ఆర్థికారోగ్యం పెంచుకోవాలి.. మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఆదివారం ఒంగోలులో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌ మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది.

ఆర్థికారోగ్యం పెంచుకోవాలి.. మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు
  • ఆర్థికారోగ్యం పెంచుకోవాలి
  • దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులే మేలు
    -సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌నలు…
ONGOLE-INNER-2.png

భ‌విష్య‌త్తు ఆర్థిక అవ‌స‌రాల‌ను నేడే ఊహించి, అందుకు అనుగుణంగా పొదుపు , మదుపు చేసిన‌ప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని ఆర్థిక నిపుణులు సూచించారు. ఆదివారం ఒంగోలులో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్య‌చువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ రీజ‌న‌ల్ హెచ్ బి.రాజేంద్ర మాట్లాడుతూ…వ్య‌క్తులు త‌మ ఆరోగ్యంపై దృష్టి పెట్టిన‌ట్లే…ఆర్థిక ఆరోగ్యానికీ అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘కాలం గ‌డుస్తున్న కొద్దీ డ‌బ్బు విలువ ప‌డిపోతుంది. ఇప్పుడున్న రూ.2000 ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం వ‌ల్ల 30 ఏళ్ల త‌ర్వాత రూ.532 తో స‌మాన‌మ‌వుతాయి. అందుకే, భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను అంచ‌నా వేసుకొని, ఇప్ప‌టినుంచే పెట్టుబ‌డులు ప్రారంభించాలి. చిన్న మొత్తాల‌తోనూ పెట్టుబ‌డులు ప్రారంభించేందుకు మ్యూచువ‌ల్ ఫండ్లు మంచి మార్గం. వీటిలో నిర్ణీత మొత్తాన్ని నెల‌నెలా మ‌దుపు చేయ‌డం ద్వారా మార్కెట్ హెచ్చుత‌గ్గుల నుంచి స‌గ‌టు ప్ర‌యోజ‌నం అందుతుంది’ అని తెలిపారు.

ONGOLE-INNER-1.png

జెన్ మ‌నీ జ‌న‌రల్ మేనేజ‌ర్ జె.వేణుగోపాల్ మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌పై ఆర్థిక‌, సామాజిక‌, రాజ‌కీయ‌, ప్ర‌కృతి అంశాలు ప్ర‌భావం చూపుతాయ‌న్నారు. ‘మార్కెట్ అనేది దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల‌కే త‌ప్ప‌, స్వ‌ల్ప‌కాలంలో లాభాలు సంపాదించాలంటే 99 శాతం న‌ష్టాలు ఖాయం. ఒక కంపెనీ షేరు కొనాలంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వ‌దంతుల‌ను న‌మ్మి, అప్పు చేసి పెట్టుబ‌డుల‌ను పెట్ట‌కూడ‌దు. మార్కెట్ సూచీలు త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు పెట్టుబ‌డులు పెట్టాలి. అధికంగా ఉన్న‌ప్పుడు లాభాలు స్వీక‌రించాలి. మంచి వ్యూహం, క్ర‌మ‌శిక్ష‌ణ లేకుంటే మార్కెట్‌లో చిక్కులు వ‌స్తాయి. ప్ర‌స్తుతం ఆర్థిక మంద‌గ‌మ‌నాన్ని అధిగ‌మించాలంటే ప్ర‌భుత్వ పెట్టుబ‌డుల‌తో పాటు ప్రైవేటు భాగ‌స్వామ్యం పెర‌గాల‌ని, ఎగుమ‌తులు, వినిమ‌యం పెరిగేలా నిర్ణ‌యాలు వ‌స్తే మార్కెట్ వృద్ధి చెందుతుంద‌ని’ పేర్కొన్నారు. ఈ అంశాల‌తోపాటు ఆర్థిక ప్ర‌ణాళిక‌ల అవ‌స‌రం, బీమా ప్రాధాన్యం త‌దిత‌ర అంశాల‌నూ వారు వివ‌రించారు. అనంత‌రం మ‌దుప‌రుల సందేహాల‌ను నివృత్తి చేశారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly