కుబేరులకు సైతం దడ పుట్టిస్తున్న కారు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును గత సంవత్సరం దుబాయ్ అంతర్జాతీయ మోటార్ ప్రదర్శనలో ప్రవేశపెట్టారు

కుబేరులకు సైతం దడ పుట్టిస్తున్న కారు..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు అంటే మనకి టక్కున గుర్తొచ్చే పేర్లు రోల్స్ రాయిస్, బుగాటి, లాంబోగిని, ఫెరారీ, పగాని, ఆస్టన్ మార్టిన్. వీటిని కొనడం కాదుకదా కనీసం చూస్తేనే చాలా గొప్పగా అనుభూతిని పొందుతాం. ఇలాంటి కార్లను కేవలం అత్యంత ధనికులు మాత్రమే సొంతం చేసుకోగలరు. అలాంటిది వీరు సైతం ఒక కారును కొనాలంటే కొద్దీ సేపు ఆలోచించక మానరు. దాని పేరే కార్ల్మాన్ కింగ్.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు. దీని విలువ సుమారు రూ.15 కోట్లు (పన్నులు కాకుండా). ఈ కారును గత సంవత్సరం దుబాయ్ అంతర్జాతీయ మోటార్ ప్రదర్శనలో ప్రవేశపెట్టారు. దీనిలో లేని సదుపాయం అంటూ లేదంటే అది అతిశయోక్తికాదు. దీనిని చైనీస్ ఆటోమోటివ్ సంస్థ, ఐఏటీ ఆటోమొబైల్ టెక్నాలజీ రూపొందించింది. ఈ కారును యూరప్ లో సుమారు 1800 మంది సభ్యుల బృందం అహర్నిశలు శ్రమించి తయారు చేశారు. చూడగానే ఆకట్టుకునే రూపంతో అచ్చం సైనిక వాహనంలా దీన్నీ డిజైన్ చేశారు.

ఈ కారులో అత్యంత భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు. రాకెట్ లాంచర్, ల్యాండ్ మైన్స్, తుపాకీ తూటాలను తట్టుకునే విధంగా సంస్థ దీన్నీ రూపొందించింది. మాములు బులెట్ ప్రూఫ్ కారు అద్దాలకంటే ఈ కారుకు అమర్చిన అద్దాలు మూడు రెట్లు బలంగా ఉంటాయి. ఎలాంటి రసాయన దాడులనైనా ఎదుర్కొనే సత్తా ఈ కారు సొంతం.

కారుకు అదనంగా భద్రతా కవచం ఏర్పాటు చేసినట్లయితే దీని విలువ సుమారు రూ. 23 కోట్లు వరకు ఉంటుంది. ఈ కారును ఎవరుపడితే వాళ్ళు ఉపయోగించకుండా ఉండాలనే ఉద్దేశంతో సంస్థ కేవలం 12 కార్లను మాత్రమే తయారు చేస్తుంది. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ కారును సంస్థ అందించనుంది.

INNER.jpg

కారు లోపల ఉండే ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిస్తే… సాటిలైట్ టీవీ, సాటిలైట్ ఫోన్, అద్భుతమైన సౌండ్ సిస్టం, అల్ట్రా హెచ్డీ 4కే టీవీ, ప్రైవేట్ సేఫ్ బాక్స్, ఫోన్ ప్రొజెక్షన్ సిస్టం, ఎలక్ట్రిక్ టేబుల్, నియాన్ లైట్ కంట్రోల్ వంటి అనేక సదుపాయాలు ఉన్నాయి. కారు సుమారు 4500 కిలోల బరువుతో గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

బులెట్ ప్రూఫింగ్ చేసిన అనంతరం కారు బరువు సుమారు 6000 కిలోల వరకు ఉంటుంది. ఆరు మీటర్ల పొడవుతో చూడ్డానికి గంభీరంగా కనిపిస్తుంది. దీనికి ఫోర్డ్ సంస్థ తయారుచేసిన ఎనిమిది లీటర్ల ఇంజిన్ ను అమర్చారు. ఇదే ప్రపంచంలో అతిపెద్ద ఇంజిన్. ఇన్ని అద్భుతమైన సదుపాయాలు ఉన్న కారును సొంతం చేసుకునే అదృష్టవంతులు ఎవరో?

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly