వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా వ‌రంగ‌ల్‌లో శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు.

వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, వ‌రంగ‌ల్ 29.06.2019

ప్ర‌ణాళికతో ఆర్థిక విజ‌యం

 • ద్ర‌వ్యోల్బ‌ణానికి మించి రాబ‌డి
 • క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మ‌దుపు సాగాలి
 • సిరి ఇన్వెస్ట‌ర్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

IMG_20190629_201544.jpg
ప్ర‌తి వ్య‌క్తికి స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక త‌ప్ప‌కుండా అవ‌స‌ర‌మ‌ని అప్పుడే జీవితంలోని అన్ని ద‌శ‌ల్లో హాయిగా ఉండ‌గ‌ల‌మ‌ని స్టాక్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. శ‌నివారం సాయంత్రం హ‌న్మ‌కొండ అశోక కన్వెన్ష‌న్ హాల్‌లో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్-ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా అవ‌గాహ‌న స‌ద‌స్సును నిర్వ‌హించాయి. ఇందులో మ‌దుప‌ర్ల‌కు ఆర్థిక ప్ర‌ణాళిక‌పై విలువైన సూచ‌న‌లు ఇచ్చారు. ముందుగా ఈనాడు వ‌రంగ‌ల్ యూనిట్ ఇన్‌ఛార్జ్ కె.ఎస్‌.పి రాజు ఈ కార్య‌క్ర‌మం గురించి వివ‌రించారు. అనంత‌రం నిపుణులు మాట్లాడుతూ… క్ర‌మం త‌ప్ప‌కుండా మ‌దుపు చేయ‌డం వ‌ల్ల జీవితంలో ప‌లు ఆర్థిక ల‌క్ష్యాలను ఎలా చేరుకోవ‌చ్చో వివ‌రించారు. మదుప‌రులు అడిగిన సందేహాల‌ను నివృత్తి చేశారు.

పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త ఉండాలి
-సాయికృష్ణ ప‌త్రి, స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్‌

IMG_20190629_182858.jpg
ఆర్థిక ల‌క్ష్యాల‌ను ర‌చించుకునేందుకు ప్ర‌తి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాల‌ను చేరుకునేందుకు ఒక మార్గం దొరుకుతుంది. ముఖ్యంగా పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు మొద‌ట గుర్తుకు రావాల్సింది ద్ర‌వ్యోల్బ‌ణం. నేడు రూ.50 వేలను, 6 శాతం ద్ర‌వ్యోల్బ‌ణంతో ప‌రిగ‌ణిస్తే పాతికేళ్ల త‌ర్వాత చూస్తే కేవ‌లం రూ.11 వేల‌తో స‌మానం అవుతుంది.

 • ఆర్థిక ప్ర‌ణాళిక మూడు ర‌కాలుగా ఉండాలి. స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాలు, మ‌ధ్య‌కాలిక, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను పెట్టుకొని త‌ద‌నుగుణంగా స‌రైన మార్గంలో మ‌దుపు చేయాలి.
 • పిల్ల‌లు పుట్ట‌గానే వారి పేరిట పొదుపు ప్రారంభించాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందాక ఏ చింతా లేకండా ఉండాలంటే రిటైర్మెంట్ ప్లాన్ త‌ప్ప‌నిస‌రి. చ‌దువు స్థిరాస్తి కొనుగోలు, ఇత‌ర అవ‌స‌రాల‌కు బ్యాంకులు రుణాలు అంద‌జేస్తాయిగాని, ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత ఏ బ్యాంకు రుణం ఇవ్వ‌దు. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణించి దూర‌దృష్టితో మ‌లి జీవిత అవ‌స‌రాల‌కు ప్ర‌ణాళిక వేసుకోవాలి. అప్పుడే విశ్రాంతంలో హాయిగా జీవితం గ‌డిచిపోతుంది.
 • పెట్టుబ‌డి పెట్టేందుకు ఒకే ప‌థ‌కాన్ని ఎంచుకోవ‌డం స‌రికాదు. డ‌బ్బును వివిధ మార్గాల్లో మ‌దుపు చేయాలి. మార్కెట్‌లో వ‌చ్చే స్వ‌ల్ప‌కాలిక హెచ్చుత‌గ్గుల‌ను ప‌ట్టించుకోకూడ‌దు. దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డులు ఎప్పుడు లాభాల‌నే ఇస్తాయి.
 • బీమా చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. మ‌న వార్షికాదాయానికి 20-25 రెట్లు బీమా మొత్తం వ‌చ్చేలా ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవాలి. అనుకోని ప‌రిస్థితులు ఎదురైన‌ప‌పుడు ఇది కుటుంబానికి ఆర్థిక భ‌రోసా ఇస్తుంది.

రోజువారి ఖ‌ర్చులు రాయాలి

 • ఆచంట శ్రీనివాస్, రీజ‌న‌ల్ హెడ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్‌

IMG_20190629_193655.jpg
దీర్ఘ‌కాలిక అవ‌స‌రాల‌ను గుర్తించి అందుకు అనుగుణంగా పెట్టుబ‌డుల ప్ర‌ణాళిక వేసుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించే రాబ‌డిని సొంతం చేసుకోవ‌చ్చు. కొంచెం న‌ష్ట‌భ‌యం ఉన్నా… కాలం గ‌డుస్తున్నా కొద్దీ అది నామ‌మాత్రంగానే ఉంటుంది.

 • మ‌న‌కంటూ కొన్ని ప్రత్యేక ఆర్థిక ల‌క్ష్యాలు ఉంటాయి. వీటిని సాధించేందుక స‌రైన మార్గంలో మ‌దుపు చేయాలి. స్టాక్ మార్కెట్ల‌ను స‌రిగా అధ్య‌య‌నం చేయాలి. అవ‌గాహ‌న పెంచుకోవాలి. నిపుణుల స‌ల‌హాల‌తో స‌రైన ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌డం ఎప్పుడూ పాటించాల్సిన సూత్రం.
 • ప‌న్ను భారం త‌గ్గించేందుకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం నుంచే ఇందులో సిప్ చేయ‌డం మొద‌లు పెట్టాలి.
 • చేసే రోజువారి ఖ‌ర్చులు రాసుకుంటే అన‌వ‌స‌ర వ్య‌యాలు త‌గ్గించేందుక వీల‌వుతుంది.
 • మీ పెట్టుబడులు, ఆస్తులు, అప్పులు, బీమా పాల‌సీల వివరాలు త‌ప్ప‌నిస‌రిగా ఒక చోట రాసి పెట్టాలి. కుటుంబంలో జీవిత భాగ‌స్వామికి, మ‌రో వ్య‌క్తికి ఈ వివ‌రాలు తెలిసి ఉండ‌టం మంచిది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly