ఏ పెట్టుబ‌డులకు ఎంత కేటాయించాలి?

పీపీఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరం మదుపు పెంచండి. ఇది మీ పిల్ల‌ల‌ ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది.

ఏ పెట్టుబ‌డులకు ఎంత కేటాయించాలి?

ప్రశ్న : నా పేరు అన్వేష్ టి . వయసు 35, భార్య గృహిణి, బాబు 4 ఏళ్ళు. నా నెల జీతం రూ 46 వేలు . నెల ఖర్చులు రూ 20 వేలు . జీవిత బీమా రూ 1 కోటి 70 లక్షలు. వార్షిక ప్రీమియం రూ 60 వేలు. పీ పీ ఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడులు కలిపి మొత్తం రూ 3.50 లక్షలు. ఇంటి రుణం రూ. 46 లక్షలు.

జవాబు : మీరు తెలిపినట్లుగా మీ జీవిత బీమా హామీని సరిచూసుకోండి. ఒకవేళ కాకపొతే ఈ విధంగా చేయండి.
టర్మ్ జీవిత బీమా పాలసీ : టర్మ్ పాలసీ ని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి.
కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు ఇచ్చే బహుమతి మంచి చదువు. పీ పీ ఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరం మదుపు పెంచండి. ఇది మీ బాబు ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. పదవీవిరమణ నిధి కోసం ఎన్ పీ ఎస్ లో మదుపు చేయండి. 50 శాతం వరకు ఈక్విటీలలో మదుపు చేసే అవకాశం ఉంది కావున, దీర్ఘకాలంలో మంచి నిధిని సమకూర్చుకోవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80సీసీడీ (1బి) కింద అదనంగా రూ 50 వేలు పన్ను మినహాయింపు పొందవచ్చు.
ఇండెక్స్ ఫండ్లలో ఇతర ఫండ్ల కంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి.

దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు. ప్రతి సంవత్సరం మదుపు మొత్తాన్ని పెంచండి. నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి.

బంగారంపై ఇకపై మదుపు చేయకండి.
చిన్న వయసు ఉన్నపుడే ఎక్కువ మదుపు చేయగలుగుతారు. ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని దానికి తగినట్లుగా మదుపు చేసినట్లయితే దీర్ఘకాలంలో అన్ని లక్ష్యాలను చేరుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly