ఆర్థికారోగ్యం పెంచుకోవాలి..మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా హైద‌రాబాద్‌లో శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు.

ఆర్థికారోగ్యం పెంచుకోవాలి..మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

నేటి పెట్టుబ‌డులే రేప‌టికి ర‌క్ష‌

  • ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌లు ఉండాలి
  • ఆర్జ‌న‌తోనే మ‌దుపూ ప్రారంభించాలి

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు…

నేడు మ‌నం పెట్టే పెట్టుబ‌డే భ‌విష్య‌త్తుకు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంద‌ని ఆర్థిక నిపుణులు సూచించారు. దీర్ఘ‌కాలిక దృష్టితో మ‌దుపు చేయ‌డం ఇప్పుడే ప్రారంభించాల‌ని వారు పేర్కొన్నారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఐసీఐసీఐ ఫండ్’ సంయుక్తంగా నిర్వహించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌దస్సుకు మంచి స్పంద‌న ల‌భించింది. మ‌న అవ‌స‌రాలు, అత్య‌వ‌స‌రాలు, అనుకోకుండా వ‌చ్చే ఆప‌ద‌ల‌ను గ‌ట్టెక్కించేలా ఆర్థిక ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా వారు తెలిపారు. తొలుత ‘ఈనాడు’ హైద‌రాబాద్ యూనిట్ ఇన్‌ఛార్జి ర‌మేశ్ బాబు మాట్లాడుతూ సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ గురించి ప‌రిచ‌యం చేశారు.

స‌మీక్షించుకుంటూ సాగాలి
-సాయికృష్ణ ప‌త్రి, స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్‌

IMG_20190727_175737.png

మ‌దుపు చేయ‌డం ఎంత ముఖ్య‌మో… స‌మ‌యానుకూలంగా దానిని స‌మీక్షించుకోవ‌డ‌మూ అంతే అవ‌స‌రం. ఆదాయం పెరుగుతున్న‌ప్పుడు ల‌క్ష్యం కూడా మారుతుంది. దీనికి అనుగుణంగా ఆర్థిక ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాలి. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మొత్తం పెట్టుబ‌డి పెట్ట‌డం క‌న్నా… ఎక్కువ స‌మ‌యంలో త‌క్కువ మొత్తం పెట్టుబ‌డి పెట్ట‌డం లాభ‌దాయ‌కం. మ‌దుపు చేసే ప్ర‌తి పైసా మ‌న‌కు భ‌రోసానివ్వాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌లు కూడా ఎంతో అవ‌స‌రం. మ‌న చేతిలో కావాల్సినంత డ‌బ్బు ఉంటే…న‌చ్చిన‌ప్పుడు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయొచ్చు. ఆదాయం ఆర్జించడం ప్రారంభం కాగానే పెట్టుబ‌డులూ ప్రారంభించాలి. ఆల‌స్యం చేస్తున్న కొద్దీ ప్ర‌యోజ‌నాలు దూరం అవుతుంటాయి. బీమా పాల‌సీల‌ను చిన్న వ‌య‌సులోనే తీసుకోవాలి. త‌క్కువ ప్రీమియంతో అధిక ర‌క్ష‌ణ క‌ల్పించే ట‌ర్మ్ పాల‌సీల‌ను ఎంచుకోవ‌డం మేలు.

మార్కెట్ ప‌డిన‌ప్పుడు ఈక్విటీల్లో పెట్టుబ‌డులు పెంచాలి. సూచీలు ప‌డిన ప్ర‌తీసారి పెట్టుబ‌డికి అనుకూల‌మ‌ని భావించాలి. క్ర‌మానుగ‌తంగా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేస్తూ…దీర్ఘ‌కాలం కొన‌సాగ‌డ‌మే ఎప్పుడూ మంచిది. అవ‌స‌రం లేని వ‌స్తువుల‌ను కొనాల‌ని చూస్తే…భవిష్య‌త్తులో అవ‌స‌ర‌మైన వాటిని అమ్ముకోవాల్సి రావొచ్చు. ఈ మాట‌ను అంద‌రూ గుర్తుంచుకోవాలి. డ‌బ్బును ఒకే చోట మ‌దుపు చేయ‌కుండా …వైవిధ్యంగా పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే శ్రేయ‌స్క‌రం.

ఆదా చేయ‌డ‌మూ ఒక అవ‌స‌ర‌మే
- ఆచంట శ్రీనివాస్, రీజ‌న‌ల్ హెడ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్

IMG_20190727_191709.png

సంపాదించ‌డం ఎంత ముఖ్య‌మో…అందులో నుంచి పొదుపు చేయ‌డ‌మూ అంతే ప్ర‌ధానం. ఖ‌ర్చు చేసే ప్ర‌తి పైసాకు ఒక లెక్క ఉండాలి. వ‌చ్చిన డ‌బ్బులో ముందు పొదుపు చేశాకే ఇత‌ర అవ‌స‌రాల‌కు కేటాయించ‌డం ఒక అల‌వాటుగా మారాలి. మార్కెట్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ పెట్టుబ‌డిపై అవ‌గాహ‌న పెంచుకోవాలి. అంద‌రూ పెట్టుబ‌డి పెడుతున్నార‌ని కాకుండా మ‌న‌కంటూ కొంత సొంత ఆలోచ‌న ఉండాలి. స‌రైన పెట్టుబ‌డి, స‌రైన స‌మ‌యం అనేది ఎప్పుడూ మంచి లాభాల‌ను ఇస్తుంది.

పెట్టుబ‌డి పెట్టాల‌న్న ఆలోచ‌న కంటే ఆచ‌ర‌ణ‌ చాలా ముఖ్యం. చాలామంది సులువుగా డ‌బ్బు సంపాదించ‌డంపై చ‌ర్చించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచ‌న‌తో మ‌దుపు చేస్తే మోస‌పోతారు. ఇప్ప‌టికే ఇలాంటి ప‌థ‌కాల్లో మ‌దుపు చేస్తే వీలైనంత తొంద‌ర‌గా పెట్టుబ‌డిని వెన‌క్కి తీసుకోవ‌డం మేలు.

చిన్న చిన్న మొత్తాల్లో మ‌దుపు చేసేందుకు మ్యూచువ‌ల్ ఫండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా ఫండ్ల‌ను ఎంచుకొని, నిపుణుల స‌ల‌హాలు పాటిస్తూ మ‌దుపు చేయడం ఉత్త‌మం.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly