మూడేళ్ల‌లో ఏం మారింది?

నోట్ల ర‌ద్దు జ‌రిగి మూడేళ్ల‌యింది. ఈ మూడేళ్ల‌లో చెల్లింపులు డిజిట‌ల్ రూపం దాల్చుకున్నాయి.

మూడేళ్ల‌లో ఏం మారింది?

నేష‌న‌ల్ డెమొక్ర‌టిక్ పార్టీ (ఎన్‌డీఏ) నేప‌థ్యంలో మూడేళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు అంటే న‌వంబ‌ర్ 8, 2016 లో పెద్ద నోట్ల ర‌ద్దు జ‌రిగింది. దీంతో దేశంలో చెల్లింపుల విధాన‌మే మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కు అన్నింటికి న‌గ‌దు రూపంలో చెల్లించిన‌వారు… డెబిట్ కార్డులు, డిజిట‌ల్ వాటెట్లు, యాప్‌లతో చెల్లించ‌డం ప్రారంభించారు. ఇది ఇప్పుడు ఒక అల‌వాటుగా మారిపోయింది.

న‌ల్ల ధ‌న నిర్మూల‌న‌, టెర్ర‌రిస్టుల‌కు నిధుల‌ను ఆపేయ‌డం, న‌కిలీ క‌రెన్సీని నిలిపివేయ‌డం వంటి ముఖ్య ల‌క్ష్యాల‌తో న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ఈ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. దీంతో పాత రూ.500, రూ.1000 రూపాయ‌ల నోట్లు ర‌ద్ద‌య్యాయి. 86 శాతం చ‌లామ‌ణిలో ఉన్న డ‌బ్బు నిలిచిపోయింది. అయితే న‌గ‌దు ర‌ద్దుతో డిజిట‌ల్ చెల్లింపులు పెరుగుతాయ‌ని, ఖ‌ర్చు చేసే విధానం కూడా మారుతుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. కొత్త సాంకేతిక‌త‌ను ఉప‌యోగించుకొని డిజిట‌ల్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ విస్త‌రించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వెల్ల‌డించింది. చెప్పిన‌ట్లుగానే నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ చెల్లింపులు ఒక్క‌సారిగా పెరిగాయి. దీంతో న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా మార్చ‌డానికి ప్రోత్సాహం ల‌భించింది.

అంత‌కుముందు కేవ‌లం న‌గ‌దు చెల్లింపుల‌కే ప్రాధాన్యం వ‌హించే ప్ర‌జ‌లు నెమ్మ‌దిగా డిజిట‌ల్ చెల్లింపుల‌ను అల‌వాటు చేసుకున్నారు. పేటీఎం, మొబిక్విక్ వంటి అంకుర సంస్థ‌ల‌కు ప్రోత్సాహం ల‌భించింది. 2016 కంటే ముందు డెబిట్ కార్డుల‌ను కేవ‌లం ఏటీఎంల నుంచి న‌గ‌దు తీసుకునేందుకు మాత్ర‌మే ఉప‌యోగించేవారు… అయితే నోట్ల ర‌ద్దు త‌ర్వాత డెబిట్ కార్డుతో చెల్లింపులు పెరిగాయి.

యూపీఐ ఆధారిత పేమెంట్ వాలెట్లు , మొబైల్ బ్యాంకింగ్ ఒక్క‌సారిగా పుంజుకున్నాయి. చెల్లింపుల‌ను సుల‌భం చేసేందుకు ఎన్‌పీసీఐ, భార‌త్ బిల్ పేమెంట్ సిస్ట‌మ్ (బీబీపీఎస్) ప్రారంభించింది. అక్టోబ‌ర్‌లో యూపీఐ ఆధారిత చెల్లింపు కొత్త రికార్డుకు చేరి బిలియ‌న్ డాల‌ర్లుగా న‌మోద‌య్యాయి. 2018-19 లో డెబిట్ కార్డు చెల్లింపుల కంటే 1.2 రెట్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఆర్‌బీఐ వార్షిక నివేదిక‌లో తెలిపింది. యూపీఐ విధానాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా తీసుకెళ్లాల‌ని ఎన్‌పీసీఐ ఇప్పుడు భావిస్తోంది.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత వ్యాపారులు, వినియోగ‌దారులు చెల్లింపుల‌కు ప్ర‌త్యామ్నాయం చూసుకున్నారు. పాయింట్ ఆఫ్ సేల్స్ వ‌ద్ద డెబిట్ కార్డు వినియోగం 83 శాతం పెరిగింది. న‌వంబ‌ర్ 2016 లో ఇవి 23.47 కోట్లు కాగా, ఆగ‌స్ట్ 2017 లో 42.87 కోట్ల లావాదేవీలు న‌మోద‌య్యాయి. ఏటీఎంల వ‌ద్ద డెబిట్ కార్డుల‌ను ఉప‌యోగించ‌డం కూడా 42 శాతం పెరిగింది.

నోట్ల ర‌ద్దు త‌ర్వాత‌, సాధార‌ణంగా వ్యాపార లావాదేవీల‌కు ఉప‌యోగించే నెఫ్ట్ చెల్లింపులు ఆగ‌స్ట్ నాటికి 80 శాతం పెరిగి 22.12 కోట్లు న‌మోద‌య్యాయి. ఐఎంపీఎస్ చెల్లింపులు ఐదు రెట్ల వృద్ధితో 201.10 కోట్ల లావాదేవీలు జ‌రిగాయి. గ‌త మూడేళ్ల‌లో ఆన్‌లైన్ లావాదేవీల‌పై న‌మ్మ‌కం పెరిగింది. డెబిట్ కార్డుల‌ను ఏటిఎం నుంచి న‌గ‌దు తీసుకోవ‌డానికే కాకుండా అన్ని చెల్లింపులకు ఉప‌యోగించ‌డం సాధార‌ణం అయిపోయింది. డెబిట్ కార్డు చెల్లింపు కోసం యూపీఐ యాక్టివేట్ చేయాల్సి ఉండ‌గా రెండింటి వాడ‌కం బాగా పెరిగింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly