ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే డెట్ ఫండ్లు ఎందుకు మేలు?

ఎఫ్‌డీల‌తో పోలిస్తే డెట్ ఫండ్ల‌లో రిస్క్ నిర్వ‌హ‌ణ‌, లిక్విడిటీ, రాబ‌డి ఎక్కువ‌గా ఉంటుంది

ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే డెట్ ఫండ్లు ఎందుకు మేలు?

ఎస్‌బీఐలో ప‌దేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సంవ‌త్సరానికి 5.40 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. అయితే మీరు 20 శాతం ప‌న్ను శ్లాబులో ఉంటే ప‌న్ను తీసివేయ‌గా ఎఫ్‌డీ ఆదాయం 5 శాతం ఉంటుంది.ఇది ద్ర‌వ్యోల్బ‌ణం 4 శాతానికి ద‌గ్గ‌ర‌గా, సాధార‌ణంగా ఆర్థిక ప్ర‌ణాళిక‌కు లెక్కించే 6-7 శాతం రాబ‌డి కంటే త‌క్కువ‌గా ఉంటుంది.
ఎఫ్‌డీలకు ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి మార్గాలే డెట్ ఫండ్లు అని చెప్తున్నారు నిపుణులు. ఇవి రిస్క్‌ను త‌గ్గించి మంచి రాబ‌డిని ఇస్తాయ‌ని సూచిస్తున్నారు.

రాబ‌డులు
డెట్ ఫండ్లు, ఎఫ్‌డీల కంటే మంచి రాబ‌డిని ఇస్తాయ‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. వ‌డ్డీ రేట్లు త‌గ్గిన‌ప్ప‌టికీ పోర్ట్ఫోలియోలో ఉన్న బాండ్ల‌కు అనుగుణంగా రాబ‌డి ల‌భిస్తుంది. రేట్లు పెరిగినప్పుడు, ఫండ్ వ‌చ్చిన రాబ‌డితో పెట్టుబడి పెడుతుంది, మెచ్యూరిటీ బాండ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని అధిక రేట్లకు తిరిగి పెట్టుబడి పెడుతుంది. దీంతో ఇత‌ర సెక్యూరిటీల్లో లాభం త‌గ్గిన‌ప్ప‌టికీ డెట్ ఫండ్ల‌కు లాభం క‌లుగుతుంది. మూడేళ్ల కాల‌ప‌రిమితి క‌లిగిన స్వ‌ల్ప‌కాలిక డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేస్తే 8 శాతం రాబ‌డి పొందుతారు. అదే ఎస్‌బీఐలో మూడేళ్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 5.10 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇక్క‌డే రాబ‌డిలో వ్య‌త్యాసం స్ప‌ష్టంగా కనిపిస్తుంది.

స్కీముల ప‌రిధి
ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా పెట్టుబ‌డి ప‌థ‌కాలను ఎంచుకోవాలి. ఒక రోజు నుంచి ప‌దేళ్ల కాల‌ప‌రిమితి గ‌ల ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. రిస్క్, కాల‌ప‌రిమితిని బ‌ట్టి ఫండ్ల‌ను నిర్ణ‌యించుకోవాలి. అలాగే, వివిధ విభాగాలు చెందిన ఫండ్లు, వేర్వేరు మెచ్యూరిటీలు, క్రెడిట్ రిస్క్‌లు ఉంటాయి. “మ్యూచువల్ ఫండ్స్ మీరు ఏ రకమైన రిస్క్‌ను స్వీకరించాలనుకుంటున్నారో నిర్ణయించుకునే సౌలభ్యాన్ని ఇస్తాయి. విభిన్న అవసరాలను తీర్చడానికి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇక్క‌డ‌ బ్యాంకింగ్, పిఎస్‌యు ఫండ్ వంటివి మీకు ఎఫ్‌డి మాదిరిగానే ఉంటాయి. ఎంత రిస్క్ ఉంటుందో పెట్టుబ‌డుల స‌మ‌యంలోనే అంచ‌నా వేసుకోవాలి. అప్పుడే హెచ్చుత‌గ్గులు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌లుగుతారు.

వైవిధ్య‌మైన పెట్టుబ‌డులు
డెట్ ఫండ్ల పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉంటుంది. ఎంత ప‌రిశీల‌న చేసిన‌ప్ప‌టికీ కొన్ని సార్లు రాబ‌డుల్లో అంచ‌నాలు త‌ప్ప‌వ‌చ్చు. నియంత్ర‌ణ ప‌రిమితులు పెట్టుబ‌డులు ఎందులో ఎంత ఉండాలోనిర్దేశిస్తాయి. డెట్ ఫండ్లు సమస్యలను ముందుగానే గుర్తించగలవు, దానికి త‌గిన‌ట్లుగా నిష్క్రమించగలవు.

డెట్ ఫండ్ల మాదిరిగా కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ఎక్కువ మొత్తంలో పొదుపు చేస్తారు. ఒక‌వేళ ఏదైనా కార‌ణాల చేత బ్యాంకుల్లో ఆర్థిక‌ స‌మ‌స్య వ‌స్తే మీ డిపాజిట్ల‌కు భ‌ద్ర‌త ఉండ‌క‌పోవ‌చ్చు . ఉదాహ‌ర‌ణ‌కు ఇటీవ‌ల‌ పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లపై విధించిన ఆంక్షలు మరియు వడ్డీ చెల్లింపును నిలిపివేయడం వంటి ప‌రిణామాలు చూశాం. పెట్టుబడిదారులకు వారి పెట్టుబడులను అంచనా వేయడానికి ఉపయోగించగల చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంటుంది, వారికి నిష్క్రమణ లేదా పరిష్కారానికి చాలా తక్కువ ఎంపికలు ఉంటాయి.

మరోవైపు, ఓపెన్-ఎండ్ ఫండ్స్ పెట్టుబడిదారులకు పోర్ట్‌ఫోలియో మరియు పనితీరుపై సాధారణ సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉంది, ఎప్పుడైనా యూనిట్ల ప్రస్తుత విలువ వద్ద నిష్క్రమించవచ్చు.

లిక్విడిటీ
ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్ల‌లో ఎప్పుడైనా పెట్టుబ‌డులను ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశం ఉంది. ఎఫ్‌డీల నుంచి అవ‌స‌రం ఉన్న‌ప్పుడు మెచ్యూరిటీకి ముందే తీసుకుంటే రాబ‌డిలో 1 శాతం మేర రుసుముల‌ను చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్ల‌లో ఏడాదికి ముందే స్వ‌ల్ప‌, మ‌ధ్య‌కాలిక ఫండ్ల నంచి వెన‌క్కి తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. మీరు రెగ్యులర్ చెల్లింపును రూపొందించాలనుకుంటే నిధుల నుండి క్రమానుగతంగా ఉపసంహరించుకోవడానికి వీలుంటుంది.

ప‌న్నులు
డెట్ ఫండ్ల‌లో 36 నెల‌ల కంటే ఎక్కువ కాలం కొన‌సాగితే ఇండెక్సేష‌న్ ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. మీరు పెట్టుబడి పెట్టిన వ్యయం ద్రవ్యోల్బణానికి సంబంధించి సవరణ జ‌రుగుతుంది. ఇది పన్ను పరిధిలోకి వచ్చే మూలధన లాభాలను తగ్గించి, పన్నును తగ్గిస్తుంది. ఎఫ్‌డీల ద్వారా వ‌చ్చిన ఆదాయంపై వారి శ్లాబు ప్ర‌కారం ప‌న్ను ప‌డుతుంది.

చివ‌ర‌గా
పోర్ట్‌ఫోలియో పనితీరు గురించి డెట్ ఫండ్ల ద్వారా సవివరమైన సమాచారాన్ని తెలుసుకోవ‌చ్చు. దీనిని అనుస‌రిస్తూ ఫండ్ల‌ను కొన‌సాగిస్తే మంచి రాబ‌డిని పొంద‌డంతో పాటు ప‌న్నును త‌గ్గించుకోవ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly