త‌క్కువ వేత‌న‌మా? అయినా సంపన్నులవ్వగలరు!!

త‌క్కువ వేత‌నం పొందేవారు కూడా ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సంప‌దను సృష్టించుకోవ‌చ్చు

త‌క్కువ వేత‌న‌మా? అయినా సంపన్నులవ్వగలరు!!

అధిక మొత్తంలో వేత‌నాలు పొందేవారే భారీ సంప‌ద‌ను సృష్టించుకోగ‌ల‌ర‌నే అపోహ చాలా మంది ఉద్యోగుల్లో ఉంటుంది. త‌క్కువ మొత్తంలో జీతాలు అందుకునేవారు సైతం స‌రైన ప్ర‌ణాళిక‌తో సంప‌ద‌ను సృష్టించుకోవ‌చ్చు. ఆర్థిక అభివృద్ధికి అంద‌రూ పాటించ‌గ‌లిగే కొన్ని మెళ‌కువ‌ల‌ను మీ కోస‌మే అందిస్తున్నాం. ప్ర‌తి ఒక్క‌రి జీవ‌న విధానం, ల‌క్ష్యాలు, కుటుంబ ప‌రిస్థితులు వేరేగా ఉన్నా సాధార‌ణంగా ఈ సూత్రాలు అంద‌రికీ వ‌ర్తిస్తాయి.

సంప‌ద వృథా కానివ్వ‌ద్దు

సంప‌దను సృష్టించాల‌నుకునే వారు పెట్టుబడులు దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగేలా చూసుకోవాలి. సంపాదన వృథా పోకుండా కాపాడుకోవాలి. సంప‌ద సృష్టి క్రమంలో భాగంగా న‌ష్ట‌భ‌యం, అస్థిర‌త్వం అనే రెండు అంశాల్లోని చిన్న తేడాను మ‌దుప‌ర్లు గ‌మ‌నించాలి. న‌ష్ట‌భ‌యం వ‌ల్ల పెట్టుబ‌డులను పూర్తిగా కోల్పోయే ప్ర‌మాదం ఉంది. అదే పెట్టుబ‌డుల్లో అస్థిర‌త్వం చోటు చేసుకుంటే ఒక్కో సారి న‌ష్టం వ‌చ్చినా మ‌రో సారి లాభం వ‌స్తుంది.

సంపద సృష్టికి ముందుగా అత్యవసర పరిస్థితులకు కొంత సొమ్ము విడిగా కేటాయించాలి . ఉపాధి కోల్పోవ‌డం, తీవ్ర అనారోగ్యం, ఉన్న పెట్టుబ‌డినంతా ఒకేదాంట్లో పెట్ట‌డం లాంటివ‌న్నీ న‌ష్ట‌భ‌యాలు. వీటి వ‌ల్ల భ‌విష్య‌త్ లో ఆర్థికంగా బాగా ఇబ్బందులు ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇలాంటి న‌ష్ట‌భ‌యాల‌ను ముందే ఊహించి అందుకు సంసిద్ధంగా ఉండ‌డం ఎంతో అవ‌స‌రం. ముందు సంప‌ద‌కు ర‌క్ష‌ణ‌, త‌ర్వాత పొదుపు, ఆ త‌ర్వాతే మంచి రాబ‌డి కోసం పెట్టుబ‌డులు. ఈ విధంగా కొనసాగించాలి.

చాలా మంది సంప‌ద‌కు ర‌క్ష‌ణ క‌ల్పించుకోకుండా పెట్టుబ‌డుల‌పైనే దృష్టంతా పెడుతుంటారు. త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే న‌ష్ట‌భ‌యాలు ఎక్కువై సంప‌ద మొత్తం హ‌రించుకుపోయే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది.

వారెన్ బ‌ఫెట్ పాఠాలు

స్టాక్ మార్కెట్ వార్త‌ల్లో నిలిచే ప్ర‌ఖ్యాత వ్య‌క్తి వారెన్ బ‌ఫెట్ వ‌య‌సు 84ఏళ్లు. ఆయ‌న నిక‌ర ఆస్తి విలువ 74 బిలియ‌న్ డాల‌ర్లు. 56 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు బ‌ఫెట్ తొలి బిలియ‌న్ డాల‌ర్ల‌ను సంపాదించ‌గ‌లిగారు. 56 ఏళ్లు అంటే ఓ సాధార‌ణ వ్య‌క్తి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుకు చేరే ద‌శ‌. ఆ వ‌యసులోనూ ఆయ‌న అంత అకుంఠిత దీక్ష‌తో శ్ర‌మించ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే.

పెట్టుబ‌డి పెట్టడాన్ని అలవాటుగా చేసుకోవాలి. దృఢ‌చిత్తం, క‌ష్ట‌ప‌డే త‌త్వం, క్ర‌మ‌శిక్ష‌ణ‌తోనే సంప‌ద సృష్టి సాధ్య‌మ‌వుతుంది. నిదానంగా, క్ర‌మ‌మైన విధానాన్ని పాటిస్తేనే సంప‌ద సృష్టి చేసుకోగ‌ల‌మ‌ని ప్రావిడెంట్ ఫండ్ల‌లాంటివి నిరూపిస్తునే ఉన్నాయి. పెరిగే సంప‌ద‌కు చ‌క్ర‌వ‌డ్డీ ప్ర‌భావం ఉంటుంది. ఏదో అవ‌స‌రానికి సంప‌ద నుంచి మ‌ధ్య‌మ‌ధ్య‌లో తోడేయ‌డం వ‌ల్ల ఉన్న‌దంతా హ‌రించుకుపోగల ప్రమాదం ఉంది.

డ‌బ్బు కన్నా మీరే గొప్ప‌

డ‌బ్బు కేవ‌లం బ్యాంకు ఖాతాలో ఓ సంఖ్య‌. ఈ డబ్బుతో జీవితంలో మ‌న‌మేం చేయ‌గ‌ల‌మ‌న్న‌దే ముఖ్యం. విభిన్న అవ‌కాశాల‌పై భిన్న వ్య‌క్తుల కోణం వేరుగా ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రి జీవిత గ‌మ్యాలు, గ‌మ‌నాలు, కుటుంబ ప‌రిస్థితుల్లో చాలా తేడాలుంటాయి. ల‌క్ష్యాలు, జీవ‌న ప్ర‌మాణాల‌పై దృష్టి పెట్టాలే త‌ప్ప స‌మాజ గుర్తింపు కోసం త‌హ‌త‌హ‌లాడ‌వ‌ద్దు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌న విద్యా వ్య‌వ‌స్థ‌, ప‌నిచేసే చోట‌ ఇత‌రులు ఎలా వెళ్తే అదే దారిలో వెళ్ల‌డం అల‌వ‌డింది. ఎవ‌రో కారు, బంగారు ఆభ‌ర‌ణాలు కొంటున్నార‌ని అవ‌స‌ర‌మున్నా, లేక‌పోయినా ఇత‌రులూ కొనేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. వారు మొద‌ట వేసుకున్న ఆర్థిక ప్ర‌ణాళిక‌లను ప‌క్క‌కు తోసేసి ఇలా ఆభ‌ర‌ణాల‌కో, కారు కొనుగోలుకో డ‌బ్బును వృథా చేస్తుంటారు.

చిన్న‌వాటిపై దృష్టి పెట్టండి

ఆర్థిక వ్య‌వ‌స్థ అత్యంత ఒడిదుడుకులలో ఉన్న‌ప్పుడు కూడా కొన్ని పెద్ద కంపెనీలు మంచి రాబ‌డిని అందించాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకోవ‌డం స‌హ‌జం. వ‌డ్డీ రేట్ల‌లో మార్పు, కేంద్ర బ్యాంకు స‌మీక్ష‌లు, జీడీపీ సంఖ్య‌ల నివేదిక‌లు, రంగాల‌వారీగా వృద్ధి… ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా ఇవ‌న్నీ తెలుసుకొని సంప‌ద వృద్ధిపై ఎక్కువ‌గా ఆలోచిస్తుంటారు కొంద‌రు. ఇలాంటి అర‌కొర స‌మాచారంతో చేతులు కాల్చుకునే ప‌రిస్థితి ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది. రూ.వెయ్యి కోట్లను నిర్వ‌హించే ఫండ్ నిర్వాహ‌కుడికి ఇలాంటి పెద్ద పెద్ద వార్త‌ల‌తో ప‌ని ఉంటుందే త‌ప్ప సామాన్య మ‌దుప‌రి వాట‌న్నింటినీ సొంత పెట్టుబ‌డుల‌కు అన్వ‌యించుకోవ‌ద్దు.
దాచుకున్న‌దంతా స్థిరాస్తి లాంటి పెద్ద పెద్ద పెట్టుబ‌డుల్లో పెడితేనే సంప‌ద సృష్టికి పునాది అనుకోవ‌డం అపోహ‌. అంత‌క‌న్నా ముందు నెల‌నెలా చిన్న మొత్తాల్లో పొదుపును ఆరంభించ‌డం మంచిది.

జీవితాన్ని స్వేచ్ఛ‌గా ఆనందించండి

మితంగా బ‌తికితేనే ఎక్కువ‌ సంప‌ద పోగు చేసుకోగ‌లం అనేది పాత‌కాలం భావ‌న‌. ఇదే భావ‌న‌తో చాలా మంది ఎక్కువ ప‌నిగంట‌ల్లో త‌ల‌మున‌క‌లై, వారి ఆరోగ్యాన్ని, బంధాల‌ను ప‌ణంగా పెడుతున్నారు. విలువైన స‌మ‌యాన్ని స్వేచ్ఛ‌గా, సంతోషంగా బతికేందుకు ఉపయోగించాలి. సంప‌ద దానంతటదే పెరుగుతుంది.
ధ‌నికుడికి ఒక నిర్వ‌చ‌నం అవ‌స‌రాల‌కు మించి ఉన్న‌వాడు అని వ‌స్తుంది. అవ‌స‌రానికి మించి సంపాదించేందుకు మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను వ‌దులుకోవాల్సిన అవ‌స‌రం లేదు. ఒక 7 నుంచి 8 ఏళ్ల స‌మ‌యంలో ఎవ‌రైనా మితంగా ఖ‌ర్చు పెడుతూ, మంచి జీవ‌న ప్ర‌మాణాలు పాటిస్తూ సంప‌ద సృష్టించుకోగ‌లిగితే చాలు. అలాంటివారు ఇదే విధానాన్ని పాటిస్తూ మిగిలిన జీవితాన్ని భ‌రోసాతో బ‌తికేయ‌వ‌చ్చు.

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly