సైబర్ మోసంలో డబ్బును కోల్పోతే ఎవరు బాధ్యులు?

వినియోగ‌దారుడు సైబర్ దాడి లేదా హ్యాకింగ్ వ‌ల్ల‌ డబ్బు కోల్పోతే, ఆ నష్టానికి బ్యాంక్ బాధ్యత ఉందా?

సైబర్ మోసంలో డబ్బును కోల్పోతే ఎవరు బాధ్యులు?

డిజిట‌ల్ లావాదేవీలు పెర‌గ‌డంతో పాటుగా అందులో జ‌రిగే సైబ‌ర్ క్రైమ్ లు కూడా పెరుగుతున్నాయి. రిజ‌ర్వు బ్యాంకు విడుద‌ల చేసిన‌ నివేదిక ప్ర‌కారం 2017-18 లో బ్యాంకు లావాదేవీల్లో జ‌రిగిన సైబ‌ర్ మోసాలు 2059 కేసులు న‌మోద‌య్యాయి. వీటి విలువ రూ.109.6 కోట్లు. 2016-17 సంవ‌త్స‌రానికి 1372 కేసులు, రూ.42.3 కోట్ల గా న‌మోదైంది. సైబర్ మోసాల స‌మ‌స్య‌ల‌ను పరిష్కరించేందుకు, వినియోగదారులకు సైబ‌ర్ స‌మ‌స్య‌ల‌ పరిష్కారానికి ఒక‌ వ్య‌వ‌స్థ‌ను స్థాపించడానికి కంప్ల‌యిన్స్, ట్రాకింగ్ సిస్టమ్ పోర్ట ఏర్పాటు చేయాలని రిజర్వుబ్యాంకు యోచిస్తోంది. డిజిటల్ లావాదేవీల సంఖ్య పెర‌గ‌డంతో, ఈ విధ‌మైన వినియోగ‌దారుల-రక్షణ చర్యలు డిజిటల్ విధానంలో లావాదేవీలు చేసే వారిని ప్రోత్సహిస్తాయి. రాబోయే ఈ పోర్ట‌ల్ ద్వారా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కాకుండా ప్రీ పెయిడ్ చెల్లింపు సాధ‌నాలు (పీపీఐలు), మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్ఫేసులకు సంబంధించి ఇంట‌ర్న‌ల్ అంబుడ్స్‌మాన్ స్కీమ్ 2018 ద్వారా వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు ని రిజ‌ర్వు బ్యాంక్ వెల్ల‌డించింది

వినియోగ‌దారుడు సైబర్ దాడి లేదా హ్యాకింగ్ వ‌ల్ల‌ డబ్బు కోల్పోతే, ఆ నష్టానికి బ్యాంక్ బాధ్యత ఉందా? ఇలాంటి కేసులకు ఆర్బిఐ వివరణాత్మక మార్గదర్శకాలను అందించింది. ఇటువంటి సందర్భాల్లో బాధ్యత పరిధిని పరిష్కరించడానికి గత సంవత్సరం నిబంధనలను విడుద‌ల‌ చేసింది, డిజిటల్ లావాదేవీల‌ను పెంపొందిస్తూ వినియోగదారుల‌లో విశ్వాసం క‌ల్పించేందుకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. ఆగస్టులో విడుదల చేసిన వార్షిక నివేదికలో 2017-18 లో ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో వినియోగదారుల బాధ్యతను పరిమితం చేస్తూ నిబంధ‌న‌ల‌ను విడుద‌ల చేసింది. .

న‌ష్టం భ‌రించ‌న‌వ‌స‌రం లేదు:

బ్యాంకు వైపు నుంచి పొర‌పాటు జ‌రిగితే వినియోగాదారుడు ఎటువంటి న‌ష్టం భ‌రించ‌న‌వ‌స‌రంలేదు. బ్యాంకు, వినియోగ‌దారుడు ఇద్ద‌రి వైపు నుంచి పొర‌పాటు లేకుండా వ్యవస్థలో మరెక్కడైనా పొర‌పాటు జ‌రిగితే, ఆ సందర్భాల్లో వినియోగదారుడు నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. అనధికార లావాదేవీ జ‌రిగిన మూడు పని రోజులలో వినియోగ‌దారుడు బ్యాంకుకు సమాచారం అందించాలి.

పరిమిత బాధ్యత:

వినియోగ‌దారుని నిర్లక్ష్యం కారణంగా నష్టం వ‌స్తే, అనధికారిక లావాదేవీ బ్యాంకుకు నివేదించే వరకు వినియోగ‌దారుడు మొత్తం నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. బ్యాంకు, వినియోగ‌దారుడు ఇద్ద‌రి వైపు నుంచి పొర‌పాటు లేకుండా వ్యవస్థలో మరెక్కడైనా పొర‌పాటు జ‌రిగి వినియోగదారుడు లావాదేవీ గురించి స‌మాచారాన్ని4-7 రోజులు ఆలస్యంతో బ్యాంకుకు నివేదిస్తే, ఖాతా రకాన్ని బట్టి వినియోగ‌దారుడు భ‌రించాల్సిన న‌ష్టం రూ .5,000 నుండి 25,000 వరకు ఉంటుంది.

బోర్డ్ ఆమోదం పొందిన పాలసీ ప్రకారం బాధ్యత:

అనధికార లావాదేవీ జ‌రిగి ఆ స‌మ‌చారాన్ని నివేదించడం 7 పని దినాలు దాటిన‌ట్లయితే, బ్యాంకు బోర్డు ఆమోదం పొందిన విధానం ప్రకారం వినియోగ‌దారుని బాధ్యత నిర్ణయిస్తారు. వినియోగ‌దారుడు స‌మాచారం ఇచ్చిన తేదీ నుంచి 10 పని రోజుల లోపు వారి ఖాతాకు అనధికార ఎలక్ట్రానిక్ లావాదేవీలో న‌ష్ట‌పోయిన‌ మొత్తాన్ని జ‌మ చేయాలి. వినియోగ‌దారుల స‌మ‌స్య‌లు, ఫిర్యాదుల‌కు సంబంధించి వివ‌ర‌ణం 90 రోజుల వ్యవధిలో ఇవ్వాలి. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు సంబంధించి ఎస్ఎమ్ఎస్ అలెర్ట్‌లు వినియోగ‌దారుల‌కు అందెలా వారి మొబైల్ నంబర్లను రిజిస్ట్రేషన్ చేయ‌టాన్ని బ్యాంకులు తప్పనిసరిగా పాటించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly