ఆరోగ్య బీమా క్లెయిమ్ విధానం

ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన వివరాలు, విధానం తెలుసుకోవడం ఎంతోముఖ్యం

ఆరోగ్య బీమా  క్లెయిమ్ విధానం

ఆరోగ్య బీమా క్లెయిం చేసుకునేటప్పుడు పలు కీలక పత్రాలు అవసరమవుతాయి. ఆపదలో ఆదుకోవడానికే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటాం. హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన హడావిడిలో మనం ఉంటాం. అలాంటప్పుడు క్లెయిం కోసం కచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి.

వైద్య సహాయ నిమిత్తం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటాం. కొన్ని సార్లు అవుట్‌ పేషెంట్‌గా వెళ్లి చికిత్స పొందుతాం. మరికొన్నిసార్లు ప్రత్యేక రుగ్మతలకు ముందుగానే చికిత్స చేయించుకోవాలని నిశ్చయించుకొని వెళతాం. రోడ్డు ప్రమాదాలు, గుండె జబ్బులు వంటివాటికైతే రోగిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. ఇలా వివిధ సందర్భాలలో ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసుకునేందుకు అవసరమైన వివరాలు, విధానం తెలుసుకోవడం ఎంతోముఖ్యం.

నెట్ వ‌ర్క్ Vs నాన్ నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులు- ఆరోగ్య బీమా క్ల‌యిమ్ ఎక్క‌డ చేస్తే మంచిది?
ప్ర‌స్తుతం ఆరోగ్య‌బీమా పాల‌సీ తీసుకుంటున్న‌వారు ఎక్క‌వ‌గా నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రుల‌నే ఎంచుకుంటున్నారు. క్ర‌మంగా బీమా కంపెనీల నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులు పెర‌గ‌డం దీనికి ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ఇంత‌కీ ఈ నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులంటే ఏంటి? నెట్ వ‌ర్క్ లో లేనివి ఏంటి? త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

రెండింటికి తేడా:
నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులు:
బీమా సంస్థ‌లు కొన్ని ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి . పాలసీదారులు ఈ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందొచ్చు. పాల‌సీదారులు త‌మ‌కు క‌లిగిన అనారోగ్యం బ‌ట్టి ఆసుప‌త్రిని ఎంపిక చేసుకోవచ్చు .

నాన్ నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రులు:
బీమా సంస్థ‌ల‌తో ఒప్పందలేని ఆసుప‌త్రుల‌లో కూడా వైద్యం చేయించుకోవ‌చ్చు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లోనో లేదా మ‌న‌కు న‌మ్మ‌కం ఉన్న ఆసుప‌త్రిలోనో వైద్యం చేయించుకునే పాల‌సీదారులు ముందుగా న‌గ‌దు చెల్లించి, త‌రువాత‌ తగిన పత్రాలు సమర్పించి రీయంబ‌ర్ష్‌మెంట్ చేసుకోవాలి.

ఆరోగ్య బీమా తీసుకునే వారు క్లెయిమ్ చేసుకునేందుకు ఏ ఆసుప‌త్రినైనా ఎంచుకునే సౌల‌భ్యం ఉంటుంది. అయితే బీమా కంపెనీలు పేర్కొన్న నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రుల‌లో ల‌భించే చికిత్స తక్కువగా ఉంటోందని కొంద‌రు ఆరోగ్య బీమా నిపుణులు చెబుతున్నారు. దీనికి కార‌ణం ఆయా ఆసుప‌త్రులు బీమా సంస్థ‌ల‌తో ఒప్పంద కుదుర్చుకుంటాయి.ఈ విధంగా ఒప్పందం కుదుర్చుకునే ఆసుప‌త్రులు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే ఆరోగ్య బీమా పాల‌సీదార్ల‌కు
5-20 శాతం ఛార్జీలు త‌క్కువ తీసుకుంటున్నాయ‌ని వారు చెబుతున్నారు.దీనివల్ల బీమా కంపెనీలకు భారం తగ్గుతుంది కనుక , ప్రీమియం పెంపు పెద్దగా ఉండకపోవచ్చు.

కొన్ని ఆసుప‌త్రుల‌తో జాగ్ర‌త్త‌:
సాధార‌ణంగా బీమా కంపెనీలు త‌మ నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితాలో చేర్చుకునేందుకు కొన్ని ఒప్పందాలు,నియ‌మాలు పాటిస్తాయి. వీలైనంత వ‌ర‌కూ బీమా కంపెనీలు త‌క్కువ ఖ‌ర్చు లో మంచి సేవ‌ల‌ను అందించే వాటిని త‌మ నెట్‌వ‌ర్క్ ప‌రిధిలో చేర్చుకుంటారు.నెట్ వ‌ర్క్ ప‌రిధిలో ఉన్న ఆసుప‌త్రుల‌కు , ఇత‌ర ఆసుప‌త్రుల‌కు వైద్య ప‌రంగా పెద్ద తేడా ఏమీ ఉండకపోవచ్చు.

కొన్ని ఆసుప‌త్రులు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించినా, స‌రైన వైద్య సేవ‌లు క‌ల్పించ‌క‌పోయినా, అధిక ఛార్జీలు వ‌సూలు చేసిన‌ట్లు రుజువైనా బీమా కంపెనీలు వాటిని త‌మ నెట్ వ‌ర్క్ ఆసుప‌త్రుల‌లో చేర్చుకోవు. పాల‌సీదారులు ఈ విష‌యంలో ఏవైనా సందేహాలు ఉంటే బీమా కంపెనీల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

క్లెయిం చేసుకునేందుకు సేకరించాల్సిన పత్రాలు:

  • చికిత్స కోసం ఆసుపత్రిలో చేరేందుకు వైద్యుడి నుంచి సిఫార్సు (అత్యవసర సమయంలో దీని అవసరం ఉండదు).
  • ఆరోగ్య బీమా పాలసీ కాపీ, థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌ (టీపీఏ) జారీచేసే టీపీఏ కార్డు కాపీ సిద్ధంగా ఉంచాలి.
  • ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు, బిల్లులు, రశీదులు వంటివన్నీ సేకరించుకోవాలి.
  • బిల్లులు, రశీదులపై పాలసీదారుడి పేరు, తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి.
  • ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యేటప్పుడు ‘డిశ్ఛార్జి సమ్మరీ’ తీసుకోవాలి.
  • ప్రిస్క్రిప్షన్‌, బిల్లులు, రశీదుల ఫోటోకాపీలను సిద్ధం చేసుకోండి. క్లెయిం చేసేటప్పుడు ఒరిజినల్‌ వాటితో పాటు ఒక సెట్టు ఫోటోకాపీలను ఉంచండి. మన దగ్గర కూడా ఒక సెట్టు ఫోటోకాపీ ఉంచుకోవడం మంచిది.
  • కంపెనీ నుంచి క్లెయిం ఫారం (పత్రాన్ని) పొందాల్సి ఉంటుంది. ఇది ఆయా కంపెనీ/ టిపీఏ వెబ్‌సైట్లో లేదా ఏజెంటు ద్వారా లభిస్తుంది. దాన్ని నింపి అనుబంధ రశీదులు, ప్రిస్కిప్షన్లు తేదీల వారీగా సిద్ధం చేసుకోవాలి.
  • క్లెయిం ఫారంపై పాలసీదారు, డాక్టరు ధ్రువీకరించిన‌ట్టు సంతకం చేయాల్సి ఉంటుంది.
  • చికిత్స ఇంటి వద్ద కూడా కొనసాగే సందర్భంలో డాక్టరు సిఫార్సు పొందాల్సి ఉంటుంది.

నగదు రహిత చికిత్స కోసం అయితే …
నగదు రహిత సదుపాయాన్ని పొందేందుకు బీమా కంపెనీ నియమనిబంధనల మేరకు ముందే అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఒకవేళ ఆసుపత్రి లో చేరుతున్నట్లు ముందుగానే సమాచారం ఉంటె , ఈ విషయాన్ని బీమా కంపెనీ లేదా టిపీఏ కి వీలైనంత త్వరగా తెలియజేయడం మంచిది. ఒకవేళ ఆసుపత్రిలో చేరే విషయం ముందుగానే బీమా కంపెనీకి తెలియచేయలేకపోతే,ఆసుపత్రిలో చేరిన తర్వాత 24 గంటల లోపు ఫోన్‌ ద్వారా లేదా ఈమెయిల్‌ ద్వారా బీమా కంపెనీకి సమాచారం అందించాలి. అప్పుడు క్లెయిం ఇంటిమేషన్‌ సంఖ్యను బీమా కంపెనీ కేటాయిస్తుంది.
టీపీఏ లేదా బీమా కంపెనీ, పాలసీ తీసుకున్న తర్వాత ఓ గుర్తింపు కార్డును జారీచేస్తారు. ఆసుపత్రిలో చేరే సమయంలో దీన్ని చూపించాల్సి వస్తుంది.
ఆసుపత్రి వారు బిల్లులను నేరుగా బీమా సంస్థకు గాని లేదా TPA కు గానీ అందిస్తాయి.

రీయింబర్సుమెంట్ (నగదు రహిత కాని ) క్లెయిం చేసుకునేటప్పుడు ఇలా సంప్రదించాలి…
రోగిని ఆసుపత్రిలో చేర్చే ముందు లేదా చేరిన 24 గంటలలోపు ఆ విషయాన్ని టోల్‌ ఫ్రీ నంబరు ద్వారా లేదా మెయిల్‌ ద్వారా బీమా కంపెనీకి తెలియపర్చాలి.
ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన తర్వాత లేదా చికిత్స ముగిసిన ఏడు రోజుల్లోగా క్లెయిం కోసం బీమా కంపెనీని సంప్రదించి విధివిధానాలను పూర్తిచేయాలి. పైన తెలిపిన పత్రాలన్నీ కంపెనీకి అందచేయాలి .
నియమనిబంధనలకు అనుగుణంగా లేని పత్రాలకు బీమా కంపెనీలు క్లెయిం చెల్లించవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.అన్ని ఆసుపత్రి ఖర్చులను బీమా కంపెనీలు చెల్లించవు. పాలసీ పరిధిలోకి వచ్చేవాటిని మాత్రమే చెల్లిస్తారు. దీని కోసం పాలసీ పత్రాన్ని జాగ్ర‌త్త‌గా పరిశీలించాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly