ఆదాయానికి త‌గిన‌ ఆర్ధిక ప్రణాళిక

చిన్న వయసు లోనే ఎక్కువగా మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తం సమకూర్చుకోవచ్చు .

ఆదాయానికి త‌గిన‌ ఆర్ధిక ప్రణాళిక

ప్రశ్న: నా పేరు పోతగని పుల్లారావు, 28 ఏళ్ళు . భార్య 22, పాప 1 ఏడాది. నెల జీతం రూ 40 వేలు. నెలసరి ఖర్చులు రూ 15 వేలు. జీవిత బీమా ,ఆరోగ్య బీమా లు ఉన్నాయి. పెట్టుబడులు రూ 3.5 లక్షలు . అప్పులు 6 లక్షలు. ఆర్ధిక ప్రణాళిక తెలుపండి.

జవాబు : మీరు తెలిపిన జీవిత బీమా, ఆరోగ్య బీమా ల హామీ మొత్తం సరిగా రాయలేదు.
టర్మ్ పాలసీ ని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు. బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

మీ ఖర్చులు తక్కువ, పొదుపు సామర్ధ్యం ఎక్కువ , కావున చిన్న వయసు లోనే ఎక్కువగా మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో ఎక్కువ మొత్తం సమకూర్చుకోవచ్చు . దీని కోసం ఈ కింది పధకాలను పరిశీలించండి:
మీ పాప ఫై చదువులు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో మదుపు చేయండి.

ఇంటి కొనుగోలు, పదవీవిరమణ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఎన్ పీ ఎస్ వాటిని పరిశీలించండి:
ఎన్పీఎస్ లో మదుపు చేయడం వల్ల మీరు మంచి పదవీ విరమణ నిధి, పెన్షన్ పొందొచ్చు. ఈక్విటీ లలో 50 శాతం వరకు మదుపు చేసే అవకాశం ఉండటం వలన, దీర్ఘకాలంలో 9-10% వరకు రాబడి ఆశించవచ్చు. ప్రస్తుత నియమాల ప్రకారం 60 సం వయసులో, జమ అయిన నిధి నుంచి పన్ను మినహాయింపు తో 60 శాతం నిధిని పొందవచ్చు. మిగిలిన 40 శాతం ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఇందులో సెక్షన్ 80సి కాకుండా అదనంగా రూ. 50 వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్లలో అనేక రకాలు ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు మొదలు పెడితే కొంత అలవాటు అవుతుంది. ఇండెక్స్ ఫండ్లు ఒక ఇండెక్స్ ని అనుసరించి పెట్టుబడులు పెడతాయి కాబట్టి ఇండెక్స్ ఫండ్లలో ఇతర ఫండ్ల కంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. దీని కోసం మీరు యు టి ఐ నిఫ్టీ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ లో మదుపు చేయండి. దీనిలో వ్యయ నిష్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, దీర్ఘకాలం అంటే పది సంవత్సరాలు చేస్తే మంచి రాబడి పొందవచ్చు.
ప్రతి సంవత్సరం మదుపు మొత్తాన్ని పెంచండి నేరుగా ఫండ్ సంస్థలు, ఇతర వెబ్సైట్ల(www.mfuindia.com, www.kuvera.in, myCAMS/ పేటీఎం మొబైల్ ఆప్ లాంటివి) ద్వారా డైరెక్టు ప్లాన్ లో మదుపు చేయోచ్చు. ఇందులో మీకు కమీషన్ చెల్లించనవసరం లేదు కాబట్టి వీటిలో రాబడి రెగ్యులర్ ప్లాన్ల కంటే 1 నుంచి 2 శాతం వరకు ఎక్కువ ఉంటుంది. కనీసం 10 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయండి.

అత్యవసర నిధి కింద రూ 1 లక్ష ఉంచండి. అధిక వడ్డీ ఫై తీసుకున్న అప్పులను త్వరగా తీర్చేయండి. బంగారం ఫై ఇకపై మదుపు చేయకండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly