తిరుపతిలో నిర్వహించిన మదుపరుల సదస్సులో నిపుణుల విలువైన సూచనలు
ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంయుక్తంగా తిరుపతిలో శనివారం మదుపరుల అవగాహన సదస్సు నిర్వహించారు.
సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, తిరుపతిలో 20.07.2019
- దీర్ఘకాలిక పెట్టుబడులే రక్ష
- బీమా పాలసీని మర్చిపోవద్దు
-సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులో నిపుణుల సూచనలు
“ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసినప్పుడు దీర్ఘకాలం ఓపిక పట్టాలి. అప్పుడు అవి మంచి రాబడినస్తాయి. ఆదాయం నుంచి ఖర్చు చేసేదాంట్లో అవసరాలు, కోరికలకు ఎంత కేటాయించాలనేది ముందుగానే నిర్ణయించుకోవాలి” అని ఆర్థిక నిపుణులు సూచించారు. శనివారం తిరుపతిలో ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంయుక్తంగా నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. తొలుత ఈనాడు చిత్తూరు జిల్లా యూనిట్ ఇన్ఛార్జీ శ్రీనివాసులు కార్యక్రమం గురించి వివరించారు. అనంతరం నిపుణులు మాట్లాడుతూ…ఆర్థిక ప్రణాళికల అవసరం, పెట్టుబడుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లాంటి పలు అంశాలను వివరించారు.
ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా:
– సాయికృష్ణ పత్రి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
పెరిగే ఖర్చులను తట్టుకోవాలంటే ద్రవ్యోల్మణాన్ని అధిగమించే రాబడినిచ్చే పథకాలను ఎంచుకోవాలి. దీనికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ఒక మార్గం. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడినిస్తాయి. మార్కెట్లోని స్వల్పకాలిక హెచ్చుతగ్గులకు భయపడి వీటిల్లో నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటే లాభాలు సాధించే అవకాశాన్ని కోల్పోతాం.
- మన దేశంలో యువత అధికంగా ఉన్నారు. అనేక ప్రపంచ స్థాయి పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. దీనివల్ల రానున్న రోజుల్లో మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. స్టాక్ మార్కెట్లు కూడా లాభపడతాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని, ఈక్విటీల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఆర్జించే ప్రతి ఒక్కరూ బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. కొందరు కేవలం నామమాత్రంగా పాలసీలు తీసుకుంటారు. ఇది సరైన విధానం కాదు. పాలసీదారుడికి ఏదైనా జరిగితే కుటుంబానికి ఆ పాలసీ పెద్ద దిక్కుగా నిలవాలి. ఆర్థికంగా ఆదుకోవాలి. కాబట్టి, వార్షికాదాయానికి 10-20 రెట్ల వరకు బీమా ఉండేలా చూసుకోవాలి.
- ఒక పెట్టుబడిదారు పెట్టేముందు రానున్న రోజుల్లో ఉండే ద్రవ్యోల్బణాన్ని అది ఎదుర్కోగలదా లేదా అనేది పరిశీలించాలి. ఆ తర్వాతే అందులో మదుపు చేయాలి.
- నేడు పిల్లల చదువుల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. గతంలో ఒక వ్యక్తి తన జీవిత కాలంలో విద్యాభ్యాసం కోసం చేసిన ఖర్చు ఇప్పుడు తమ పిల్లల ప్రాథమిక విద్యకే సరిపోవడం లేదు. పిల్లల చదువులకు అయ్యే ఖర్చుపై సరైన ప్రణాళిక లేకుంటే వారి లక్ష్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ పదవీ విరమణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పెట్టుబడిని త్వరగా ప్రారంభిస్తే అది కాలంతోపాటు వృద్ధి చెంది, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలు కల్పిస్తుంది.
– సాయికృష్ణ పత్రి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
క్రమశిక్షణతో మదుపు:
ఆర్థిక లక్ష్యాల సాధనకు క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టడం ఎంతో ముఖ్యం. ఈక్విటీ మ్యూచువల్ పండ్లలో మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానాన్ని (సిప్) పాటించాలి. దీనివల్ల మార్కెట్ హెచ్చుతగ్గుల్లో సగటు ప్రయోజనం లభిస్తుంది. దీర్ఘకాలంలో ఈ విధానం వల్ల మంచి రాబడీ అందుతుంది.
- పొదుపు, కరెంటు అకౌంట్ ఖాతాల్లో నిల్వ ఉంచడానికి బదులుగా లిక్విడ్ ఫండ్లను పరిశీలించవచ్చు. ఇందులో ఒక్క రోజు నుంచి కూడా పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పిస్తాయి. అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఈ ఫండ్లను పరిశీలించవచ్చు.
- ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజీ ఫండ్లను పరిశీలించవచ్చు. ఈ విభాగంలోని ఫండ్లు…ఈక్విటీ, డెట్, లిక్విడ్ ఫథకాల్లో మదుపు చేస్తాయి. స్టాక్ మార్కెట్లో దిద్దుబాటు వస్తే…ఈక్విటీ కేటాయింపులు పెంచుతారు. మార్కెట్ వృద్ధి చెందితే ఈక్విటీల నుంచి కొంత పెట్టుబడిని తీసీ, డెట్కు మళ్లిస్తారు. మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకునేందుకు ఇవి ఉత్తమమైనవి.
- దీర్ఘకాలిక అవసరాలను గుర్తించాలి. వాటికి అవసరమైన మొత్తం ఎంత దానికోసం ఇప్పుడు ఎంత మదుపు చేయాలి అనేది ప్రణాళిక వేసుకోవాలి. అందుకు అనువైన ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే ఆర్థికంగా ఏ ఇబ్బందులూ రావు.
– ఆచంట శ్రీనివాస్, రీజనల్ హెడ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
Comments
0