మ‌రింత సుర‌క్షితం కానున్న కార్డు చెల్లింపులు

కార్డుపై ఉండే సున్నితమైన స‌మాచారం బ‌హిర్గ‌తం కాకుండా టోకెన్ నెంబ‌ర్‌తో చెల్లింపులు చేసే విధానాన్ని టోకెనైజేష‌న్‌ అంటారు.

మ‌రింత సుర‌క్షితం కానున్న కార్డు చెల్లింపులు

న‌గ‌దు ర‌హిత చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ, వినియోగ‌దారుల ఆర్థిక స‌మాచారం రిస్క్ లో పడే అవకాశం కూడా పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలోడిజిటల్ లావాదేవీలను మరింత సురక్షితం చేసేందుకు, అలాగే హ్యాకింగ్ సంబంధిత మోసాలను నివారించేందుకు టోకెనైజేష‌న్‌ సహాయపడుతుంది. ఆర్థిక సేవల సంస్థలు, వ్యాపార సంస్థలు, థర్డ్‌పార్టీ చెల్లింపు సేవలు అందించే సంస్థలు (డిజిటల్‌ వ్యాలెట్లు) అడిగితే, టోకెనైజేషన్‌ సేవలను అందించేందుకు అథీకృత కార్డు చెల్లింపు నెట్‌వర్క్‌లకు ఆర్‌బీఐ అనుమతినిచ్చింది.

టోకెనైజేషన్ అంటే ఏమిటి?

టోకెనైజేషన్ అనేది సున్నితమైన డేటాను ప్రత్యేక గుర్తింపు చిహ్నాలతో భర్తీ చేసే ప్రక్రియ. ఈ విధానంలో మీ క్రెడిట్‌, డెబిట్ కార్డులపై ఉండే 16 అంకెల సంఖ్య, కార్డు గడువు తేదీ, భద్రతా కోడ్‌ లాంటి సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి బదులుగా ఒక నిర్ధిష్ట‌ టోకెన్‌ సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా లావాదేవీలు చేసే సమయంలో కార్డుల సున్నిత సమాచారాన్ని వెల్లడించకుండా, ఈ సంఖ్యను ఉపయోగిస్తే సరిపోతుంది. మీ లావాదేవీ సురక్షితంగా పూర్తవుతుంది. ఈ సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా జ‌రిగే లావాదేవీలు వినియోగ‌దారుడు, కార్డు స్కీమ్ ఆపరేటర్ అనుమతితో మాత్ర‌మే చేయాలి.

ఎక్క‌డ ఉప‌యోగించాలి?

పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీలో మొబైల్ వేలెట్స్‌ వంటి వాటి వ‌ద్ద దీనిని ఉప‌యోగించి చెల్లింపులు చేయ‌వ‌చ్చు. కార్డు నెట్‌వర్క్‌ సంస్థలన్నీ కూడా ఈ టోకెన్‌ సేవలను అందిస్తున్నాయి. మొబైల్‌ లాంటి పరికరాలకు, రిటైలర్లకు, లావాదేవీ విధానం ఆధారంగా టోకెన్లు రకరకాలుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ సేవలు ముందుగా మొబైళ్లు, ట్యాబ్లెట్ల ద్వారానే అందుబాటులో ఉంటాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ విధానం పనితీరుపై సమీక్ష నిర్వహించిన తర్వాత మిగిలిన పరికరాలకు విస్తరిస్తామని తెలిపింది.

రిజస్ట్రేషన్‌:

టోకెన్‌ రిక్వెస్టర్స్‌ యాప్‌ ద్వారా వినియోగదారు పూర్తి సమ్మతితోనే టోకెనైజేషన్‌కు కార్డు రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ సేవల నిమిత్తం వినియోగదారు ఎలాంటి రుసుం చెల్లించనక్కర్లేదని వెల్లడించింది.

ఇప్పటివరకు కార్డుల ద్వారా చెల్లింపులు జరిపేందుకు పీఓఎస్‌ల వద్ద అయితే పాస్‌వర్డ్‌, ఆన్‌లైన్‌ లావాదేవీలకు అయితే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) విధానాన్ని బ్యాంకులు పాటిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపే వీలున్నందునే, కార్డుపై ఉన్న వివరాలన్నీ నమోదు చేశాక, బ్యాంకులో నమోదైన మొబైల్‌ నెంబరుకు ఓటీపీ పంపుతున్నాయి. ఇది సక్రమంగా నమోదు చేస్తేనే లావాదేవీ పూర్తవుతుంది. ఈ కార్యకలాపాల నిర్వహణకు థర్డ్‌పార్టీ సంస్థ (చెల్లింపు గేట్‌వే)లను బ్యాంకులు వినియోగించుకుంటున్నాయి. కొన్ని సందర్భాలలో ఉచిత ఆఫర్లు ఇస్తామంటూ నకిలీ వెబ్‌సైట్లు, మోసగాళ్లు కూడా కార్డులపై వివరాలను తస్కరిస్తున్నారు. ఆర్‌బీఐ నూతన ఆదేశాలు అమల్లోకి వస్తే, అసలు కార్డులపై ఉన్న వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఓటీపీ మాదిరే, టోకెన్‌ నెంబరును తమ ఖాతాదారులకు బ్యాంకులు కేటాయిస్తాయి. ఈ నెంబరును నమోదు చేస్తే సరిపోతుంది. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. నూతన విధానాన్ని అమలు చేసేందుకు బ్యాంకులు చర్యలు ప్రారంభించాల్సి ఉంది. చెల్లింపు గేట్‌వే సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly