ఏడాది నుంచి బ్యాంక్ లాక‌ర్ ఓపెన్ చేయ‌లేదా?

స‌రైన కార‌ణం లేకుండా సంవ‌త్స‌రానికి ఒక‌సారైనా లాక‌ర్‌ను నిర్వ‌హించ‌పోతే బ్యాంకు మీ లాక‌ర్ స‌దుపాయాన్ని ర‌ద్దు చేస్తుంది

ఏడాది నుంచి బ్యాంక్ లాక‌ర్ ఓపెన్ చేయ‌లేదా?

మీరు బ్యాంక్ లాక‌ర్ ఉప‌యోగిస్తున్నారా? స‌ంవ‌త్స‌రానికి ఒక‌సారైనా లాక‌ర్‌ను తెరుస్తున్నారా? రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నియ‌మాల ప్ర‌కారం సంవ‌త్స‌రానికి ఒక‌సారి బ్యాంక్ లాక‌ర్‌ను ఆప‌రేట్ చేయాల్సి ఉంటుంది. లేక‌పోతే మీ బ్యాంక్ లాక‌ర్‌ను తెర‌వ‌చ్చు.

ఆర్థిక లేదా సామాజిక స్థితి, వ్యాపార కార్యకలాపాల స్వభావం, కస్టమర్ల స్థానం, వారి క్లయింట్లు వంటి వివిధ అంశాల ఆధారంగా బ్యాంకులు తమ ఖాతాదారుల‌ను తక్కువ నుంచి అధిక రిస్క్ వ‌ర్గాలుగా విభ‌జిస్తాయి. ఒక వ్యక్తికి లాకర్‌ను కేటాయించే ముందు బ్యాంకులు నిర్థిష్ట ప్ర‌ణాళిక‌ను అనుస‌రిస్తాయి.

అయితే మీరు త‌క్కువ రిస్క్ వ‌ర్గానికి చెందిన వారితే బ్యాంకు మీకు మ‌రికొంత ఎక్కువ స‌మ‌యం ఇవ్వ‌చ్చు. మ‌ధ్య స్థాయి రిస్క్ వ‌ర్గానికి చెందిన వారైతే, లాకర్‌లో మూడేళ్ళ కాలం పాటు ఏలాంటి లావాదేవీలు నిర్వ‌హించ‌క‌పోతే బ్యాంకు మీకు నోటీసులు పంపిస్తుంది. ఈ నోటీసులో లాక‌ర్ను నిర్వ‌హించ‌మ‌ని లేదా లాక‌ర్ అవ‌స‌రం లేక‌పోతే తిరిగి బ్యాంకుకు అప్ప‌గించ‌మ‌ని సూచిస్తుంది.

బ్యాంకు నిబంధన‌ల ప్ర‌కారం, నిర్థిష్ట స‌మ‌యంలో మీరు లాక‌ర్ ఓపెన్ చేయ‌క‌పోతే అందుకు త‌గిన కార‌ణాల‌ను బ్యాంకు వారికి వివ‌రించాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఎన్ఆర్ఐ(ప్ర‌వాస భార‌తీయుడు) అయున్నా… లేదా ఉద్యోగం రీత్యా వేరే ప్ర‌దేశానికి బ‌దిలీ అయినా…ఇత‌ర న్యాయ‌ప‌రమైన కార‌ణాల వ‌ల్ల లాక‌ర్ని నిర్వ‌హించ‌లేక‌పోతుంటే… లాక‌ర్ సౌక‌ర్యాన్ని కొన‌సాగించేందుకు బ్యాంకు వారు అనుమ‌తిస్తారు.

ఒక‌వేళ సరైన వివరణ ఇవ్వడంలో విఫలమైతే, మీరు క్ర‌మం త‌ప్ప అద్దె చెల్లిస్తున్న‌ప్ప‌టికీ , బ్యాంక్ మీ లాక‌ర్ని రద్దు చేసి, మ‌రొక‌రికి కేటాయించవచ్చు. ప్ర‌తీ బ్యాంకు త‌మ ఖాతాదారుల‌కు దీని గురించిన స‌మాచారం అందించాలి. లాక‌ర్ స‌దుపాయాన్ని తీసుకునేప్పుడు చేసుకునే ఒప్పందంలో ఈ అంశం ఉంటుంది.

కొన్ని బ్యాంకులు త‌రుచుగా బ్యాంకు లాక‌ర్ని నిర్వ‌హించ‌మ‌ని త‌మ ఖాతాదారుల‌కు సూచిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా త‌న ఖాతాదారుల‌ను ఆరు నెల‌ల‌కు ఒకసారైనా లాక‌ర్‌ను నిర్వ‌హించ‌మ‌ని చెబుతుంది. ఒక‌వేళ ఏడాది కాలం పాటు నిర్వ‌హించ‌క‌పోతే బ్యాంకు వారు లాక‌ర్ తెరిచే అవ‌కాశం ఉంటుంది.

బ్యాంక్ లాకర్ తెరిచేందుకు ముందు త‌మ న్యాయ సలహాదారులను సంప్రదించాలి. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం బ్యాంకులు న్యాయ స‌ల‌హా దారుని స‌మ‌క్షంలోనే బ్యాంకు లాక‌ర్‌ని తెరిచి అందులో ఉన్న వ‌స్తువుల జాబితాను రూపొందించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly