ఎన్‌పీఎస్ పెట్టుబ‌డుల‌పై అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డం ఎలా?

జాతీయ పింఛ‌ను ప‌థ‌కం(ఎన్‌పీఎస్) అందించే ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకుందాం.

ఎన్‌పీఎస్ పెట్టుబ‌డుల‌పై అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డం ఎలా?

ఉద్యోగుల‌కు ప‌ద‌వీవిర‌మ‌ణ అనంత‌రం ఆదాయం కోసం ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌). ముందుగా 2004లో ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రారంభించిన‌ప్ప‌టికీ 2009 నుంచి అన్ని వ‌ర్గాల వారికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక ఎన్‌పీఎస్ చందాదారుడు పదవీ విరమణ వరకు పెన్షన్ ఖాతాలో డ‌బ్బు పొదుపు చేయ‌వ‌చ్చు. ఫించ‌ను నిధి నియంత్ర‌ణ సంస్థ‌ పీఎఫ్ఆర్‌డీఏ సూచ‌న‌ల‌ను ప్ర‌భుత్వం అంగీక‌రించి, వ‌చ్చే ఏడాది బ‌డ్జెట్‌లో ప్ర‌వేశ‌పెడితే ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డి పెట్టేవారు మ‌రిన్ని ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సీసీడీ(1బి) కింద ఎన్‌పీఎస్‌- టైర్ I ఖాతా పెట్టుబ‌డుల‌పై ప‌న్ను మిన‌హాయింపు ప‌రిమితిని రూ. 1 ల‌క్ష‌కు పెంచాల‌ని ఫించ‌ను నిధి నియంత్ర‌ణ సంస్థ ప్ర‌భుత్వాన్ని కోరింది. ప్ర‌స్తుతం ఈ సెక్ష‌న్ కింద రూ.50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొందే అవ‌కాశం ఉంది. ఎన్‌పీఎస్‌లో చేసే పొదుపును పెంచేందుకు, పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించేందుకు, చందాదారులు ప‌ద‌వీ విర‌మ‌ణ స‌మ‌యంలో లేదా 60 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఎన్‌పీఎస్ నిధిలో 60 శాతాన్ని పన్ను-రహితంగా తీసుకునేందుకు ప్ర‌భుత్వం ఈ సంవ‌త్స‌రం వీలు క‌ల్పించింది. ఇంత‌కు ముందు 40 శాతం ప‌రిమితి ఉండేది.

ఎన్‌పీఎస్ ద్వారా ఆదాయ‌పు ప‌న్ను త‌గ్గించుకోవ‌డం ఎలా?

  1. ఎన్‌పీఎస్‌- టైర్ I ఖాతా పెట్టుబ‌డుల‌పై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80సీసీడీ (1బీ) కింద ప్ర‌స్తుతం రూ.50 వేల వ‌ర‌కు ప‌న్నుమిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఇది వేత‌న జీవివుల‌కు, అదేవిధంగా స్వ‌యం ఉపాది పొందే వారికి వ‌ర్తిస్తుంది. ఈ అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపు ఎన్‌పీఎస్‌, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న చందాదారుల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంది.

  2. దీనికి తోడు ఎన్‌పీఎస్ చందాదారులు వారి స్థూల ఆదాయంపై సెక్ష‌న్ 80సీసీడీ(1) ప్ర‌కారం రూ.1.5 ల‌క్ష‌ల ప‌రిమితి వ‌ర‌కు 10శాతం ఆదాయపు ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. వేత‌న జీవులు కానివారు నిర్థిష్ట ఆర్ధిక‌ సంవ‌త్స‌రం స్థూల ఆదాయంపై 20శాతం వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

  3. సెక్షన్లు 80 సీ, 80సీసీసీ (బీమా సంస్థ ఇచ్చే పెన్షన్ ప్లాన్‌లో పెట్టుబడి), సెక్షన్ 80 సీసీడీ (1) (ఎన్‌పిఎస్ కోసం) కింద మొత్తం మినహాయింపు ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షలు మించ‌కూడ‌దు. అందువ‌ల్ల ఎన్‌పీఎస్ చంద‌దారుడు సెక్ష‌న్ 80సీసీడీ(1బీ) కింద ల‌భించే రూ. 50వేల ప్ర‌యోజ‌నంతో క‌లిపి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు.

  4. సంస్థ ద్వారా చేసే ఎన్‌పీఎస్‌కు కో-కాంట్రీబ్యూట్ పై కూడా సెక్ష‌న్ 80సీసీడీ(2) ప్ర‌కారం అద‌న‌పు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే ఇందుకు యాజ‌మాన్యం అంగీకారం కావాల్సి ఉంటుంది. ఉద్యోగి వేత‌నం(బేసిక్‌+డీఏ)లో 10 శాతం వ‌ర‌కు ఈ సెక్ష‌న్ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

  5. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు సంస్థ కాంట్రీబ్యూష‌న్‌లో 14 శాతం అధిక ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్నుమిన‌హాయింపు కోసం ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలోనే ప్ర‌ణాళిక ప్ర‌కారం పెట్టుబ‌డులు పెట్టాలి. ఒక‌వేళ మీకు ఎన్‌పీఎస్ ఖాతా లేక‌పోతే ఆన్‌లైన్ ద్వారా కూడా ఖాతాను తెరువ‌వ‌చ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly