ఈపీఎఫ్ vs పీపీఎఫ్ vs జీపీఎఫ్

దేశంలో ప్ర‌ధానంగా 3 భ‌విష్య నిధి ఖాతాలు అందుబాటులో ఉన్నాయి

ఈపీఎఫ్ vs పీపీఎఫ్ vs జీపీఎఫ్

భ‌విష్య నిధి అనేది ప‌ద‌వీవిర‌మ‌ణ కోసం పొదుపు చేసే ప‌థ‌కం. మెచ్యూరిటీ స‌మ‌యానికి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. భ‌విష్య నిధి ఖాతాలో, ఖాతాదారుడు త‌న వేత‌నంలో కొంత భాగాన్ని, నిర్ధిష్ట స‌మ‌యం వ‌ర‌కు మదుపు చేయ‌టం ద్వారా మెచ్యూరిటీ స‌మ‌యానికి ప్ర‌యోజ‌నం మొత్తం ల‌భిస్తుంది. దేశంలో ప్ర‌ధానంగా 3 భ‌విష్య నిధి ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఉద్యోగ భ‌విష్య నిధి (ఈపీఎఫ్‌), రెండవది ప్ర‌జా భ‌విష్య‌నిధి (పీపీఎఫ్‌), మూడవది సాధార‌ణ భవిష్య నిధి (జీపీఎఫ్‌). ఈపీఎఫ్, 5 సంవ‌త్స‌రాల క‌నీస లాక్ ఇన్ పిరియ‌డ్‌తో ఖ‌చ్చితంగా తీసుకోవ‌ల‌సిన ప‌ద‌వీ విర‌మ‌ణ పొదుపు ప‌థ‌కం, పీపీఎఫ్ పూర్తి ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అందించే పెట్టుబ‌డి ప‌థ‌కం. జీపీఎఫ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్న భ‌విష్య‌నిధి ఖాతా.

  • ఈపీఎఫ్ ఖాతా :

20 లేదా అంత‌కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ప‌నిచేస్తున్న ప్ర‌తీ కంపెనీ క‌చ్చితంగా ఈపీఎఫ్‌ను చెల్లించాలి. ఇందుకోసం ఉద్యోగి, య‌జ‌మాని ఉభ‌యులు చెల్లింపులు స‌మానంగా ఉంటాయి. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌ (ఈపీఎఫ్ఓ) వారి ఉద్యోగుల భ‌విష్య నిధిపై అందించే ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు 8.65 శాతం.

ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపులు, రెండు నెల‌ల పాటు వేత‌నం తీసుకోని స్థితి, ఉద్యోగి/కుమార్తె/కుమారుడు/సోద‌రుల పెళ్ళికి, కుటుంబ వైద్య చికిత్స‌లు మొద‌లైన వాటికి పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీ కింద రూ. 1,50,000 వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

  • పీపీఎఫ్ ఖాతా :

పీపీఎఫ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీని వార్షిక ప్రాతిప‌దిక‌న కాంపౌండ్ చేస్తారు. ప్ర‌స్తుత త్రైమాసికానికి వ‌డ్డీ రేటు 8 శాతంగా ఉంది. వార్షికంగా క‌నీసం రూ. 500 మొద‌లుకుని గ‌రిష్టంగా రూ. 1,50,000 వ‌ర‌కు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా ఒక సంవ‌త్స‌రానికి గ‌రిష్టంగా 12 వాయిదాలుగా జ‌మ చేయ‌వ‌చ్చు.

పీపీఎఫ్ ఖాతా 15 సంవ‌త్స‌రాల‌లో మెచ్యూర్ అవుతుంది. ఖాతా ప్రారంభించిన ఏడ‌వ ఆర్ధిక సంవ‌త్స‌రం నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను సెక్ష‌న్ 80C కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. వ‌డ్డీ ఆదాయంపై పూర్తి ఆదాయ‌పు ప‌న్నుమిన‌హాయింపు ఉంటుంది.

  • జీపీఎఫ్ ఖాతా :

ప‌్ర‌భుత్వం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ఆధారంగా ఎప్ప‌టిక‌ప్పుడు వ‌డ్డీ రేట్లు మారుతుంటాయి. జులై 1,2019 నుంచి అమ‌ల్లోకి వచ్చిన వ‌డ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. ఇందులో ప్ర‌భుత్వ ఉద్యోగులు మాత్ర‌మే సభ్యులుగా ఉంటారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు వారి జీతం నుంచి కొంత వాటాన‌ను జీపీఎఫ్ నిధికి చెల్లిస్తారు.

చందాదారుడు సస్పెన్షన్‌లో ఉన్న‌ప్పుడు త‌ప్ప నెల‌వారీగా జీపీఎఫ్ చెల్లించ‌వ‌చ్చు. సూప‌ర్‌యాన్యూటీకి 3 నెల‌ల ముందు చెల్లింపులు నిలిపివేస్తారు. ప‌ద‌వీ విర‌మ‌ణ ఫైన‌ల్ బ్యాల‌న్స్ చెల్లింపుల గురించి సూచ‌న‌లు చేస్తారు. వాటి ప్ర‌కారం జీపీఎఫ్ చెల్లిస్తారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly