విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్‌, జెన్‌ మ‌నీ' సంయుక్తంగా విశాఖ‌ప‌ట్నం - గాజువాక‌లో ఆదివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు.

విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

పెట్టుబ‌డుల‌తో ప‌రోక్ష ఆదాయం - ఓపిక‌తో ఉంటేనే మంచి రాబ‌డి
’సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్’ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు…

ఈనాడు, విశాఖ‌ప‌ట్నం: ఆర్థిక ఇబ్బందులు త‌లెత్త‌కుండా జీవితం హాయిగా గ‌డ‌వాలంటే ప్ర‌తి వ్య‌క్తికీ ఆర్థిక భ‌ద్ర‌త‌కు అవ‌స‌ర‌మైన వ్యూహాలు ఉండాల‌ని నిపుణులు సూచించారు. పొదుపు, పెట్టుబ‌డుల ద్వారా ప‌రోక్ష ఆదాయం వ‌చ్చే ఏర్పాటు చేసుకోవాల‌ని తెలిపారు. ఆదివారం గాజువాక‌లో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్‌, జెన్‌ మ‌నీ’ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుపురుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాంతీయ అధిప‌తి బి. రాజేంద్ర మాట్లాడుతూ…
IMG-INNER-1.png
ఉద్యోగుల్లో కేవ‌లం 22 శాతం మంది మాత్ర‌మే ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం ఆర్థిక అవ‌స‌రాల‌కు వీలుగా పెట్టుబ‌డులు పెడుతున్నార‌న్నారు. ఉద్యోగం ప్రారంభించిన నాటి నుంచి మ‌లి జీవితం గురించీ ఆలోచించుకోవాల‌ని తెలిపారు. పెట్టుబ‌డులు ఎంత తొంద‌ర‌గా ప్రారంభిస్తే అంత మంచి ఫ‌లితాల‌నిస్తాయ‌నీ, ఆల‌స్యం అవుతున్న కొద్దీ రాబ‌డి త‌గ్గుతుంద‌ని పేర్కొన్నారు. చిన్న మొత్తాల‌తోనూ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసేందుకు వీలుంద‌నీ, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, క్ర‌మం త‌ప్ప‌కుండా వీటిలో ‘సిప్’ ద్వారా పెట్టుబ‌డులు పెట్టాల‌న్నారు.

జెన్‌మ‌నీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జె. వేణుగోపాల్ మాట్లాడుతూ…
IMG-INNER-2.png
‘బ‌ల‌మైన ఆర్థిక పునాదులు, స్థిరంగా ప‌నితీరున్న కంపెనీల షేర్ల‌లో ద‌శ‌ల‌వారీగా మ‌దుపు చేసేందుకు ఇప్పుడు అనువైన ప‌రిస్థితులున్నాయి. క‌నీసం 3 ఏళ్ల‌కాలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఓపిక‌తో ఉన్న‌వారి ద‌గ్గ‌రికే డ‌బ్బు వెళ్తుంది. షేరు ధ‌ర ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడే కొనుగోలు చేయండి. దీర్ఘ‌కాలంలో కంపెనీ ప‌నితీరు బాగుంటే దాని విలువ పెరుగుతుంది. ప్ర‌స్తుత గ‌డ్డు ప‌రిస్థితుల‌ను ఎదిరించి ప్ర‌భుత్వం ముందుకు వెళ్లాలంటే… బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి. మార్కెట్లో ద్ర‌వ్య ల‌భ్య‌త‌, రుణ విత‌ర‌ణ పెరిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. స‌ర‌ళ‌మైన ప‌న్నుల విధానం వ‌ల్ల వృద్ధి పెరిగే అవ‌కాశం ఉంటుంద’ ని అన్నారు. వీటితోపాటు ఆర్థిక ప్ర‌ణాళిక‌లు, బీమా పాల‌సీల అవ‌స‌రం త‌దిత‌ర అంశాల‌పై వీరు ప‌లు సూచ‌న‌లు చేశారు మ‌దుప‌రుల సందేహాల‌ను నివృత్తి చేశారు. ఈనాడు విశాఖ యూనిట్ ఇన్‌చార్జి అన్నే శ్రీ‌నివాస్ హాజ‌ర‌య్యారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly