ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

మొద‌టి సారి మ‌దుపు చేయ‌డం ప్రారంభించిన‌ప్పుడు మ‌దుప‌రులు కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. అలాంటివేమిటో తెలుసుకొని మ‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌దాం.

ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

సాధార‌ణంగా మ‌దుప‌రులు తొలిసారి పెట్టుబ‌డులు చేసేట‌ప్పుడో, ఆ త‌ర్వాతో కొన్ని పొర‌పాట్లు చేయ‌డం సాధారణం. అవి ఎలాంటివో తెలుసుకొని మ‌నం ఆ త‌ప్పుల‌ను చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌దాం.

మ్యూచువ‌ల్ ఫండ్ త‌ప్పిదాలు

స‌మ‌యాన్ని బ‌ట్టి…

మార్కెట్లు గ‌రిష్ట స్థాయిని చేరినప్పుడల్లా ఏదైనా ఓ ఫండ్‌ కొనుగోళ్లు విప‌రీతంగా పెరిగిపోతాయి. 2008 ఆరంభంలోనూ ఇలాగే జ‌రిగింది. మౌలిక రంగానికి, మిడ్ క్యాప్ ఫండ్ల‌కు అప్ప‌ట్లో ఆద‌ర‌ణ బాగుండేది. ఆ రోజుల్లోనే కొత్త ఫండ్ ఆఫ‌ర్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. 2008 చివ‌ర‌లో ఈక్విటీ మార్కెట్ల ప‌త‌న‌మ‌వ్వ‌డంతో ఫండ్లు లాభాల‌ను కోల్పోయాయి. దీంతో మ‌దుప‌రులు ఉన్న పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసేసుకున్నారు. కాబ‌ట్టి దీని ద్వారా తెలిసిందేమిటంటే ఆద‌ర‌ణ బాగుంద‌ని, ఫండ్ ప‌ర్‌ఫామెన్స్ బాగుంద‌ని దాంట్లోనే పెట్టుబ‌డి పెడితే న‌ష్టాల‌కు గుర‌య్యే అవ‌కాశం ఉండొచ్చు. పెట్టుబ‌డుల‌కు స‌మ‌యం కూడా క‌లిసి రావాలి. స‌మ‌యానికి త‌గిన‌ట్టు పెట్టుబ‌డుల్లో మార్పులు చేసుకోవాలి.

కేటాయింపులు చూసుకోండి

ఈక్విటీల్లోనే పెట్టుబ‌డి చేసేందుకు మ‌దుప‌రులు ఆసక్తి చూపిస్తుంటారు. ఏడాదిలో ఈక్విటీల రాబ‌డి 20శాతం అందిస్తుంటే అదే స‌మ‌యంలో స్థిర ఆదాయాన్నిచ్చే ప‌థ‌కాలు మాత్రం కేవ‌లం 7-8శాతం రాబ‌డి మాత్ర‌మే ఇస్తుంటాయి. స‌హ‌జంగా ఈక్విటీల వైపే మొగ్గుచూపిస్తారు. స్థిర ఆదాయ ప‌థ‌కాల్లో కొంచెం కొంచెం పెట్టుబ‌డిని ఈక్విటీల‌కు మ‌ళ్లిస్తుంటారు. ఫండ్ల‌ను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో ఈక్విటీలే కావాల‌ని అడుగుతుంటారు. వారూ త‌మ వ్యాపారాన్ని కోల్పోవ‌ద్ద‌ని ఏదో ఒక ఫండ్లో పెడితే చాలు అనే భావ‌న‌తో ఉంటారు.

నిపుణుల స‌ల‌హా

మార్కెట్‌లు గ‌రిష్ట స్థాయిల్లో ఉన్న‌ప్పుడు ఈక్విటీల్లో లాభాల‌ను పొంది వాటిని క్ర‌మంగా స్థిర ఆదాయ ప‌థ‌కాల‌కు మ‌ళ్లించాల‌ని స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

షేర్ల కొనుగోలు స‌ల‌హాల‌కు ఇంట‌ర్నెట్ వ‌ద్దు!

మార్కెట్లు సానుకూలంగా పెరిగే స‌మ‌యంలో… మ‌దుప‌రులు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌ను విస్మ‌రించి స్థిర ఆదాయాన్నిచ్చే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఉన్న పెట్టుబ‌డులు అంతంత‌ లాభాన్నే ఇస్తుండడాన్ని గ‌మ‌నిస్తారు. అదే స‌మ‌యంలో ఈక్విటీలో పెడితే త‌మ పెట్టుబ‌డుల విలువ అంత‌కంతా పెరిగేద‌ని చింతిస్తుంటారు.

షేర్ల‌లో పెట్టుబ‌డి పెట్టేందుకు ఇంట‌ర్నెట్ పైన ఆధార‌ప‌డేవారు లేక‌పోలేదు. ఒక ప‌క్క బుల్ రంకెలు వేస్తుంటే ఎలాంటి షేర్లలో పెడితే గ‌రిష్ట లాభాల‌ను పొంద‌వ‌చ్చో అని వెబ్‌సైట్ల చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టేవాళ్లు మ‌న‌కు తార‌స‌ప‌డుతూనే ఉంటారు. గుడ్డిగా ఆ వెబ్‌సైట్లు సూచించే షేర్ల‌లో పెడితే… లాభాలు వ‌స్తే స‌రి… రాక‌పోతే… ఎవ‌రిని అడ‌గాలి. కాబ‌ట్టి మార్కెట్ల మంచీ, చెడూ రెండు స‌మ‌యాల్లోనూ మ‌నం అనుకున్న ల‌క్ష్యాల‌కు నిల‌బ‌డి పెట్టుబ‌డి కేటాయింపులు స్థిరంగా ఉంచుకోవాలి. మార్పులు చేసుకోవాలంటే ఆర్థిక సల‌హాదారుల‌ను సంప్ర‌దించాకే అన్న సంగ‌తిని దృష్టిలో పెట్టుకోవాలి.

మ్యూచువ‌ల్ ఫండేత‌ర త‌ప్పిదాలు

బీమాపై నిర్ల‌క్ష్యం

చాలా ర‌కాల బీమా పాల‌సీలు కొనాల‌నేం కాదు. కొన్ని అయినా పాల‌సీలు ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే ఇక్క‌డే బీమా కొనుగోలుపై నిర్ల‌క్ష్యం త‌ర్వాతి కాలంలో బాధ‌ప‌డేలా చేయ‌వ‌చ్చు.
మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను కొనేందుకు కొంద‌రు స‌ముఖ‌త చూపించేవారు కాదు. ఇప్పుడైతే వాటిపై జ‌నాల్లో స‌ద‌భిప్రాయం ఉంది. యూనిట్ ఆధారిత బీమా ప‌థ‌కాల్లో పాల‌సీ తీసుకునేవారిని వాటి నుంచి పెట్టుబ‌డుల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించాల‌నేం ఆర్థిక స‌ల‌హాదారులు చెప్ప‌రు. మ్యూచువ‌ల్ ఫండ్ లాంటి రాబ‌డినే అందించే యూలిప్స్ లో పెట్టుబ‌డి కొన‌సాగించ‌డం ఒకందుకు మంచి విష‌య‌మే. అస‌లు పొదుపు చేయ‌కుండా ఉండ‌టం కంటే ఇలా ఏదో ఒక రూపంలో పొదుపు చేయ‌డం మంచిద‌ని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.

క్రెడిట్ కార్డు భారం

కొంద‌రు క్రెడిట్ కార్డును మితిమీరి వాడుతుంటారు. ఒక్కోసారి నాలుగైదు నెల‌ల వేత‌నానికి స‌మంగా క్రెడిట్ కార్డు అప్పు చేస్తారు. ఇలా అప్పులు చేసిన‌ప్పుడు అవి తీర్చేందుకు షేర్ల‌ను అమ్మేకంటే… అంత‌గా అవ‌స‌రం లేదు అనుకున్న బీమా పాల‌సీల‌ను అమ్మి వాటితో వ‌చ్చే డ‌బ్బుతో అప్పు తీర్చ‌వ‌చ్చ‌ని ఓ ఆర్థిక స‌ల‌హాదారు సూచిస్తున్నారు.

వీలునామా రాయండి

వీలునామా రాయ‌డంలో మ‌నం వెనుక‌బ‌డి ఉన్నామ‌ని ఆర్థిక ప్ర‌ణాళిక‌దారుల అభిప్రాయం. సాధార‌ణంగా చాలా మంది వీలునామా రాయ‌కుండానే ఉండిపోతారు. వీలునామా విష‌యం ఎత్త‌గానే దానికెందుకంత తొంద‌ర అన్న‌ట్టుగా భావించేవాళ్లు ఎంద‌రో ఉన్నారు. కుటుంబ స‌భ్యుల‌ను నిజంగా ప్రేమించేవారు త‌మ త‌ర్వాత కూడా వారి క్షేమాన్ని కోరుకునేట్ట‌యితే త‌ప్ప‌కుండా వీలునామా రాయాల‌ని నిపుణులు చెబుతున్నారు. క‌చ్చిత‌మైన‌ వీలునామా అంటూ ఉండ‌డం వ‌ల్ల త‌ర్వాతి త‌రాల‌కు ఎలాంటి గొడ‌వ‌ల‌కు దారితీయ‌కుండా ఆస్తి పంప‌కాలు స‌జావుగా సాగుతాయని స‌ల‌హాదారులు చెబుతున్న మాట‌.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly