అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

పెట్టుబ‌డి పై కాస్త ఎక్కువ రాబ‌డిని అందిస్తాయి కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. వాటిలో ఉన్న‌వివిధ ఆప్ష‌న్లు, రాబ‌డి, న‌ష్ట‌భ‌యం, నిర్భంధ కాల‌ప‌రిమితి, మ‌దుపుచేసే ప‌ద్ధ‌తి త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

కార్పొరేట్‌ కంపెనీలు రుణ రూపేణా మూలధనాన్ని సమీకరించేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. కనీసం సంవత్సర కాలపరిమితి మొదలుకొని గరిష్ఠంగా 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కంపెనీలు జారీ చేస్తున్నాయి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల కంటే వీటిపై వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే ఇవి కొంత నష్టభయంతో కూడుకున్నవి. మంచి రేటింగ్‌ ఉన్న కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఎంచుకోవడం ద్వారా న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

అర్హత- అనర్హతలు:

 1. భారతీయ పౌరులు
 2. మైనర్ల పేరుతో కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు కచ్చితంగా ఉండాలి.
 3. హిందూ అవిభాజ్య కుటుంబాలు
 4. దేశీయ కంపెనీలు
 5. ఎన్‌ఆర్‌ఐలు (కొన్ని కంపెనీలు మాత్రమే అనుమతిస్తున్నాయి)

మైనర్ల విషయంలో తల్లిదండ్రులు లేకపోతే, చట్టబద్ధంగా సంరక్షకులుగా గుర్తింపు పొందినవారు దరఖాస్తుపై సంతకం చేయాల్సి ఉంటుంది.

కంపెనీల చట్టం ప్రకారం కొన్ని రకాల కంపెనీలు మాత్రమే కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు స్వీకరించేందుకు వీలుంది.
అవి:

 1. తయారీ రంగ సంస్థలు
 2. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు
 3. హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు
 4. ప్రభుత్వ కంపెనీలు
 5. ఇతర ఆర్థిక సంస్థలు

పెట్టుబ‌డి ప‌రిమితులు:

 • కనీస పెట్టుబడి: రూ.5,000
 • కొన్నికంపెనీలు గరిష్ఠ పరిమితులు విధిస్తున్నా, చాలా కంపెనీలు గరిష్ఠ పరిమితులు విధించ‌డంలేదు.

దరఖాస్తు విధానం:

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో సొమ్మును మూడు విధాలుగా జ‌మ‌చేయ‌వ‌చ్చు

  1. ఏ కంపెనీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయదలిచారో, ఆ కంపెనీ శాఖను నేరుగా సంప్రదించి విధివిధానాలను పాటించడం.
  1. కంపెనీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూరించి, ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో చెల్లింపులను చేయడం
  1. మధ్యవర్తిత్వ కంపెనీలైన ఐసీఐసీఐ డైరెక్ట్‌, బజాజ్‌ క్యాపిటల్‌, ఫండ్స్‌ ఇండియా లాంటి వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు ఫారం, ఫోటో, వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

సమర్పించాల్సిన పత్రాలు:

వ్యక్తిగత, చిరునామా గుర్తింపు కోసం పాస్‌ పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్సు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డుల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. ఆర్‌బీఐ సూచించిన మేరకు కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.

పన్ను వర్తింపు:

 • డిపాజిట్‌పై వచ్చే వడ్డీ రూ. 5000 దాటితే, అప్పుడు మొత్తం వడ్డీపై పన్ను మినహాయించగా మిగిలిన సొమ్మును కంపెనీలు చెల్లిస్తాయి.
 • ఒకే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై రూ. 5000 కన్నా ఎక్కువ వడ్డీ వచ్చే లాగా ఉంటే ఒకటి కంటే ఎక్కువ ఫిక్స్‌డ్  డిపాజిట్లను చేయడం ద్వారా పన్ను పడకుండా చూసుకోవచ్చు.

వడ్డీ :

 • ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వడ్డీని నెల, మూడు నెలలు, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తారు. దీన్నిచెక్కు లేదా ఆన్‌లైన్‌ పద్ధతిలో చెల్లిస్తారు.

నిర్భంధ‌ కాల‌ప‌రిమితి (లాక్‌-ఇన్‌ పీరియడ్‌):

 • ప్రస్తుత ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం మూడు నెలల వరకూ కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో జ‌మ‌చేసిన‌ డబ్బును తిరిగి తీసుకోవడానికి వీల్లేదు.

ముందస్తు ఉపసంహరణ:

 • 3 నెలల నుంచి ఆరునెలల లోపు విత్‌డ్రా చేసుకునే ఎఫ్‌డీలపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.
 • 6 నెలల తర్వాత, మెచ్యూరిటీ గడువు కంటే ముందు విత్‌డ్రా చేసుకునే వాటిపై మొదట నిర్ణయించిన వడ్డీ కన్నా రెండు శాతం వరకూ వడ్డీ తగ్గించి ఇచ్చే అవకాశం ఉంది.
 • ప్రీమెచ్యూర్‌ విత్‌డ్రాయల్స్‌పై ఆర్‌బీఐ సమయానుగుణంగా విధించే నిబంధనల ఆధారంగా నడుచుకోవాల్సి ఉంటుంది.

నామినేషన్‌:

 • ప్రతి డిపాజిట్‌దారుడు ఎఫ్‌డీ ఖాతాకు నామినీని నియమించుకునే సదుపాయం ఉంది.
 • డిపాజిట్‌దారుకు అనుకోకుండా ఏదైనా జరిగితే నామినీకి మొత్తం సొమ్మును చెల్లిస్తారు.

రుణ సదుపాయం:

 • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రుణ సదుపాయం ఉంటుంది. రుణంపై వడ్డీ రేటు డిపాజిట్‌ కంటే 2 నుంచి 3 శాతం ఎక్కువగా ఉంటుంది.
 • డిపాజిట్‌ మొత్తంలో 75 శాతం వరకూ రుణాన్ని పొందే వీలుంది.

కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వల్ల ప్రయోజనాలు:

 • బ్యాంకులు చెల్లించే వడ్డీ రేట్ల కన్నా 2 నుంచి 3 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది.
 • తక్కువ కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై ఎక్కువ వడ్డీ వస్తుంది.
 • పదవీ విరమణ చేసినవారికి క్రమంగా వడ్డీ వచ్చేందుకు క్యుములేటివ్‌ డిపాజిట్లు బాగా ఉపయోగపడతాయి.
 • బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే వీటి దరఖాస్తు ప్రక్రియ సులువుగా ఉంటుంది.

కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉండే ఇబ్బందులు:

 • బ్యాంకులతో  పోలిస్తే కంపెనీల్లో చేసే ఎఫ్‌డీలు నష్టభయంతో కూడుకుని ఉంటాయి.
 • బ్యాంకుల్లో చేసే డిపాజిట్లపై రూ. లక్ష వరకూ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది. కానీ కంపెనీల విషయంలో కచ్చితమైన హామీ ఉండదు

రేటింగ్‌:

 • పలు అంశాల ఆధారంగా క్రిసిల్‌, ఇక్రా, కేర్‌ లాంటి రేటింగ్‌ సంస్థలు కంపెనీలకు రేటింగ్‌ను ఇస్తాయి.
 • ఈ రేటింగ్‌ ఆధారంగా ఏ రకమైన కార్పొరేట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలో పెట్టుబడిదారుడు నిర్ణయించుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly