రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్‌ ఫండ్ సంయుక్తంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

నిరీక్షిస్తేనే… లాభాల పంట‌

  • పెట్టుబ‌డుల‌ను ఆప‌కూడ‌దు
  • ‘సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్’ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

‘సంపాదించిన డ‌బ్బులో మొత్తం ఖ‌ర్చు చేసేస్తే…ఆర్థికంగా ఎప్పటికీ విజ‌యం సాధించ‌లేం. ముందు పొదుపు, త‌ర్వాత వ్య‌యం అనే సూత్రాన్ని పాటించిన‌ప్పుడే అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోగ‌లం’ అని ఆర్థిక నిపుణులు సూచించారు. మంచి అవ‌గాహ‌న‌, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడే ఫ‌లితాలు బాగుంటాయ‌ని వారు పేర్కొన్నారు. శనివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్‌ ఫండ్’ సంయుక్తంగా నిర్వహించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌దస్సుకు మంచి స్పంద‌న ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్ క‌రీం ల‌ఖాని మాట్లాడుతూ…

IMG-INNER-2.png
‘మ‌న ప్ర‌తి అవ‌స‌ర‌ము డ‌బ్బుతోనే ముడిప‌డి ఉంది. భవిష్య‌త్తులో ఇది మ‌రింత పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి వ్య‌క్తి త‌న అవ‌స‌రాల‌ను గుర్తించి, అందుకు అనుగుణంగా పెట్టుబ‌డులు పెట్టాలి. సంపాద‌న ప్రారంభ‌మైన రోజు నుంచే … మ‌దుపూ ఆరంభించాలి. మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు… ఒక రోజులోనే లాభాలు వ‌స్తాయ‌ని ఆశించ‌కూడ‌దు. మంచి కంపెనీల షేర్లు, మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల‌ను ఎంచుకొని, దీర్ఘ‌కాలం మ‌దుపు కొన‌సాగించాలి. తొంద‌ర‌పాటులో త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటే క‌ష్టార్జితాన్ని న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది’ అని సూచించారు.

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్ రీజ‌న‌ల్ హెడ్ ప‌ద్మ‌నాభ‌ముని మాట్లాడుతూ …

IMG-INNER-1.png
‘పెట్టుబ‌డి పెట్టేందుకు ఎంత చిన్న మొత్త‌మైనా స‌రిపోతుంది. దీర్ఘ‌కాలంలో అదే పెద్ద నిధిగా మారుతుంది. ఇప్పుడు లాభాల బాట‌లో ఉన్న కంపెనీలు… కొన్ని రోజుల‌కు అంత‌గా ఫ‌లితాలు చూపించ‌కపోవ‌చ్చు. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ లాభాల బాట‌లోకి రావ‌చ్చు. పెట్టుబ‌డికి న‌ష్టం రాకుండా చూసుకోవ‌డ‌మే మార్కెట్లో విజ‌య ర‌హ‌స్యం. క్ర‌మం త‌ప్ప‌కుండా… మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా స‌గటు ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. మార్కెట్ త‌గ్గుతున్నా…పెరుగుతున్నా… పెట్టుబ‌డుల‌ను మాత్రం ఆపొద్దు’ అని పేర్కొన్నారు. దీంతో పాటు నిపుణులు స్టాక్ మార్కెట్ ప్ర‌స్తుత ప‌రిస్థితి, ఆర్థిక ప్ర‌ణాళిక‌ల అవ‌స‌రం త‌దిత‌ర అంశాల‌పైనా అనేక సూచ‌న‌లు చేశారు. మ‌దుప‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌ను నివృత్తి చేశారు. ‘ఈనాడు’ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం యూనిట్ ఇన్‌చార్జి టి.వి చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌సాద్ హాజ‌ర‌య్యారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly