క్రెడిట్ కార్డు వాడ‌కంలో జాగ్ర‌త్త‌లు

క్రెడిట్ కార్డుల విష‌యంలో ఆచితూచి అడుగులు వేయాలి. వాటి వాడ‌కంలో ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసుకుందాం

క్రెడిట్ కార్డు వాడ‌కంలో జాగ్ర‌త్త‌లు

కొన్నిసంద‌ర్భాల్లో చేతిలో, లేదా అకౌంట్‌లో డ‌బ్బులేకున్నా క్రెడిట్ కార్డు ఉంటే చాలు. లావాదేవీల‌ను ఇట్టే పూర్తిచేయ‌వ‌చ్చు. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వ‌స్తువుల‌ను వాయిదా ప‌ద్ధ‌తిలోనూ చెల్లించ‌వ‌చ్చు. క్రెడిట్ కార్డు ద్వారా జ‌రిపే కొనుగోళ్ల‌పై కొన్ని షాపింగ్ సంస్థ‌లు క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు, రాయితీలు, బోన‌స్ పాయింట్లు ప్ర‌క‌టిస్తుంటాయి. బ్యాంకులైతే త‌మ క్రెడిట్ కార్డు వినియోగ‌దార్ల‌కు ప్ర‌త్యేక ఆఫ‌ర్ల‌తో సంతోష‌ప‌రుస్తుంటాయి. క్రెడిట్ కార్డు వినియోగం ఓ క‌ళ‌. అందులో విఫ‌ల‌మైతే న‌ష్టాలు చ‌విచూడాల్సి ఉంటుంది. ప్ర‌ణాళిక ప్ర‌కారం వాడే వారికి క్రెడిట్ కార్డు లాభ‌దాయ‌కంగా ఉంటుంది. మ‌న క‌ష్టం, సుఖం మ‌న చేతిలోనే ఉంద‌నేదానికి క్రెడిట్ కార్డు నిదర్శ‌నం.

గ‌డువు దాట‌నివ్వ‌కండి

 • క్రెడిట్ కార్డు బాకీ తిరిగి చెల్లించేందుకు కొంత గ‌డువు ఉంటుంది. గ‌డువులోపు చెల్లింపులు జ‌ర‌ప‌క‌పోతే వ‌డ్డీ, ఆల‌స్య రుసుములు భారీగా ప‌డ‌తాయి. ఈ గ‌డువు, రుసుముల‌ వివ‌రాలను, ఇత‌ర నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను క్షుణ్ణంగా తెలుసుకొని ఉండ‌టం వ‌ల్ల జాగ్ర‌త్త‌ప‌డ‌వ‌చ్చు.

అన‌వ‌స‌ర కొనుగోళ్లు వ‌ద్దు

 • క్రెడిట్ కార్డు ఉంది క‌దా అని అన‌వ‌స‌రంగా ఏది ప‌డితే అది కొనేస్తుంటారు చాలా మంది. మ‌నకేది అవ‌స‌ర‌మో వాటిని మాత్ర‌మే కొనుగోలు చేయ‌డం అల‌వ‌ర్చుకోవాలి. అది అన్ని ర‌కాలుగా మంచిది. కార్డు ఉంద‌ని ఇష్టానుసారంగా వాడితే బ‌కాయి తీర్చ‌లేక‌ త‌ల‌కుమించిన భార‌మ‌వుతుంది.

స‌కాలంలో చెల్లించ‌కుంటే స్కోరు పై ప్ర‌భావం

 • స‌కాలంలో క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు చేయ‌నివారి క్రెడిట్ స్కోరు త‌గ్గిపోతుంది.
 • క్రెడిట్ స్కోరు ఆధారంగానే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. స‌రిప‌డ క్రెడిట్ స్కోరు లేని వారికి భ‌విష్య‌త్తులో రుణల‌భ్య‌త క‌ష్ట‌మ‌వుతుంది .

క‌నీస చెల్లింపు మొత్తంతో జ‌ర జాగ్ర‌త్త

 • మొత్తం రుణంలో చాలా త‌క్కువ దాదాపు 5శాతం క‌నీస చెల్లింపు మొత్తంగా ఉంటుంది.
 • గ‌డువు లోగా క‌నీస చెల్లింపు మొత్తం (మినిమ‌మ్ డ్యూ) ను చెల్లించే వినియోగ‌దారుల‌కు ఆలస్య రుసుము ఉండ‌దు. అయితే ఇది చెల్లించినా, మిగిలిన రుణానికి వ‌డ్డీ ప‌డుతుంది. కొంత మంది తెలియ‌క క‌నీస మొత్తం చెల్లిస్తే వ‌డ్డీ ఉండ‌ద‌నుకుంటారు.

వ‌డ్డీ రేటు,రుసుములు

 • క్రెడిట్ కార్డు సంస్థ‌లు వినియోగ‌దార్ల నుంచి వివిధ‌ర‌కాల ఫీజులు వ‌సూలు చేస్తుంటాయి. వినియోగ‌దార్ల‌కు వీటిపై అవ‌గాహ‌న ఉండాలి.
 • కొనుగోళ్ల‌ తాలుకా ర‌సీదుల‌ను క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ తో స‌రిచూసుకోవాలి.
 • క్రెడిట్ కార్డుల‌పై తీసుకున్న మొత్తానికి గ‌డువు దాటాకా నెల‌వారీ వ‌డ్డీరేటు 1.5 శాతం నుంచి 2.99 శాతం వ‌ర‌కు ఉంటుంది. దీంతో పాటు అద‌నంగా ఆల‌స్య రుసుం విధిస్తారు. బ్యాంకుల‌ను బ‌ట్టి వ‌డ్డీ, రుసుముల‌లో మార్పులుంటాయి. క్రెడిట్ కార్డు తీసుకునే ముందే వీటిపై అవ‌గాహ‌న పెంచుకోవాలి.
 • అనివార్య కార‌ణాల వ‌ల్ల బిల్లును గ‌డువులోగా చెల్లించ‌క‌పోతే త‌క్కువ వ‌డ్డీ ప‌డే క్రెడిట్ కార్డుల‌ను ఎంచుకోవాలి.

రుణ వ‌ల‌యంలో చిక్కుకోకండి

 • అన‌వ‌స‌రంగా క్రెడిట్ కార్డుని వినియోగించ‌డం , అధికంగా కొనుగోళ్లు చేయ‌డం మూలంగా రుణభారం పెరుగుతుంది. బ్యాంకు ఇచ్చిన గ‌డువులోగా తిరిగి చెల్లించ‌ని ప‌క్షంలో వ‌డ్డీ అధికశాతం చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణానికి వ‌డ్డీ తోడై రుణ భారం పెరుగుతుంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly