ఈపీఎఫ్ నామినేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

ఈపీఎఫ్ నామినేషన్ లో మార్పులు చేయాల్సి వస్తే ముందుగా నియమ, నిబంధనలను అర్థం చేసుకోవాలి

ఈపీఎఫ్ నామినేషన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు

మనలో చాలా మందికి ఈపీఎఫ్ నామినేష‌న్ ప్రాముఖ్యత తెలియకపోవచ్చు.
ఒకవేళ ఈపీఎఫ్ నామినేషన్ లో ఏదైనా మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే ముందుగా దీనికి సంబంధించిన నియమ,నిబంధనలను అర్థం చేసుకుని అనంతరం నామినేషన్ వివరాలను తనిఖీ చేయాలి. అనంతరం ఎలాంటి మార్పులు అవసరమో వాటిని చేయడం మంచిది. ఈపీఎఫ్ నామినేషన్ నియమాలు, తరచుగా నామినీని మార్చుకునే వీలుందా? మొద‌లైన‌ ప్రాధమిక వివరాలను తెలుసుకుందాం.

ఈపీఎఫ్ నామినేషన్ నియమాలు:

 • మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినేషన్ క‌చ్చితంగా ఉండాలి.ఈపీఎస్ ఖాతాదారునికి ఆకస్మిక మరణం సంభవిస్తే అప్పుడు నగదు బదిలీ సులభం అవుతుంది.
 • మీరు ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీగా ఎంచుకోవచ్చు. అలాగే ఎవరెవరికి ఎంత శాతం వాటా చెందాలో కూడా తెలుపవచ్చు.

 • నామినీగా సొంత కుటుంబ సభ్యులను మాత్రమే ఎంచుకోవలసి ఉంటుంది. కుటుంబానికి చెందని వ్యక్తి నామినేషన్ చెల్లదు.

 • ఒకవేళ మీకు కుటుంబం లేకపోతే అప్పుడు బయటివారిని నామినీగా ఎంచుకోవచ్చు.

 • వివాహానికి ముందు మీరు వేరొకరిని నామినిగా పేర్కొనట్లైతే, వివాహం అనంతరం మీ భార్యను నామినీగా మార్చుకోవచ్చు. ఒకవేళ మీ భార్య పేరు నామినీగా మార్చుకోకపోతే వివాహానికి ముందు ఉన్న నామినేషన్ చెల్లదు. వివాహం తరువాత క‌చ్చితంగా కొత్త నామినీని పేర్కొనవలసి ఉంటుంది.

 • ఒకవేళ నామినీ మైనర్ అయితే, వారి సంరక్షకుడు కుటుంబ సభ్యుడై ఉండాలి. ఒకవేళ సంరక్షకుడిగా ఉండడానికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే, అప్పుడు ఉద్యోగి బయట కుటుంబానికి చెందిన ఒకరిని సంరక్షకుడిగా నియమించుకోవ‌చ్చు,

 • ఒకవేళ నామినేషన్ లేకపోతే, ఈపీఎఫ్ మొత్తాన్ని కుటుంబ సభ్యులందరికీ సమానంగా చెల్లిస్తారు.

నామినీగా ప‌రిగ‌ణించ‌ని వారు:

 • 18 సంవ‌త్స‌రాలు నిండిన కుమారులు,

 • 18 సంవ‌త్స‌రాలు నిండిన కుమారుని కుమారులు,

 • కూతుళ్లు వారి భ‌ర్త‌లు జీవించిఉన్న‌ట్ట‌యితే,
  చ‌నిపోయిన కుమారుని కూతుళ్ల భ‌ర్త‌లు బ‌తికుంటే కూడా ఇది వ‌ర్తించ‌దు.

 • మీకిష్టమైన విధంగా నామినీని ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు.

ఈపీఎఫ్ లో నామినీ హక్కులు:

ఈపీఎఫ్ లో నామినీ హక్కులు ఏంటి? ఉద్యోగి మరణం తర్వాత నామినీగా ఉన్న వ్యక్తి ఆ మొత్తాన్ని పొందుతారా?

ఇక్కడ నామినీ కేవలం ఒక ధర్మకర్త లాగా మాత్రమే పని చేస్తాడు. ఉద్యోగి మరణించిన తర్వాత అతనికి చెందదిన ఈపీఎఫ్ మొత్తాన్ని స్వీకరించడానికి నామినీకి హక్కు ఉంటుంది. కానీ, ఫండ్ ను క్లెయిమ్ చేసుకోడానికి నామినీకి హక్కు లేదు. వారసుల చట్టం ప్రకారం ఉద్యోగికి చెందిన చట్టపరమైన వారసులకు మాత్రమే ఈపీఎఫ్ ఫండ్ ను పంపిణీ చేయాలి. ఈపీఎఫ్ ఖాతాకు నామినీగా చట్టపరమైన వారసుడిని నియమించుకోవడం ఉత్తమమైన విషయం. లేకుంటే, మీ మరణం తరువాత మీ కుటుంబ సభ్యుల మధ్య చట్టపరమైన వివాదాలను సృష్టించినవారవుతారు.

ఈపీఎఫ్ నామినేషన్ వివరాలను ఆన్ లైన్లో ఎలా తనిఖీ చేయాలి?

ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ ను ఉపయోగించి, ఆన్ లైన్లో మీరు ఈపీఎఫ్ నామినేషన్ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.

 • మొదటగా యూనిఫైడ్ పోర్టల్ లో లాగిన్ అవ్వండి.

 • అండర్ మేనేజ్ కింద ఉన్న ఈ-నామినేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

 • క్లిక్ చేసిన తర్వాత, ఈపీఎఫ్ ఖాతాలకు లింక్ చేసిఉన్న‌ నామినేషన్ వివరాలను మీరు పొందుతారు.

ఆన్ లైన్ ద్వారా ఈపీఎఫ్ నామినేషన్ ను ఎలా అప్డేట్ లేదా మార్పులు చేయాలి?

 • యూనిఫైడ్ పోర్టల్ ను సందర్శించి, యూజర్ ఐడి, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ చేయండి.

 • "మ్యానేజ్ " విభాగంలో, “ఈ - నామినేషన్” ఆప్షన్ ను ఎంచుకోవాలి.

 • అక్కడ మీకు సంబంధించిన వివరాలైన యూఏఎన్, పేరు, పుట్టిన తేదీ, లింగ నిర్ధారణ మొదలైనవి కనిపిస్తాయి. ఇక్కడ మీ 'శాశ్వత చిరునామా’ను తెలిపి సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.

 • కుటుంబ డిక్లరేషన్ ను అప్ డేట్ చెయ్యడానికి ‘అవును’ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. అప్పుడు మీ కుటుంబ సభ్యుల వివరాలు అనగా సభ్యుల పేర్లు, పుట్టిన తేదీ, వారికి మీతో ఉన్న సంబంధం, చిరునామా వంటి వివరాలను తెలపాలి.

 • ఇప్పుడు మీ ఈపీఎఫ్ ఖాతాకు నామినిగా మీ కుటుంబ సభ్యులను ఎంచుకోవాలి. ఒకరి కంటే ఎక్కువ సభ్యులను నామినీగా ఎంచుకున్నట్లైయితే ఎవరికీ ఎంత శాతం వాటా చెందాలో ప్రకటించవచ్చు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఒకరిని మాత్రమే మీరు నామినీగా ఎంచుకుంటే, 100 శాతం వాటాను వారికే ప్రకటించవచ్చు.

 • అనంతరం ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’ అనే బటన్ పై క్లిక్ చేయండి.

 • ఆధార్ ఈ-సైన్ ద్వారా మీ ఈ-నామినేషన్ ఫారమ్ ను ఆమోదించాలి. మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ ని పొందడానికి ఈ-సైన్ బటన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీరు పొందిన ఓటీపీని ఎంటర్ చెయ్యండి. ఇలా చేయడం ద్వారా ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. మీ యజమానికి లేదా మాజీ యజమానికి నామినేషన్ తాలూకా భౌతిక పత్రాన్ని పంపించవలసిన అవసరం లేదు.

 • మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మీ ఆధార్ నెంబర్ ను ఈపీఎఫ్ ఖాతాకు లింక్ చేయాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly