డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసును ప్రారంభించిన ఎస్బీఐ...

ఈ సౌకర్యం ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు, వైకల్యం ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది

డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసును ప్రారంభించిన ఎస్బీఐ...

కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టడానికి మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను విధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర బ్యాంకు సేవలను అనుమతించినప్పటికీ, ఈ లాక్ డౌన్ సమయంలో చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఏటిఎంలను సందర్శించి నగదును ఉపసంహరించుకోవడం కష్టంతో కూడుకున్న విషయం. కావున అత్యవసర సమయంలో మీకు నగదు అవసరమైతే, బ్యాంకులే మీ డోర్ వద్దకు వచ్చి నగదును అందిస్తాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. ఈ సౌకర్యం ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు, వైకల్యం ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ సేవలను కొన్ని బ్యాంకు శాఖలలో మాత్రమే పొందగలరు.

ఈ సందర్భంగా ఎస్బీఐ ట్వీట్ చేస్తూ, "నాగాన్ శాఖకు చెందిన మా సిబ్బంది వినియోగదారులకు డోర్-స్టెప్ నగదు సదుపాయాన్ని కల్పించడం ద్వారా అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలను అనుభవించేలా చూశారు. మేము కూడా ఈ మహమ్మారితో కలిసి పోరాడతామని ట్వీట్ చేసింది.

ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ (డీఎస్బీ) సేవల గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలను కింద తెలియచేశాము :

 1. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలో నగదు పికప్, నగదు డెలివరీ, చెక్ పికప్, చెక్ రిక్విజిషన్ స్లిప్ పికప్, ఫారం 15 హెచ్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, టర్మ్ డిపాజిట్ అడ్వైజ్, లైఫ్ సర్టిఫికేట్ పికప్, కేవైసీ పత్రాల పికప్ ఉన్నాయి.

 2. పని దినాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య టోల్ ఫ్రీ నంబర్ 1800111103 కు కాల్ చేసి సేవా అభ్యర్థన చేయవచ్చు.

 3. రిజిస్ట్రేషన్ కోసం హోమ్ బ్రాంచ్ ను సందర్శించి సర్వీస్ అభ్యర్థన చేయాల్సి ఉంటుంది.

 4. డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవ కేవలం KYC- కంప్లైంట్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

 5. ఆర్థికేతర లావాదేవీలకు రూ. 60 + జీఎస్టీ, ఆర్థిక లావాదేవీలకు రూ. 100 + జీఎస్టీ చొప్పున ఛార్జ్ చేస్తారు.

 6. నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్ మొత్తం రోజుకు రూ. 20,000 కి పరిమితం చేశారు.

 7. హోమ్ బ్రాంచ్ కి 5 కిలోమీటర్ల దూరంతో పాటు చెల్లుబాటు అయ్యే రిజిస్టర్డ్ మొబైల్ నంబరు ఉన్న ఖాతాదారులు మాత్రమే ఈ సేవలను పొందగలరు.

 8. జాయింట్ అకౌంట్ కలిగిన వినియోగదారులు ఈ సేవలను పొందలేరు.

 9. చిన్న ఖాతా, వ్యక్తిగత స్వభావం లేని ఖాతాలకు కూడా ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు.

 10. పాస్‌బుక్‌తో పాటు చెక్కు లేదా ఉపసంహరణ ఫారమ్‌ను ఉపయోగించి మాత్రమే నగదు ఉపసంహరణ సర్వీసును వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ వంటి బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసుల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

ఎస్బీఐ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఎలా పని చేస్తాయి :

• ఈ డోర్-స్టెప్ డెలివరీ సేవను పొందాలనుకునే ఎస్బీఐ కస్టమర్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి టోల్ ఫ్రీ నంబర్ 1800111103 కు కాల్ చేయాలి.
• కాల్ కనెక్ట్ అయిన తర్వాత, వినియోగదారులు చివరి 4 అంకెల పొదుపు బ్యాంకు లేదా కరెంట్ అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

 • ప్రారంభ ధృవీకరణ తరువాత, కాల్ కాంటాక్ట్ సెంటర్ ఏజెంట్‌కు బదిలీ అవుతుంది, వారు అదనపు ధృవీకరణ చేసిన తర్వాత, అభ్యర్థనను రికార్డ్ చేస్తారు.
  • వినియోగదారుని అభ్యర్థన వివరాలు, డెలివరీ ఏ సమయానికి (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు) కావాలో వంటి వివరాలను అందించాలి.
  • ఒకసారి అభ్యర్థనను అంగీకరించిన తర్వాత, కస్టమర్ కేస్ ఐడీ తో పాటు రిక్వెస్ట్ టైపు ను SMS ద్వారా పొందుతారు.
 • అనంతరం కస్టమర్‌ను సంప్రదించి అపాయింట్‌మెంట్‌ను పరిష్కరించే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్‌కు మీ అభ్యర్థనను పంపుతారు.
 • మీరు ఇచ్చిన సమయంలో, డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్ వినియోగదారుని రిజిస్టర్డ్ చిరునామాను సందర్శించి అతని ఫోటో ఐడీ కార్డు, అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రం (ఓవీడీ)ని చూపించాలి.
  • కస్టమర్ ఫోటో ఐడీ, ఓవీడీ ద్వారా కస్టమర్ గుర్తింపును కూడా ఏజెంట్ ధృవీకరిస్తాడు.
  • ఏజెంట్ తీసుకువెళ్ళిన మొబైల్‌లోని డోర్ స్టెప్ బ్యాంకింగ్ వెబ్ పోర్టల్‌లో సేవా అభ్యర్థన ప్రారంభమవుతుంది. లావాదేవీని ప్రారంభించడానికి కస్టమర్ వెబ్ పోర్టల్‌లో కేస్ ఐడీ, ధృవీకరణ కోడ్‌ను ఎంటర్ చేయాలి.
  • లావాదేవీ పూర్తయిన తరువాత కస్టమర్ SMS ను అందుకుంటారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly