విదేశాల్లో ఉద్యోగం వచ్చిందా? మరి పీఎఫ్ ఖాతా సంగతేంటి?

ఒకవేళ మీరు విదేశాల్లో స్థిరపడినట్లయితే, ఏ వయస్సులోనైనా పీఎఫ్ ఉపసంహరణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవడంతో పాటు వెంటనే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు

విదేశాల్లో ఉద్యోగం వచ్చిందా? మరి పీఎఫ్ ఖాతా సంగతేంటి?

ఒకవేళ మీకు విదేశాల్లో ఉద్యోగం వచ్చి, శాశ్వతంగా అక్కడ నివాసం ఏర్పరచుకోవాలని అనుకున్నట్లైతే, మీ ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతా గురించి మాత్రం మర్చిపోవద్దు. మీరు మీ ఖాతాలోని పీఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకుని ఖాతాను మూసివేయవచ్చు. ఈపీఎఫ్ చట్టం ప్రకారం, తుది పీఎఫ్ సెటిల్మెంట్ కోసం మీరు 58 సంవత్సరాల వయస్సు కలిగి ఉండడంతో పాటు, ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఉండాలి లేదా రెండు నెలల కంటే ఎక్కువ రోజుల పాటు ఉద్యోగం లేకపోయిన సందర్భంలో కూడా మీరు పీఎఫ్ ఖాతా నుంచి పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. పీఎఫ్ ఉపసంహరణ సమయంలో మీరు సేకరించిన మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్ ను వడ్డీతో సహా పొందవచ్చు. అయితే, ఒకవేళ మీరు విదేశాల్లో స్థిరపడినట్లయితే, ఏ వయస్సులోనైనా పీఎఫ్ ఉపసంహరణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవడంతో పాటు వెంటనే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణ దరఖాస్తు కోసం, మొదటగా మీరు పని చేస్తున్న సంస్థ నుంచి ఈపీఎఫ్ ఉపసంహరణ ఫారంను పొందాలి. మీరు ఈపీఎఫ్ఓ ​​(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) పోర్టల్ నుంచి కూడా ఈ ఫారంను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) మీ ఆధార్ తో అనుసంధానమై ఉన్నట్లయితే, ఆధార్ ఆధారిత ఉపసంహరణ ఫారంను మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు పనిచేసిన సంస్థతో సంబంధం లేకుండా నేరుగా ఈపీఎఫ్ఓ ​​కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే మీరు యూఏఎన్ పోర్టల్ ద్వారా కూడా ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాలకు వెళుతున్నందునే పీఎఫ్ ఉపసంహరణకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు ఫారంలో తెలిపి, అవసరమైన పత్రాలతో పాటు దీన్ని కూడా సమర్పించండి.

ఒకవేళ మీరు తాత్కాలికంగా విదేశాలకు వెళ్లాలని అనుకున్నట్లైతే, మీ ఈపీఎఫ్ ఖాతాను తాత్కాలికంగా నిలుపుదల చేసుకోవడం సరైన నిర్ణయం. ఒకవేళ మూడు సంవత్సరాల పాటు మీ ఖాతాలోకి ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేరకపోతే, అప్పుడు మీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తారు. అయితే, అప్పటి వరకు మీరు డిపాజిట్ చేసిన మొత్తంపై (మీకు 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు) వడ్డీని పొందుతారు.

మీరు విదేశాల్లో నివసిస్తూ అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లైతే, మీరు భారతీయ కంపెనీ తరపున ఉద్యోగం చేస్తున్నప్పటికీ అక్కడ మీరు పెన్షన్ లేదా సోషల్ సెక్యూరిటీ పథకం కోసం కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు భారతీయ ఉద్యోగిగా పని చేస్తూ, స్వల్ప కాల వ్యవధి కోసం విదేశాలకు వెళ్ళినట్లైతే, అలాంటి సందర్భంలో మీరు అక్కడి పెన్షన్ లేదా సోషల్ సెక్యూరిటీ పథకం కోసం కాంట్రిబ్యూట్ చేసినట్లయితే, మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీరు అక్కడి ప్రయోజనాలను పొందే అవకాశం ఉండదు. ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీతో సహా అనేక దేశాలతో భారత ప్రభుత్వం సామాజిక భద్రతా ఒప్పందాలను కలిగి ఉంది. ఒకవేళ మీరు ఈ దేశాలకు వెళ్ళినట్లైతే, మీరు ఈపీఎఫ్ఓ ​​జారీ చేసే కవరేజ్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది స్థానిక సోషల్ సెక్యూరిటీ పథకానికి కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు మినహాయింపును అందిస్తుంది. అయితే, ఇది పని చేయడానికి, మీరు భారతీయ కంపెనీలో ఉద్యోగాన్ని కలిగి ఉండడంతో పాటు, మీరు విదేశాల్లో ఉన్నంత కాలం మీరు పనిచేస్తున్న సంస్థ మీ తరపున ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ ను జమ చేయాల్సి ఉంటుంది.

మీ దీర్ఘ కాలిక ప్రణాళికల ఆధారంగా మీ ఈపీఎఫ్ ఖాతాని నిర్వహించండి, అలాగే పేపర్ వర్క్ ను మాత్రం సరైన సమయానికి పూర్తి చేయండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly