క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్ ఏంటి? ఎందుకు?

త‌గిన కాల‌ప‌రిమితిని ఎంచుకొని ఈఎమ్ఐల రూపంలో తిరిగి చెల్లించ‌వ‌చ్చు. వ‌డ్డీ రేట్లు కూడా త‌క్కువ‌గా ఉంటాయి.

క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్ ఏంటి? ఎందుకు?

గృహోప‌క‌ర‌ణాల‌కు ఉన్న డిమాండ్ ఎప్ప‌టికీ త‌గ్గ‌దు. వాషింగ్ మిష‌న్, ఎల్ఈడీ టీవీ, ఏసీ వంటివి ఇప్పుడు త‌ప్ప‌నిసరైనవిగా మారాయి. అయితే అవి ఒకేసారి కొనుగోలు చేసేందుకు అంద‌రి వ‌ద్ద స‌రిప‌డా డ‌బ్బు ఉండ‌క‌పోవ‌చ్చు. ఇందుకోస‌మే వినియోగ వ‌స్తువుల‌పై రుణాల‌ను మ‌న్నిక‌గ‌ల వ‌స్తువుల‌పై రుణం ( క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్) ప‌రిచ‌యం చేశాయి ఆర్థిక‌ సంస్థ‌లు. ఈ రుణాల‌తో ఈఎమ్ఐల‌ను చెల్లించుకుంటూ మీకు కావాల్సిన వ‌స్తువును వెంట‌నే కొనుగోలు చేయ‌వ‌చ్చు. మీ ఇంటిని గృహోప‌క‌ర‌ణాల‌తో అలంక‌రించాల‌నుకుంటే లేదా కొత్త గ్యాడ్జెట్లు కొనాల‌నుకంటే ఈ రుణాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌న్నిక‌గ‌ల వ‌స్తువుల‌పై రుణం ( క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్) ఏంటి?
వాషింగ్ మిష‌న్, రిఫ్రిజిరేట‌ర్‌, ఎయిర్-కండీష‌న‌ర్, ఎల్ఈడీ టీవీ, మైక్రోవేవ్స్, ఫ‌ర్నీచ‌ర్, దుస్తులు, గ్రాస‌రీ కొనుగోలు చేసేందుకు ఈ రుణాన్ని తీసుకోవ‌చ్చు. బ్యాంకులు, బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ వంటి ఆర్థిక సంస్థ‌ల నుంచి ఈ రుణాల‌ను పొంద‌వ‌చ్చు. మీకు త‌గిన కాల‌ప‌రిమితిని ఎంచుకొని సౌక‌ర్య‌వంతంగా చెల్లింపులు చేసుకోవ‌చ్చు. వీటిపై సున్నా లేదా త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఉంటాయి.

వ‌డ్డీ రేట్లు, ఇత‌ర ఛార్జీలు
ఈ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు వ్య‌క్తిగ‌త రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కంటే త‌క్కువ‌గా ఉంటాయి. బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ ఎంపిక చేసిన వ‌స్తువుల‌పై వ‌డ్డీ లేని ఈఎమ్ఐల‌ను కూడా అందిస్తుంది. వ‌డ్డీ రేట్లు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉండొచ్చు. వీటిని పోల్చి చూసుకొని త‌క్కువ‌గా ఉన్న సంస్థ‌ల రుణాల‌ను ఎంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కూడా తీసుకుంటాయి.

కాల‌ప‌రిమితి
ఈ రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు కాల‌ప‌రిమితిన సాధార‌ణంగా 3 నుంచి 24 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. అయితే వ‌స్తువుల‌ను బ‌ట్టి ఒక్కో రుణ‌దాత ఒక్కో విధంగా కాల‌ప‌రిమితిని నిర్ణ‌యించే అవ‌కాశం ఉంది. వ‌డ్డీని త‌గ్గించుకోవాలంటే త‌క్కువ కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌డం మేలు. అయితే వ‌డ్డీ లేని ఈఎమ్ఐ అయితే ఎక్కువ కాల‌ప‌రిమితి ఉన్నా ఫ‌ర్వాలేదు.

ఎంత రుణం ల‌భిస్తుంది?
వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు డౌన్‌పేమెంట్, వినియోగ‌దారులు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. సాధార‌ణంగా ఆర్థిక సంస్థలు కొనుగోలు చేసే వ‌స్తువు విలువ‌లో 80-90 శాతం రుణాల‌ను అందిస్తాయి. అంటే డౌన్‌పేమెంట్ 10-20 శాతం చేయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థ‌లు 100 శాతం కూడా ఇస్తున్నాయి.

ఇంటిలో వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు ఆలోచిస్తున్న‌వారికి చేతిలో డ‌బ్బు లేక‌పోతే ఇది మంచి ఆప్ష‌న్‌గా మారుతుంది. వ‌చ్చే ఆదాయంలో అంద‌రూ వ‌స్తువును పూర్తి ధ‌ర‌తో ఒకేసారి కొనుగోలు చేసే అవ‌కాశం లేకపోవ‌చ్చు. అటువంటి వారికి ఈ రుణాలు తోడ్ప‌డ‌తాయి. రుణం ఆమోదించేందుకు ఎక్కువ కాలం కూడా ప‌ట్ట‌దు. కొన్ని డాక్యుమెంట్ల‌ను అందిస్తే చాలు.

ఈ రుణం తీసుకోవ‌చ్చా?
రుణం అనేది ఎప్ప‌టికైనా భార‌మే అని చెప్తారు ఆర్థిక నిపుణులు. వ‌స్తువుల‌ను కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు దాని ధ‌రకు త‌గిన‌ట్లుగా నెల‌కు కొంత పొదుపు చేసుకొని తీసుకోవ‌డం మేలు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly