సీనియర్ సిటిజెన్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారా?

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను అన్ని పోస్టాఫీసులలో, నియమించిన కొన్ని బ్యాంకు శాఖలలో మాత్రమే ప్రారంభించే అవకాశం ఉంటుంది

సీనియర్ సిటిజెన్ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారా?

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లేదా ఎస్సీఎస్ఎస్ అనేది సీనియర్ పౌరులకు (60 సంవత్సరాల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ) సాధారణ, నష్ట భయం లేని ఆదాయాన్ని అందించడం కోసం ప్రారంభించిన ఒక చిన్న పొదుపు పధకం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, 60 సంవత్సరాల వయస్సు దాటని వారు కూడా సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం ఖాతాను తెరవవచ్చు. రక్షణ సర్వీసుల నుంచి పదవీ విరమణ చేసిన వారు 50 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడానికి అర్హులు. కానీ అందులో పౌర రక్షణ ఉద్యోగులకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. సీనియర్ సిటిజెన్ పొదుపు పథకం మెచ్యూరిటీ సమయం ఐదు సంవత్సరాలు. అయితే దీనిని పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఖాతా పొడిగింపు కోసం మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందే అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలను అన్ని పోస్టాఫీసులలో, నియమించిన కొన్ని బ్యాంకు శాఖలలో మాత్రమే ప్రారంభించే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో త్రైమాసికానికి ఒకసారి అనగా ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి నెలల్లోని మొదటి పని దినాన వడ్డీ చెల్లింపులు చేస్తారు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి :

ఒక డిపాజిట్ దారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహించవచ్చు, అయితే అన్ని ఖాతాలలో బ్యాలెన్స్ ను కలిపి గరిష్టంగా రూ. 15 లక్షలు పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ ఖాతాలను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి ఖాతా ద్వారా తెరవచ్చు, కానీ ఉమ్మడి ఖాతాను కేవలం భార్యతో మాత్రమే అనుమతిస్తారు.

ఉమ్మడి ఖాతా విషయంలో, మొదటి దరఖాస్తుదారు వయస్సు అర్హతను నిర్ణయించే ఏకైక అంశం. రెండవ దరఖాస్తుదారుని వయస్సుకు పరిమితి లేదు. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాలోని మొత్తం పెట్టుబడులు మొదటి దరఖాస్తుదారునికి చెందుతాయి.

జీవిత భాగస్వాములు ఇద్దరూ వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి ఖాతాలలో ఒక్కొక్కరూ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు, ఈ పథక నియమ నిబంధనల ప్రకారం, ఇద్దరూ వ్యక్తిగతంగా పెట్టుబడి పెట్టడానికి అర్హతను కలిగి ఉంటారు.

ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో నగదును కలిగి ఉంటే, ఒకేసారి డిపాజిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొంచం కొంచంగా పదవీ విరమణ లాభాలను పొందుతున్నట్లయితే, మీరు రిస్క్ తీసుకున్నా పర్వాలేదని ఆర్ధిక నిపుణుల అభిప్రాయం.

ప్రస్తుతం, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ తమ ఖాతాదారులకు సంవత్సరానికి 8.3 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ పథకంతో సహా అన్ని రకాల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికానికి ఒకసారి సవరిస్తారు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకం అందించే ఆదాయ పన్ను ప్రయోజనాలు :

ఒకవేళ ఆర్థిక సంవత్సరం చివరికి దగ్గరగా మీ పదవీ విరమణ తేదీ ఉన్నట్లయితే, మీరు రెండు భాగాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. మొదటి భాగాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి పెట్టవచ్చు, అలాగే రెండవ భాగాన్ని తదుపరి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా మీరు సెక్షన్ 80 సీ కింద రెండు సంవత్సరాలు పన్ను తగ్గింపు ప్రయోజనాలను పొందుతారు.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. ఈ డిడక్షన్ మీ మొత్తం పన్ను బాధ్యతను తగ్గిస్తుంది.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకం ప్రస్తుతం అందించే 8.3 శాతం వడ్డీ రేటు, చాలా బ్యాంకులు తమ పొదుపు ఖాతాలకు అందించే వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉందని, ఈ పథకం నెలవారీ ఆదాయం కలిగిన వారికి మంచి పెట్టుబడి ఆప్షన్. అలాగే దీనిని ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదం ఉండదు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ పథకం ముందస్తు మూసివేత :

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ లో ఈ సౌకర్యం ఖాతా తెరచిన ఒక సంవత్సరం తరువాత నుంచి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఖాతాను ఒక సంవత్సరం తరువాత మూసివేయాలని అనుకుంటే మొత్తం డిపాజిట్ లో 1.5 శాతం, అదే రెండు సంవత్సరాల తరువాత మూసివేయాలనుకుంటే మొత్తం డిపాజిట్ లో 1 శాతం మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని ఖాతాదారుడికి అందచేస్తారు. ఒకవేళ మూడు సంవత్సరాల తరువాత మూసివేయాలనుకుంటే ఎలాంటి మినహాయింపులు లేకుండా ఏ సమయంలోనైనా మూసివేయవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly