భ‌యం లేద‌నే చెప్పాలి. అయితే మిగిలిన పెట్టుబ‌డి సాధ‌నాల‌తో పోలిస్తే రాబ‌డి కొంత త‌క్కువ‌గా ఉంటుంది. న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉన్న మ‌దుప‌ర్లు ఈ మార్గంలో మ‌దుపుచేయ‌డం మంచిది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ద‌వీవిర‌మ‌ణ పొందిన వారు ఈ ర‌క‌మైన పెట్టుబ‌డిని ఎంచుకోవ‌చ్చు.

మ‌దుప‌ర్ల ఆర్థిక అవ‌స‌రాలు ,ల‌క్ష్యాల‌కు అనుగుణంగా వీటిలో మ‌దుపుచేస్తుంటారు…
బ్యాంకు డిపాజిట్లు రోజుల నుంచి సంవ‌త్స‌రాల వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. వీటిలో రాబ‌డికి క‌చ్చిత‌మైన హామీ ఉంటుంది. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం వ‌డ్డీ అందుతుంది. వీటిలో మ‌దుపుచేసేందుకు క‌నీస ప‌రిజ్ఞానం స‌రిపోతుంది. మ‌దుపుచేసేందుకు సంబంధిత బ్యాంకును సంప్ర‌దించాలి…

ప్ర‌భుత్వ, కార్పోరేట్ బాండ్లు:

ప్ర‌భుత్వ, కార్పోరేట్ బాండ్లు స్థిరాదాయ పెట్టుబ‌డి సాధనాలు. ఈ వ‌ర్గం పెట్టుబ‌డుల్లో రెండు విభిన్న అంశాలున్నాయి. ఒక‌టి ప్ర‌భుత్వ బాండ్లు, వీటిలో పెట్టుబ‌డికి న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. రెండో ది కార్పోరేట్ బాండ్లు వీటిలో న‌ష్ట‌భ‌యం ఉంటుంది. అది వాటి క్రెడిట్ రేటింగు పై ఆధార‌ప‌డి ఉంటుంది. మ‌దుప‌ర్లు వారి న‌ష్ట‌భ‌యానికి స‌రిపోయే రేటింగు ఉన్న కార్పోరేట్ బాండ్ల‌ను ఎంచుకోవాలి కార్పోరేట్ బాండ్ల‌లో మ‌దుపుచేసేందుకు కొంత అవ‌గాహ‌న అవ‌స‌రం.

కాల‌ప‌రిమితి ఆయా బాండ్ల పై ఆధార‌ప‌డి ఉంటుంది. కార్పోరేట్ బాండ్లు సంవ‌త్స‌రం నుంచి ప‌ది సంవ‌త్స‌రాల కాల పరిమితి వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి. ప్ర‌భుత్వ బాండ్లు అయితే సంవ‌త్స‌రం నుంచి ముప్పై ఏళ్ల కాల‌ప‌రిమితి వ‌ర‌కు అందుబాటులో ఉంటాయి…

మ్యూచువ‌ల్ ఫండ్లు:

మ‌దుప‌ర్ల నుంచి స‌మీక‌రించిన నిధుల‌ను ఫండ్ నిర్వాహ‌కులు వివిధ పెట్టుబ‌డి సాధ‌నాల్లో మ‌దుపుచేస్తారు. వీటిని నిపుణులైన ఫండ్ మేనేజ‌ర్లు నిర్వ‌హిస్తారు. వీటిలో పెట్టుబ‌డికి న‌ష్ట‌భ‌యం, రాబ‌డి ఆయా ఫండ్ల వ‌ర్గాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. స్థిరాదాయ ఫండ్లు కొంత త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉన్న వారికి అనుకూలంగా ఉంటాయి. కాస్త నష్టాన్ని తట్టుకుని ఎక్కువ రాబడి ఆశించే వారు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. పెట్టుబడికి భద్రత ఉండి, కాస్త మెరుగైన రాబడి కావాలనుకునే వారికి బ్యాలెన్స్డ్ ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యాన్ని, ఆర్ధిక లక్ష్యాన్ని బ‌ట్టి ఫండ్లను ఎంపిక చేసుకోవాలి.
దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కుమ్యూచువ‌ల్ ఫండ్లు చాలా అనువైన‌వి.

వీటిలో మ‌దుపు చేసేందుకు కొంత అవ‌గాహ‌న అవ‌స‌రం.ముఖ్యంగా ఫండ్ ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఒకే సారి పెద్ద మొత్తం లేదా నెల నెలా చిన్న మొత్తాలు సైతం మదుపు చేసే వీలు ఉంటుంది. ఆర్ధిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచిది.

ఈక్విటీ మార్కెట్లు:

షేర్లను కొనుగోలు చేయడం అంటే ఆ సంస్థలో భాగస్వామిగా మారడం. ఈ విధంగా భాగస్వామ్యం పొందిన వారికి ఆ కంపెనీకి సంబంధించిన నిర్ణయాలలో భాగస్వామ్యం పొందే హక్కు ఉంటుంది. దీర్ఘ కాలం (5 సంవత్సారల పైన) మదుపు చేయగలిగిన వారికి ఈ పెట్టుబడి మార్గం మంచి వృద్ధిని ఇస్తుంది. వీటిలో మ‌దుపుచేసే వారికి మార్కెట్ల పై కొంత అవ‌గాహ‌న అవ‌స‌రం.
ఏదైనా బ్రోకింగ్ సంస్థ నుంచి డీమ్యాట్ ఖాతాను తెర‌వాలి. ఈక్విటీ మార్కెట్లో మ‌దుపుచేసేవారు త‌మ న‌ష్ట‌భ‌యానికి స‌రిపోతుందో లేదో అంచ‌నా వేసుకోవాలి. ముఖ్యంగా షేర్ల ఎంపిక‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి.

పెట్టుబ‌డి చేసే ముందు మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితి, న‌ష్ట‌భ‌యం, రాబడి, పెట్టుబ‌డి సాధ‌నాల పైవారి అవ‌గాహ‌న‌, సామీప్య‌త త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly